Railway problems
-
'రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి'
తిరుపతి: రైల్వే సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ వరప్రసాద్ చెప్పారు. గురువారమిక్కడ ఆయన మాట్లాడుతూ...ఇప్పటికే నగరంలోని అనేక సమస్యలు పరిష్కారించామన్నారు. తిరుపతి నుంచి షిర్డికి ప్రత్యేక రైలు వేయించినట్లు వరప్రసాద్ చెప్పారు. 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నడికుడి రైల్వే ట్రాక్ నిర్మాణ పనులను ఇప్పటికే ప్రారంభించామన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన ప్రతిహామీని నెరవేరుస్తామని ఆయన అన్నారు. -
రైల్వే సమస్యలను పరిష్కరించండి
నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రైల్వే సమస్యలను పరిష్కారానికి చొరవ చూపాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రైల్వే జోనల్ మేనేజర్ రవీంద్రగుప్తాను కోరారు. హైదరాబాద్‌లోని రైల్వే జోనల్‌మేనేజర్‌తో సోమవారం ఆయన సమావేశమయ్యారు. ఎంపీ మేకపాటి మాట్లాడుతూ ముఖ్యంగా సింహపురి ఎక్స్‌ప్రెస్ వేళల్లో మార్పులు చేయాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న వేళలతో ప్రయాణికులకు చాలా ఇబ్బంది కరంగా ఉందన్నారు. అక్టోబర్‌లోపు సింహపురి వేళల్లో మార్పులు తీసుకొస్తే ప్రయాణికులకు ఉపయోగంగా ఉంటుందన్నారు. నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్లకు దక్షిణంవైపు రైల్వేకు సంబంధించి దాదాపుగా ఎకరా స్థలం ఉందన్నారు. ఈ ప్రదేశంలో రైల్వే మల్టిప్లెక్స్ కట్టిస్తే రైల్వేకు కూడా ఆదాయం వస్తుందన్నారు. నెల్లూరు ప్రదాన రైల్వే స్టేషన్‌తో పాటు దక్షిణ స్టేషన్, పడుగుపాడు, వేదాయపాళెం, కావలి, బిట్రగుంట, ఉలవపాడు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు అవసరమైన పలు ప్రతిపాదనలు చేసినట్లు ఎంపీ పేర్కొన్నారు. నెల్లూరు-తిరుపతి, నెల్లూరు-చెన్నైకి నిత్యం ఎంతో మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారన్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మెము రైళ్లను పెంచితే ఉపయోగంగా ఉంటుందన్నారు. నెల్లూరు నుంచి సుదూర ప్రాంతాలకు వ్యాపారులు, విద్యార్థులు ప్రయాణాలు సాగిస్తున్నారన్నారు. వీరి కోసం నెల్లూరు స్టేషన్లో కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపితే రైల్వేకు ఆదాయంతో పాటు ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. స్పందించిన జోనల్ మేనేజర్ జిల్లాలోని రైల్వే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ పేర్కొన్నారు. -
రేపు ఇచ్ఛాపురం బంద్
శ్రీకాకుళం (ఇచ్ఛాపురం): రైల్వే సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇచ్ఛాపురంలోని అన్ని వర్గాల సంఘాలు గురువారం నాడు బంద్‌కు పిలుపునిచ్చారు. ఇచ్ఛాపురం పట్టణంలో అత్యవసరమైన రైళ్లను నిలపాలని కోరుతూ మండలంలో సమావేశం నిర్వహించి తీర్మానించారు. భువనేశ్వర్‌లో నిర్వహించే జెడ్ఆర్యూటీసీసీ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తనున్నట్లు అన్నివర్గాల సంఘాలు తెలిపాయి. ఈ విషయం గురించి శ్రీకాకుళం ఎంపీ కింజెరపు రామ్మోహన్ నాయుడుకు వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు. -
