పులుల సంరక్షణకు ప్రత్యేక బలగాలు
- అటవీ శాఖ ప్రతిపాదనలకు ఎన్టీసీఏ ఆమోదం
- పోలీసులు, పారా మిలిటరీ తరహాలో శిక్షణ
సాక్షి, హైదరాబాద్: పులులను సంరక్షించేందుకు ప్రత్యేక బలగాలను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అటవీ శాఖ పంపిన ప్రతిపాదనలకు జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్టీసీఏ- ప్రాజెక్టు టైగర్) ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని 9 అభయారణ్యాలకు గాను, పులుల ఉనికిని గుర్తించిన 2 అభయారణ్యాలను టైగర్ రిజర్వుగా ప్రకటించారు. వీటిలో ఒకటి దేశంలోనే అతి పెద్దదైన అమ్రాబాద్ టైగర్ రిజర్వు (3,568 చదరపు కిలోమీటర్లు)కాగా, మరొకటి కవ్వాల్ టైగర్ రిజర్వు (892.23 చదరపు కిలోమీటర్లు). టైగర్ రిజర్వు విస్తీర్ణాన్ని కోర్, బఫర్ ఏరియాలుగా వర్గీకరించారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కోర్ ఏరియాకు ఫీల్డ్ డెరైక్టర్ను నియమించి బఫర్ ఏరియాను కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు పరిధిలో చేర్చారు. పులుల సంరక్షణలో కీలకమైన కోర్ ఏరియాలో నూతనంగా నియమించే ప్రత్యేక బలగాలను మోహరిస్తారు. ఒక్కో టైగర్ రిజర్వుకు 120 మంది చొప్పున 240 మంది సిబ్బందిని నియమిస్తారు. ప్రస్తుతం అటవీ శాఖ క్షేత్ర స్థాయి సిబ్బందిలో ఎక్కువ మంది 40-50 ఏళ్ల మధ్య వయసు వారు ఉండడంతో శారీరక దృఢత్వం లేక స్మగ్లర్లు, వన్యప్రాణి వేటగాళ్ల నియంత్రణలో విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో టైగర్ రిజర్వులో పనిచేసే బలగాల్లో ఆయుధాల వినియోగంలో సుశిక్షితులైన 40 ఏళ్ల లోపు వారినే నియమిస్తారు.