Raghuraj Pratap Singh
-
నా కళ్లు తెరిపించాడు: అఖిలేశ్
సాక్షి, లక్నో: ఇటీవల గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీఎస్పీ సహకారంతో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే అనంతరం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఎస్పీ సహకారం అందించినా బీఎస్పీ అభ్యర్థి మాత్రం ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. బీఎస్పీ ఓటమి కంటే కూడా తమకు మద్దతిస్తున్న నేతల చర్యలతోనే ఎక్కువ నష్టం జరగిందని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. తన కళ్లు ఇప్పటికైనా తెరుచుకున్నాయని కొన్ని విషయాలు ప్రస్తావించారు. తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని మాజీ సీఎం మాయావతిపై తీవ్ర విమర్శలు చేసిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా ఇకపై ఎస్పీ మద్దతుదారుడిగా కొనసాగరని అఖిలేశ్ అన్నారు. తన ఓటు కచ్చింగా ఎస్పీకే చెందుతుందని రాజా భయ్యా చెప్పగా ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసిన అఖిలేశ్ అనంతరం ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. మాకు సహకరించే వ్యక్తి అని నమ్మినప్పుడు ట్వీట్ చేశాను.. కానీ మా నమ్మకాన్ని వమ్ము చేయడంతో పోస్ట్ తొలగించానని అఖిలేశ్ తెలిపారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికలతో రాజా భయ్యా తన కళ్లు తెరిపించాడని, ఆయనను నమ్మవద్దని మాయావతి చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా అఖిలేశ్ గుర్తుచేశారు. బీజేపీ ఇచ్చిన విందు పార్టీకి రాజా భయ్యా హాజరుకావడం కూడా అఖిలేశ్, మాయావతిలకు మింగుడు పడటం లేదు. తొలుత లోక్‌సభ ఉప ఎన్నికల వరకే బీఎస్పీ-ఎస్పీ పొత్తు కొనసాగుతుందని చెప్పిన మాయావతి రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాట్లాడుతూ.. మా మైత్రి ఇంకా కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు గోరఖ్‌పూర్, ఫూల్పుర్ ఉప ఎన్నికల ఫలితాలు తమ కూటమికి, పార్టీ కార్యకర్తలకు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయని, రాబోయే ఎన్నికల్లో కూడా తమ కూటమికే మొగ్గు చూపుతున్నట్లు అఖిలేశ్ సైతం ప్రకటించిన విషయం తెలిసిందే. -
నన్ను జైల్లో పెట్టించారు.. ఆ పార్టీకి ఓటేయను!
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 10 రాజ్యసభ సీట్లకు జరిగిన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ 8, ఎస్పీ ఒక స్థానంలో సులభంగా గెలిచేందుకు అవకాశం ఉండగా.. పదో స్థానం కోసం బీజేపీ అదనంగా బరిలో దించిన అభ్యర్థికి, బీఎస్పీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్ని విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో తన ఓటు బీఎస్పీ అధినేత్రి మామావతి పార్టీకి మాత్రం కచ్చితంగా కాదని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా అన్నారు. తన ఓటు సమాజ్‌వాదీ పార్టీకి చెందుతుందన్నారు. ఓటేసిన అనంతరం రఘురాజ్ ప్రతాప్ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో నాపై తప్పుడు కేసులు బనాయించి అప్పటి సీఎం మాయావతి నన్ను జైలుకు పంపారు. ఆ మరుసటి ఏడాది (2003లో) ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సీఎం అయ్యాక నాపై నమోదైన తప్పుడు కేసుల నుంచి విముక్తి కల్పించారు. అందుకే ఎస్పీకి, ములాయం, అఖిలేశ్‌లంటే ఎంతో గౌరవం ఇస్తానన్నారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి బీంరావ్ అంబేద్కర్‌కు ఎస్పీ మద్దతు ఇస్తోంది కదా. మీ ఓటు బీఎస్పీకి వెళ్తుందా అని మీడియా రాజా భయ్యాను అడగగా ఆ ఎమ్మెల్యే ఇలా స్పందించారు. 'నా ఓటు ఎస్పీకే చెందుతుంది. ఎస్పీ-బీఎస్పీ పొత్తు గురించి నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ అన్యాయంగా నాపై కేసులు బనాయించి జైల్లో పెట్టించిన మామావతి పార్టీ (బీఎస్పీ)కి మాత్రం నా ఓటు ఎప్పటికీ చెందదంటూ' ఉద్వేగానికి లోనయ్యారు. దీనిపై అఖిలేశ్ స్పందిస్తూ.. సమాజ్ వాదీ పార్టీకి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు అఖిలేశ్. రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా 1993 నుంచి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతాప్‌ఘడ్ లోని కుండా నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందుతున్న విషయం తెలిసిందే.