ఎంపీ ఏకరువు
* రైల్వే నిలయంలో పార్లమెంట్ సభ్యుల సమావేశం
* జిల్లా సమస్యలను లేవనెత్తిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి
* 2015 బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని జీఎం హామీ
* ఈ నెలలో ధంసలాపురం బ్రిడ్జి పనులు ప్రారంభం
సాక్షి, ఖమ్మం: జిల్లాలో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న రైల్వే సమస్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏకరువు పెట్టారు. సికింద్రాబాద్‌లోని రైల్వే నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం నేతృత్వంలో బుధవారం జరిగిన సమావేశానికి తెలంగాణ పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు.
జిల్లాకు సంబంధించిన రైల్వే సమస్యలు, నిధుల విడుదల తదితర అంశాలను పొంగులేటి జీఎంకు వివరించారు. పలు అంశాలపై స్పందించిన జీఎం వచ్చే బడ్జెట్‌లో కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ ప్రతిపాదనలతో త్వరలో ప్రవేశపెట్టే రైల్వేబడ్జెట్‌లో జిల్లాలోని రైల్వే సమస్యలకు మోక్షం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న లైన్లు, నిధులు, హాల్టింగ్ తదితర సమస్యలు పరిష్కారం దిశగా సాగనున్నాయి. ఈ సమస్యలపై కేంద్రం వెంటనే స్పందించాలని ఎంపీ కోరారు.
ఎంపీ నివేదించిన సమస్యలు ఇవే...
* ఖమ్మం నగరంలోని కమాన్‌బజార్, ఎర్రుపాలెం మండల కేంద్రంలో రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణాలతో పాటు భద్రాచలం - కొవ్వూరు, సారపాక - భద్రాచలం రైల్వే లైన్లకు 2015 -16 బడ్జెట్‌లో నిధులు కేటాయించాలన్నారు. దీనిపై జీఎం స్పందించారు. బడ్జెట్‌లో ఈ లైన్లకు నిధుల కేటాయింపు తప్పక ఉంటుందన్నారు.
* ఖాజీపేట రైల్వే డివిజన్‌గా అప్‌గ్రేడ్ చేయాలని, అక్కడ రైల్వే ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పరిశీలించాలని ఎంపీ కోరారు.
* ధంసలాపురం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి 2010 - 11లో ప్రభుత్వం అంగీకరించినా నేటికీ పనులు ప్రారంభం కాలేదని ఎంపీ పేర్కొన్నారు. ఈ నెలలోనే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని జీఎం హామీ ఇచ్చారు.
* ఖమ్మం గాంధీచౌక్‌లో ఉన్న లోడింగ్, అన్‌లోడింగ్ స్థలాన్ని పందిళ్లపల్లికి మార్చాలి. ఇక్కడ లోడింగ్, అన్‌లోడింగ్‌తో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రైల్వే స్టేషన్‌కు వెళ్లే మార్గం వ్యాపార, వాణిజ్య సముదాయాలతో ఇరుకుగా ఉందని, రోడ్డు విస్తరణ చేయాలని కోరారు.
* ఖమ్మం స్టేషన్‌లో ఏసీ వెయిటింగ్‌హాల్‌ను ఏర్పాటు చేయాలన్నారు.
* ఖమ్మం, కొత్తగూడెం రైల్వే స్టేషన్లను ఆధునికీకరించాలని కోరారు.
* పాండురంగాపురం రైల్వే స్టేషన్ ఆ గ్రామానికి 13 కి.లో మీటర్ల దూరంలో ఉంది. దీన్ని మూడుసార్లు తీవ్రవాదులు పేల్చివేశారు. ఈ గ్రామం స్టేషన్ నిర్మించడానికి అనువైన ప్రాంతం అయినందున అక్కడే స్టేషన్ నిర్మించాలి.
* ఖాజీపేటలో ఆగే అన్ని రైళ్లను జిల్లా కేంద్రంలో నిలపాలి. ఖమ్మం కార్పొరేషన్ కావడంతో ప్రయాణీకుల సంఖ్య రెట్టింపు అయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యను పరిష్కరించాలన్నారు.
* కొత్తగూడెం - కొవ్వూరు రైల్వేలైన్ రూ. 967 కోట్లతో మంజూరు అయింది. అయినా ఇప్పటి వరకు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటికైనా ఈ పనులు ప్రారంభించాలని కోరారు. దీనిపై స్పందించిన జీఎం 2015 - 16 బడ్జెట్‌లో నిధులు కేటాయించి పూర్తి చేయిస్తామన్నారు. అలాగే కొత్తగూడెం - సారపాక రైల్వేలైన్ త్వరగా పూర్తి చేయించాలని ఎంపీ సమావేశంలో ప్రస్తావించారు.