ఎంపీ ఏకరువు
* రైల్వే నిలయంలో పార్లమెంట్ సభ్యుల సమావేశం * జిల్లా సమస్యలను లేవనెత్తిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి * 2015 బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని జీఎం హామీ * ఈ నెలలో ధంసలాపురం బ్రిడ్జి పనులు ప్రారంభం సాక్షి, ఖమ్మం: జిల్లాలో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న రైల్వే సమస్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏకరువు పెట్టారు. సికింద్రాబాద్‌లోని రైల్వే నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం నేతృత్వంలో బుధవారం జరిగిన సమావేశానికి తెలంగాణ పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు. జిల్లాకు సంబంధించిన రైల్వే సమస్యలు, నిధుల విడుదల తదితర అంశాలను పొంగులేటి జీఎంకు వివరించారు. పలు అంశాలపై స్పందించిన జీఎం వచ్చే బడ్జెట్లో కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ ప్రతిపాదనలతో త్వరలో ప్రవేశపెట్టే రైల్వేబడ్జెట్‌లో జిల్లాలోని రైల్వే సమస్యలకు మోక్షం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న లైన్లు, నిధులు, హాల్టింగ్ తదితర సమస్యలు పరిష్కారం దిశగా సాగనున్నాయి. ఈ సమస్యలపై కేంద్రం వెంటనే స్పందించాలని ఎంపీ కోరారు. ఎంపీ నివేదించిన సమస్యలు ఇవే... * ఖమ్మం నగరంలోని కమాన్‌బజార్, ఎర్రుపాలెం మండల కేంద్రంలో రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణాలతో పాటు భద్రాచలం - కొవ్వూరు, సారపాక - భద్రాచలం రైల్వే లైన్లకు 2015 -16 బడ్జెట్లో నిధులు కేటాయించాలన్నారు. దీనిపై జీఎం స్పందించారు. బడ్జెట్లో ఈ లైన్లకు నిధుల కేటాయింపు తప్పక ఉంటుందన్నారు. * ఖాజీపేట రైల్వే డివిజన్‌గా అప్‌గ్రేడ్ చేయాలని, అక్కడ రైల్వే ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పరిశీలించాలని ఎంపీ కోరారు. * ధంసలాపురం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి 2010 - 11లో ప్రభుత్వం అంగీకరించినా నేటికీ పనులు ప్రారంభం కాలేదని ఎంపీ పేర్కొన్నారు. ఈ నెలలోనే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని జీఎం హామీ ఇచ్చారు. * ఖమ్మం గాంధీచౌక్‌లో ఉన్న లోడింగ్, అన్లోడింగ్ స్థలాన్ని పందిళ్లపల్లికి మార్చాలి. ఇక్కడ లోడింగ్, అన్‌లోడింగ్‌తో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రైల్వే స్టేషన్‌కు వెళ్లే మార్గం వ్యాపార, వాణిజ్య సముదాయాలతో ఇరుకుగా ఉందని, రోడ్డు విస్తరణ చేయాలని కోరారు. * ఖమ్మం స్టేషన్లో ఏసీ వెయిటింగ్హాల్ను ఏర్పాటు చేయాలన్నారు. * ఖమ్మం, కొత్తగూడెం రైల్వే స్టేషన్లను ఆధునికీకరించాలని కోరారు. * పాండురంగాపురం రైల్వే స్టేషన్ ఆ గ్రామానికి 13 కి.లో మీటర్ల దూరంలో ఉంది. దీన్ని మూడుసార్లు తీవ్రవాదులు పేల్చివేశారు. ఈ గ్రామం స్టేషన్ నిర్మించడానికి అనువైన ప్రాంతం అయినందున అక్కడే స్టేషన్ నిర్మించాలి. * ఖాజీపేటలో ఆగే అన్ని రైళ్లను జిల్లా కేంద్రంలో నిలపాలి. ఖమ్మం కార్పొరేషన్ కావడంతో ప్రయాణీకుల సంఖ్య రెట్టింపు అయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. * కొత్తగూడెం - కొవ్వూరు రైల్వేలైన్ రూ. 