R and B road development
-
22 రోడ్ల విస్తరణకు రూ.540 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి దిశగా మరో ముందడుగు పడింది. కేంద్ర రహదారుల మౌలిక వసతుల అభివృద్ధి నిధి (సీఆర్ఐఎఫ్) నుంచి రాష్ట్రంలో 22 రహదారులను విస్తరించి.. కొత్త రోడ్లు నిర్మించే ప్రణాళికను ఆమోదించారు. ఇందులో భాగంగా మొత్తం 319 కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి చేయనున్నారు. వాటిలో జిల్లా ప్రధాన రహదారులు 13, రాష్ట్ర హైవేలు 7, ఇతర రహదారులు 2 ఉన్నాయి. జిల్లా కేంద్రాలు, జాతీయ రహదారిని అనుసంధానించే ప్రధాన రహదారులను సీఆర్ఐఎఫ్ నిధులతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు ప్రతిపాదనలను రూపొందించి కేంద్ర ఉపరితల రవాణా శాఖకు సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం తొలి దశలో 9 రహదారులు, మలి దశలో 13 రహదారుల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపింది. కాగా, ఈ ప్రణాళికపై సంతృప్తి చెందిన కేంద్ర ప్రభుత్వం ఒకే దశ కింద మొత్తం 22 రహదారుల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఇందుకోసం ఏకంగా రూ.540 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఆ రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులను ఆర్ అండ్ బీ శాఖ చేపడుతుంది. త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టి ఏడాదిలో ఈ రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
ఆరేళ్లకు మోక్షం..
సాక్షి, కరీంనగర్ కార్పొరేషన్: కమాన్‌రోడ్డు అభివృద్ధికి అడ్డంకులు తొలగిపోయాయి. కమాన్ రోడ్డు విస్తరణ చేపట్టిన ఆరేళ్ల తర్వాత పూర్తి అడ్డంకులు తొలిగాయి. 2012లో రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపట్టగా.. కమాన్‌రోడ్డులోని కొంత మంది కోర్టును ఆశ్రయించారు. దీంతో కొన్ని భవనాలు కూల్చకుండా వదిలేయడంతో అభివృద్ధి పనులకు ఇబ్బందిగా మారింది. దశల వారీగా కోర్టు స్టేలు వెకేట్ అయిన ఇళ్లను తొలగిస్తూ వచ్చారు. చివరగా సిక్వాడీ చౌరస్తాలో అడ్డంకిగా ఉన్న ఇంటికి సంబంధించి వివాదం తొలగిపోవడంతో ఆరేళ్ల తర్వాత రోడ్డుకు మోక్షం లభించింది. ఇటీవల నగరపాలక సంస్థ మేయర్, కమిషనర్ చొరవ తీసుకొని సదరు ఇంటి యజమానితో మాట్లాడి వివాదం తొలగిపోయేలా చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఆ ప్రాంతంలో డ్రెయినేజీ పూర్తికాలేదు. రోడ్డు పనులు మద్యమధ్యలో నిలిచిపోయాయి. నిలిచిన అభివృద్ధి పనులు కమాన్ నుంచి వన్‌టౌన్ వరకు రోడ్డును వందఫీట్లుగా మార్చేందుకు 2012 సంవత్సరంలో రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపట్టారు. దాదాపు ఆరు నెలల పాటు ఆ రోడ్డంతా ఇబ్బందిగా మారింది. కొంత మంది కోర్టును ఆశ్రయించడంతో అభివృద్ధికి అడ్డంకిగా మారింది. రోడ్డు పనులు చేపట్టడం ఇబ్బందికరంగా మారింది. 14.5 కిలోమీటర్ల రోడ్డులో కేవలం కమాన్ నుంచి వన్‌టౌన్ రోడ్డులో మాత్రమే అభివృద్ధి నిలిచింది. అన్ని రోడ్లు పూర్తయి ఒక్క రోడ్డులో అందులో కరీంనగర్ ముఖద్వారంగా ఉన్న కమాన్‌రోడ్డులో పనులు నిలిచిపోయే సరికి మేయర్, కమిషనర్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆదివారం ఇంటి యజమానిని ఒప్పించి ఆదివారం ఎంక్రోచ్‌మెంట్‌లను తొలగించారు. అభివృద్ధికి సహకరించాలి నగరంలో అభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలి. చిన్నచిన్న ఎంక్రోచ్మెంట్లు ఉంటే స్వయంగా ఇంటి యజమానులే తీసివేసుకుంటే ఇబ్బందులు ఉండవు. నిర్మాణాలకు కూడా ఎలాంటి డ్యామేజీ కాదు. ఒక్కరిద్దరి కారణంగా అభివృద్ధిపై ప్రభావం ఉండకూడదు. నగరపౌరులుగా నగర అభివృద్ధి తోడ్పాటునందించాలి. - రవీందర్‌సింగ్, నగర మేయర్ -
ఉపాధికి రోడ్డు పోటు
సాక్షి, హుజూరాబాద్: రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయంటే రోడ్డుకు ఇరు వైపుల భూములు, ఇళ్లు ఉన్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్లే రహదారి విస్తరణ వల్ల తీరని నష్టం జరుగుతుందని రైతులు వాపోతున్నారు. తమ న్యాయపరమైన సమస్యను పరిష్కారించాలని కోరుతూ సింగాపూర్, బోర్నపల్లి గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం ఆర్డీవో బోయపాటి చెన్నయ్యకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగాపూర్, బోర్నపల్లి గ్రామాల మీదుగా నేషనల్ హైవే కోసం రోడ్డు విస్తరణ కోసం వ్యవసాయ భూముల సేకరణ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారని, రోడ్డు విస్తరణ మూలంగా తమ వ్యవసాయ భూములను కోల్పోతే జీవనోపాధి కోల్పోతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 110 ఫీట్ల రోడ్డును మాత్రమే వెడల్పు చేయాలని, ప్లైఓవర్‌ను అవసమున్న చోట నిర్మించాలని కోరారు. ప్రజలకు ఇబ్బంది పెట్టే పనులను ప్రభుత్వం మానుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామాల రైతులు నిరంజన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి రజనీకర్‌రెడ్డి, రజనీ, చంద్ర ప్రకాష్‌రెడ్డి, శీను, రాజయ్య, రవీందర్, శ్రీనివాస్, రాజ్‌కుమార్,మల్లెష్, చంద్రశేఖర్, చక్రపాణి, శ్రీనివాస్, సతీష్‌కుమార్, అంజయ్య, తిరుపతి పాల్గొన్నారు. -
