రోడ్లు తళతళ!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గతుకుల రోడ్లకు చెక్ పెట్టేందుకు టీఆర్‌ఎస్ సర్కార్ భారీగా నిధులు కేటాయించింది. జిల్లాలోని గ్రామీణ రోడ్లతోపాటు ఆర్‌అండ్‌బీ రోడ్ల మరమ్మతు, అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి జిల్లా విలేకరులతో టెలీమీట్‌లో మాట్లాడారు. జిల్లాలో 2009 ముందు గ్రామీణ ప్రాంతాలకు వేసిన బీటీ రోడ్లను పునరుద్ధరిస్తామన్నారు.
ఇందుకోసం కిలోమీటరు రోడ్డు రూ.13 లక్షలు ఖర్చు చేయనున్నామని, మొత్తం 1,528 కిలోమీటర్ల రోడ్లు పనుల కోసం రూ.209 కోట్లు కేటాయించినట్లు హరీష్‌రావు తెలిపారు. బ్రిడ్జిలు, కాజ్‌వేల పనుల కోసం మరో రూ.40 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుందని తెలిపారు. దీంతో పాటు జిల్లాలో సుమారు 500 కిలో మీటర్ల మేరకు ఇప్పటివ రకు ఉన్న మట్టి, కంకర రోడ్లను తొలగించి పూర్తి స్థాయి బీటీ రోడ్డు వేస్తామని మంత్రి తెలిపారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.200 కోట్లు కేటాయించినట్లు హరీష్‌రావు వివరించారు.
బీటీ రోడ్డు నిర్మాణం కోసం కిలోమీటరుకు రూ.49 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. గతంలో ఇది రూ.39 లక్షలు ఉండగా, పనుల నాణ్యత, నిర్వహణను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిధులు ఎక్కువగా ఇచ్చిందన్నారు. అంతేకాకుండా 5 సంవత్సరాల వరకు రోడ్డు చెడిపోకుండా కాంట్రాక్టరే చూసుకోవాల్సి ఉంటుందన్నారు. నిర్ణీత కాలంలోపు రోడ్లు గుంతలు పడితే కాంట్రాక్టరే మరమ్మతు చేయించే విధంగా నిబంధనలు రూపొందించినట్లు హరీష్‌రావు తెలిపారు.
తండాల్లోనూ రోడ్లు
ఇప్పటి వరకు పిల్లబాటలు కూడా లేని తండాలు, మదిర గ్రామాలకు మట్టి రోడ్లు వేస్తామని హరీష్‌రావు తెలిపారు. ప్రభుత్వం రహదారుల నిర్మాణ పనుల్లో తండాలు, మారుమూల ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. జిల్లాలో 2 వేల కిలోమీటర్ల మేర ఫార్మేషన్ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.70 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దీంతోపాటు బ్రిడ్జిల నిర్మాణం కోసం మరో రూ.40 కోట్లు అదనంగా నిధులు వెచ్చించనుందన్నారు.
జిల్లాలోని పది నియోజకవర్గాల్లో బీటీ రోడ్ల రెన్యూవల్ కోసం ప్రభుత్వం నియోజకవర్గాల వారీగా నిధులు కేటాయించిందని తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గానికి రూ.27 కోట్లు, సిద్దిపేటకు రూ.13 కోట్లు, మెదక్‌కు రూ.20 కోట్లు, దుబ్బాకకు రూ.17 కోట్లు, సంగారెడ్డికి రూ.16 కోట్లు, పటాన్‌చెరుకు రూ.10 కోట్లు, నర్సాపూర్‌కు రూ.32 కోట్లు, జహీరాబాద్‌కు రూ. 32 కోట్లు, నారాయణఖేడ్‌కు రూ.25 కోట్లు, అందోలు నియోజకవర్గానికి రూ.20 కోట్లు చొప్పున నిధులు కేటాయించినట్లు హరీష్‌రావు తెలిపారు.
డిసెంబర్‌లోనే టెండర్లు
రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాలకు నిధులు కేటాయించినట్లు హరీష్‌రావు తెలిపారు. గతంలో తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిద్దిపేటకు నిధులు కేటాయించమని ఎన్నిసార్లు అడిగినా... అప్పటి ప్రభుత్వాలు రూపాయి కూడా ఇవ్వకుండా వివక్ష చూపాయని గతాన్ని గుర్తు చేశారు. ఆ బాధ తమకు తెలుసుకాబట్టే ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాలకు నిధులు కేటాయించారని చెప్పారు. బీటీ రోడ్ల పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు సంబంధించి డిసెంబర్ నెలలో టెండర్లు పిలుస్తామని, మే నెలాఖరు నాటికి దాదాపు 80 శాతం రోడ్లను పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామన్నారు. ఇవేకాకుండా ఆర్‌అండ్‌బీ శాఖ కింద రోడ్ల విస్తరణ కోసం రూ.600 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి హరీష్‌రావు వివరించారు.