కొత్త చరిత్రను లిఖించిన ఇస్రో
శ్రీహరికోట (సూళ్లూరుపేట) : అంతరిక్షంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ (షార్) వేదికగా ఇస్రో తన శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో ఏకంగా 104 ఉపగ్రహాలను ఒకే రాకెట్ ద్వారా బుధవారం ఉదయం విజయవంతంగా ప్రయోగించింది. మొదటి ప్రయోగవేదిక మీద నుంచి పీఎఎస్ఎల్వీ రాకెట్ 104 ఉపగ్రహాలను నిప్పులు చిమ్ముతూ నింగివైపునకు మోసుకెళ్ళింది. అన్ని దశల్లోనూ రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్ళింది. నాల్గవ దశలో ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెడుతూ రాకెట్ పయనించింది. ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసుకున్న పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా 2007లో 10 ఉపగ్రహాలు, 2016 జూన్ 22 పీఎస్ఎల్వీ సీ 34 రాకెట్ ద్వారా 20 ఉపగ్రహాలను పంపించి స్వీయ చరిత్ర తిరగరాసుకుంది.
అయితే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 2013లో 29 ఉపగ్రహాలను, 2014లో రష్యా ఏకంగా 39 ఉపగ్రహాలను పంపించి అగ్రస్థానాల్లో ఉండగా.. నేడు భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ ఏకంగా 104 ఉపగ్రహాలను పంపించడంతో సరికొత్త రికార్డు సాధించింది. 1378 కిలోల బరువు కలిగిన 104 ఉపగ్రహాలను మోసుకెళ్లేందుకు పీఎస్ఎల్వీ సీ37 రాకెట్‌కు మంగళవారం ఉదయం 5.28 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ ప్రయోగం బుధవారం ఉదయం 9.28 గంటలకు ప్రారంభమై 28.42 నిమిషాల్లోనే పూర్తి అయింది. వాణిజ్యపరంగా ఇప్పటి వరకు 79 విదేశీ ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ ద్వారా పంపించారు. ప్రయోగం విజయవంతం కావడంతో షార్ కేంద్రంలో శాస్త్రవేత్తలు ఆనందోత్సాహాలు వ్యక్తంచేశారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. (చదవండి: నింగిలోకి దూసుకెళ్లిన సీ-37)
ఉపగ్రహాలతో ఉపయోగాలు..
సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం ఉదయం 9.28గంటలకు పీఎస్ఎల్వీ సీ-37 ఉపగ్రహ వాహకనౌక ద్వారా మూడు స్వదేశీ ఉపగ్రహాలతో పాటు 101 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. 1378 కిలోలు బరువు కలిగిన 104 ఉపగ్రహాలను భూమికి 505 కి.మీ నుంచి ఎత్తు నుంచి 524 కి.మీలోని సూర్యానువర్తన ధృవ కక్ష్య (సన్ సింక్రోనస్ ఆర్బిట్)లోకి ప్రవేశపెట్టారు. ఇందులో ప్రధానంగా కార్టోశాట్–2డీ ఉపగ్రహం 510 కిలోమీటర్లు ఎత్తు నుంచి భూమి మీద జరిగే మార్పులను ఛాయా చిత్రాలు తీసి పంపుతుంది. అదే విధంగా ఇస్రో నానో శాటిలైట్స్ (ఐఎన్ఎస్–1ఏ, ఐఎన్ఎస్–1బీ) 6 నెలలు మాత్రమే ఉపయోగపడతాయి.
కార్టోశాట్–2డీ..
భౌగోళిక సమాచారం కోసం కార్టోశాట్ ఉపగ్రహాల సిరీస్‌ను 2005లోనే రూపొందించారు. కార్టోశాట్–1, 2, 2ఏ, 2బీ, 2సీ ఉపగ్రహాలను పీఎఎల్‌వీ రాకెట్లు ద్వారానే పంపారు. తాజాగా కార్టోశాట్–2డీను బుధవారం రోదసీలోకి దూసుకెళ్ళింది. 714 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహం 510 కిలోమీటర్లు ఎత్తులోని సూర్యానువర్తన ధృవకక్ష్యలో పరిభ్రమిస్తూ బౌగోళిక పరమైన సమాచారాన్ని అందజేస్తుంది.
ముఖ్యంగా అందులో అమర్చిన ఫ్రాంక్రోమాటిక్ మల్టీ స్ప్రెక్ట్రల్ కెమెరా భూమిని పరిశోధిస్తూ అత్యంత నాణ్యమైన చాయాచిత్రాలను అందిస్తుంది. పట్టణ, గ్రామీణాభివృద్ధి, తీర ప్రాంతపు భూములు, మ్యాప్‌లు తయారు చేయడం, వ్యవసాయ సంబంధితమైన సమాచారం, సాగునీటి పంపిణీ, రోడ్లు గురించిన సమాచారాన్ని క్షుణ్ణంగా అందిస్తుంది. ఈ ఉప గ్రహ చిత్రాలు ఆధారంగా పట్టణాభివృద్దిని చేసుకోవడానికి వీలుకలుగుతుంది. భూమి మీద జరిగే మార్పులను ఎప్పటికప్పుడు ఛాయా చిత్రాలు తీసి పంపుతుంది. ఈ ఉపగ్రహం అయిదేళ్లుపాటు పనిచేస్తుంది.
