నింగిలోకి దూసుకెళ్లిన సీ-37
భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్‌ఎల్వీ సీ-37(104 ఉపగ్రహాల ప్రయోగం) రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
శ్రీహరికోట: భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్‌ఎల్వీ సీ-37(104 ఉపగ్రహాల ప్రయోగం) రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. బుధవారం ఉదయం 9.28 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ సీ-37 గగనతలంలోకి ప్రయాణం మొదలు పెట్టింది. మొత్తం నాలుగు దశల్లో ప్రయోగం పూర్తవుతుంది. ఈ ప్రయోగం ద్వారా మూడు స్వదేశీ, 101 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిస్తున్నారు.
ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి చేరేవి
714 కిలోల బరువైన కార్టోశాట్ 2డీ, ఇస్రో నానో శాటిలైట్స్ అయిన ఐఎన్ ఎస్–1ఏ, ఐఎన్ ఎస్–1బీలు స్వదేశీ ఉపగ్రహాలు. విదేశీ ఉపగ్రహాల్లో 96 అమెరికాకు చెందినవి కాగా, ఇజ్రాయెల్, కజకిస్తాన్ , నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యూఏఈ దేశాలకు చెందిన ఒక్కో ఉపగ్రహం కూడా ఈ ప్రయోగంలో పాలుపంచుకుంటున్నాయి. కార్టొశాట్ 2డీ ఉపగ్రహం రిమోట్ సెన్సింగ్ సేవలను ఐదేళ్ల పాటు అందిస్తుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను పంపిన తొలిదేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది. గతంలో రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ ఒకే రాకెట్‌తో 37 ఉపగ్రహాలను విజయవంతంగా పంపించింది.
జూన్ 2015లో ఇస్రో సైతం ఒకే ప్రయోగంలో 23 శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మంగళవారం ఉదయం కౌంట్‌డౌన్ ప్రారంభమైన వెంటనే రాకెట్‌కు నాలుగో దశలో అవసరమైన 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ దశలో మోనో మిథైల్ హైడ్రోజన్ (ఎంఎంహెచ్), మిక్స్‌డ్ ఆక్సిడైజడ్ ఆఫ్ నైట్రోజన్ (ఎంఓఎన్ –3) ఇంధనాన్ని నింపారు. అనంతరం నాలుగో దశకు అన్ని పరీక్షలు చేసి బాగుంది అని నిర్ధారించుకున్నాక సోమవారం రాత్రి రెండోదశలో అవసరమైన 42 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టారు. అనంతరం ఇంధనం నింపే ప్రక్రియను పూర్తి చేసి రాకెట్‌కు అవసరమైన హీలియం, నైట్రోజన్ గ్యాస్ ఫిల్లింగ్.. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను అప్రమత్తం చేసి ప్రయోగానికి సిద్ధమయ్యారు.