రోడ్లు తళతళ!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గతుకుల రోడ్లకు చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ సర్కార్ భారీగా నిధులు కేటాయించింది. జిల్లాలోని గ్రామీణ రోడ్లతోపాటు ఆర్అండ్బీ రోడ్ల మరమ్మతు, అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి జిల్లా విలేకరులతో టెలీమీట్‌లో మాట్లాడారు. జిల్లాలో 2009 ముందు గ్రామీణ ప్రాంతాలకు వేసిన బీటీ రోడ్లను పునరుద్ధరిస్తామన్నారు. ఇందుకోసం కిలోమీటరు రోడ్డు రూ.13 లక్షలు ఖర్చు చేయనున్నామని, మొత్తం 1,528 కిలోమీటర్ల రోడ్లు పనుల కోసం రూ.209 కోట్లు కేటాయించినట్లు హరీష్‌రావు తెలిపారు. బ్రిడ్జిలు, కాజ్‌వేల పనుల కోసం మరో రూ.40 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుందని తెలిపారు. దీంతో పాటు జిల్లాలో సుమారు 500 కిలో మీటర్ల మేరకు ఇప్పటివ రకు ఉన్న మట్టి, కంకర రోడ్లను తొలగించి పూర్తి స్థాయి బీటీ రోడ్డు వేస్తామని మంత్రి తెలిపారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.200 కోట్లు కేటాయించినట్లు హరీష్‌రావు వివరించారు. బీటీ రోడ్డు నిర్మాణం కోసం కిలోమీటరుకు రూ.49 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. గతంలో ఇది రూ.39 లక్షలు ఉండగా, పనుల నాణ్యత, నిర్వహణను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిధులు ఎక్కువగా ఇచ్చిందన్నారు. అంతేకాకుండా 5 సంవత్సరాల వరకు రోడ్డు చెడిపోకుండా కాంట్రాక్టరే చూసుకోవాల్సి ఉంటుందన్నారు. నిర్ణీత కాలంలోపు రోడ్లు గుంతలు పడితే కాంట్రాక్టరే మరమ్మతు చేయించే విధంగా నిబంధనలు రూపొందించినట్లు హరీష్‌రావు తెలిపారు. తండాల్లోనూ రోడ్లు ఇప్పటి వరకు పిల్లబాటలు కూడా లేని తండాలు, మదిర గ్రామాలకు మట్టి రోడ్లు వేస్తామని హరీష్‌రావు తెలిపారు. ప్రభుత్వం రహదారుల నిర్మాణ పనుల్లో తండాలు, మారుమూల ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. జిల్లాలో 2 వేల కిలోమీటర్ల మేర ఫార్మేషన్ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.70 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దీంతోపాటు బ్రిడ్జిల నిర్మాణం కోసం మరో రూ.40 కోట్లు అదనంగా నిధులు వెచ్చించనుందన్నారు. జిల్లాలోని పది నియోజకవర్గాల్లో బీటీ రోడ్ల రెన్యూవల్ కోసం ప్రభుత్వం నియోజకవర్గాల వారీగా నిధులు కేటాయించిందని తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గానికి రూ.27 కోట్లు, సిద్దిపేటకు రూ.13 కోట్లు, మెదక్‌కు రూ.20 కోట్లు, దుబ్బాకకు రూ.17 కోట్లు, సంగారెడ్డికి రూ.16 కోట్లు, పటాన్‌చెరుకు రూ.10 కోట్లు, నర్సాపూర్‌కు రూ.32 కోట్లు, జహీరాబాద్‌కు రూ. 32 కోట్లు, నారాయణఖేడ్‌కు రూ.25 కోట్లు, అందోలు నియోజకవర్గానికి రూ.20 కోట్లు చొప్పున నిధులు కేటాయించినట్లు హరీష్‌రావు తెలిపారు. డిసెంబర్లోనే టెండర్లు రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాలకు నిధులు కేటాయించినట్లు హరీష్‌రావు తెలిపారు. గతంలో తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిద్దిపేటకు నిధులు కేటాయించమని ఎన్నిసార్లు అడిగినా... అప్పటి ప్రభుత్వాలు రూపాయి కూడా ఇవ్వకుండా వివక్ష చూపాయని గతాన్ని గుర్తు చేశారు. ఆ బాధ తమకు తెలుసుకాబట్టే ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాలకు నిధులు కేటాయించారని చెప్పారు. బీటీ రోడ్ల పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు సంబంధించి డిసెంబర్ నెలలో టెండర్లు పిలుస్తామని, మే నెలాఖరు నాటికి దాదాపు 80 శాతం రోడ్లను పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామన్నారు. ఇవేకాకుండా ఆర్అండ్బీ శాఖ కింద రోడ్ల విస్తరణ కోసం రూ.600 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి హరీష్‌రావు వివరించారు.