967 కోట్లతో మంజూరు అయింది. అయినా ఇప్పటి వరకు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటికైనా ఈ పనులు ప్రారంభించాలని కోరారు. దీనిపై స్పందించిన జీఎం 2015 - 16 బడ్జెట్లో నిధులు కేటాయించి పూర్తి చేయిస్తామన్నారు. అలాగే కొత్తగూడెం - సారపాక రైల్వేలైన్ త్వరగా పూర్తి చేయించాలని ఎంపీ సమావేశంలో ప్రస్తావించారు. -
కోటి ఆశల రైలు కూత
ఖమ్మం మామిళ్లగూడెం: గత యూపీఏ పాలనలో ప్రతిసారి జిల్లాకు మొండి‘చేయే’ ఎదురైంది. ఇప్పుడు ఎన్డీఏ పాలన వచ్చింది. ఈ ప్రభుత్వంలోనైనా జిల్లాకు న్యాయం జరుగుతుందా...? అనే ప్రశ్న సర్వత్రా నెలకొంది. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టే మొదటి రైల్వేబడ్జెట్‌పై జనం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత కొన్నేళ్లుగా జిల్లాలో ఉంటున్న రైల్వే సమస్యలుకు ఈ సారైనా పరిష్కారం లభిస్తుందని జిల్లావాసులు ఆశాభావంతో ఉన్నారు. ఖమ్మం రైల్వేస్టేషన్లో ప్రతి రైలుకూ హాల్టింగ్ ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. తమిళనాడు, కేరళ ఎక్స్‌ప్రెస్‌లను జిల్లాకేంద్రంలో ఆపాల్సిందిగా ప్రయాణికులు కోరుతున్నారు. వీక్లీ రైళ్ల విషయంలోనూ జిల్లాకు ఇదే అన్యాయం జరుగుతోంది. దీనిపై ఎంతమేరకు న్యాయం జరుగుతుందో చూడాలి. సారథీనగర్- మామిళ్లగూడెం అండర్‌బ్రిడ్జి ప్రతిపాదన పెండింగ్‌లో ఉంది. కమాన్‌బజార్ మధ్యగేటు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ గేటు ఎక్కువసేపు వేసి ఉంటుంది. గేటు కింద నుంచి దూరివెళ్లే క్రమంలో రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఖమ్మం రైల్వేస్టేషన్లో ఉన్న గూడ్స్ షెడ్‌ను జిల్లాకేంద్రానికి సమీపంలోని పందిళ్లపల్లికి మార్చారు. ఖమ్మంలో ఉన్న షెడ్‌ను పడవేశారు. గూడ్స్ రైళ్లలో సరుకులు నేరుగా ఖమ్మం వస్తాయి. వాటిని లోడింగ్, అన్లోడింగ్ చేసే సమయంలో ఎండకు ఎండుతూ..వానకు తడుస్తూ కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరుకుల రవాణాకు మహిళా కళాశాల వైపు ఒక ద్వారం ఉంది. ఆ ఒక్క ద్వారం నుంచే లారీలు వచ్చిపోవడం ఇబ్బందికరంగా మారింది. మరో ద్వారం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన మేరకు అధికారులు సర్వే చేశారు. కానీ ఇంతవరకు అది అమలుకు నోచుకోలేదు. మధ్యగేటు వద్ద ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని గతంలో రైల్వే డీసీఎం దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. ఇక్కడ బ్రిడ్జి లేకపోవడం వల్ల వన్‌టౌన్ నుంచి త్రీటౌన్లోకి వెళ్లేందుకు ఇబ్బందికరంగా మారిందని ఫిర్యాదు చేశారు. ఖమ్మం స్టేషన్ మీదుగా రోజుకు దాదాపు 50 వరకు రైళ్లు వచ్చిపోతుంటాయి. కాబట్టి ఎప్పుడూ గేటు వేయక తప్పటం లేదు. దీనివల్ల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి అధికారులు స్పందించి ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మించి ఇవ్వాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.