ఇస్రో నానోశాటిలైట్స్ పనితీరు..
ఇస్రో నానో శాటిలైట్స్ (ఐఎన్ఎస్–1ల, ఐఎన్ఎస్–1బీ) ఉపగ్రహాలను కూడా ఈ ప్రయోగంలో పంపారు. అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ వారు ఈ రెండు చిన్న తరహా ఉపగ్రహాలను తయారు చేశారు. రెండు ఉపగ్రహాలు కలిపి 18. 1 కేజీలు బరువు వున్నాయి. 8.4 కేజీల బరువు కలిగిన ఐఎన్ఎస్–1ఏ ఉపగ్రహంలో 5 కేజీల బరువు కలిగిన పేలోడ్స్‌ను అమర్చారు. ఇందులో బిడిరెక్షనల్ రెఫ్లెక్టెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ రేడియో మీటర్ (బీఆర్‌డీఎప్), సింగల్ ఈవెంట్ అప్సెట్ మానిటర్ (ఎస్‌ఈయూఎం) పేలోడ్స్ అమర్చారు.
ఇది కూడా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ కావడం విశేషం. ఈ పేలోడ్‌తో భూమిమీద పడే సూర్య ప్రతాపాన్ని తెలియజేస్తుంది. భూమి మీద రేడియేషన్ ఎనర్జీని మధింపు చేస్తుంది. ఇది కేవలం ఆరు నెలలు మాత్రమే పనిచేస్తుంది. 9.7 కేజీలు బరువు కలిగి ఐఎన్ఎస్–1బీ ఉపగ్రహం ఎర్త్ ఎక్సోస్పియర్ లేమాన్ ఆల్ఫా అనాలసిసర్ (ఈఈఎల్‌ఏ), ఆర్గామీ కెమెరా పేలోడ్స్ పంపారు. రిమోట్ సెన్సింగ్ కలర్ కెమెరా ఇది కూడా భూమికి సంబంధించిన సమాచారం అందజేస్తుంది.
డౌవ్ శాటిలైట్స్, లీమూర్ ఉపగ్రహాల పనితీరు..
ఆమెరికాకు చెందిన డౌవ్ ఫ్లోక్–3పీ శాటిలైట్స్‌లో 88 చిన్న తరహా ఉపగ్రహాలుంటాయి. ఇవన్నీ ఒక బాక్స్‌లో అమర్చి ఉంచారు. ఈ బాక్స్ స్పేస్‌లోకి వెళ్లగానే అమెరికా అంతరిక్ష సంస్థ భూకేంద్రం వారు దీన్ని గ్రౌండ్ స్టేషన్ నుంచి ఓపెన్ చేయడంతో అందులో వున్న 88 ఉపగ్రహాలు స్పేస్‌లోకి వస్తాయి. వీటి ద్వారా వాణిజ్యపరమైన, వాతావరణ సంబంధమైన సమాచారాన్ని ప్రతి రోజు తెలియజేస్తాయి. లీమూర్ ఉపగ్రహాల వ్యవస్థలో మొత్తం 8 ఉపగ్రహాలుంటాయి. వీటిని కూడా ఓపెన్ చేసిన తరువాత పనిచేయడం ప్రారంభిస్తాయి. ఇవి కూడా భూమికి సంబంధించిన సమాచారాన్నే అందిస్తాయి.
విదేశీ ఉపగ్రహాలు...
నెదర్లాండ్‌కు చెందిన 3 కేజీల బరువైన పీయాస్, స్విట్జర్లాండ్‌కు చెందిన 4.2 కేజీల డిడో–2, ఇజ్రాయెల్‌కు చెందిన 4.3 బీజీయూ శాట్, కజికిస్తాన్‌కు చెందిన 1.7 కేజీల ఆల్–ఫరాబి–1, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన 1.1 కేజీల బరువు కలిగిన నాయిప్ అనే ఉపగ్రహాలు కూడా టెక్నాలజీ డిమానుస్ట్రేషన్‌కు ఉపయోగించారు. చిన్న చిన్న అప్లికేషన్స్ తయారు చేసేందుకు ఈ చిన్న తరహా ఉపగ్రహాలను వినియోగించారు.
ప్రముఖుల అభినందనలు
ప్రపంచ దేశాల్లో భారత్‌ను ఎదురులేని శక్తిగా నిలబెట్టిన ఇస్రోకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు అభినందనలు తెలిపారు.
Congratulations to @isro for the successful launch of PSLV-C37 and CARTOSAT satellite together with 103 nano satellites!
— Narendra Modi (@narendramodi) February 15, 2017
I urge ISRO to continue to strive for the progress of our space capabilities #PresidentMukherjee
— President of India (@RashtrapatiBhvn) February 15, 2017
Congrats to ISRO on the record breaking launch of PSLV–C37 with 104 satellites. A truly proud moment for India.
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 15, 2017
Overwhelmed to witness this magnificent feat by @isro in launching 104 satellites. A proud moment for all Indians. Salute to the team! #ISRO
— N Chandrababu Naidu (@ncbn) February 15, 2017