rajakas
-
‘రజకులను ఎస్సీ జాబితాలో చేర్చండి’
అనంతపురం రూరల్ : ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని రజక ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు పి. కమ్మన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి రజక ఫెడరేషన్లకు బడ్జెట్లో నిధులను కేటాయించి అభివద్ధికి కషి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రజక ఉద్యోగుల సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా కమ్మన్న, జిల్లా అధ్యక్షుడిగా రంగనాథ్, కార్యదర్శిగా క్రిష్ణమూర్తి, కార్యనిర్వాహక కార్యదర్శిగా లింగమయ్య, కోశాధికారిగా బయన్న, ఉపాధ్యక్షులుగా గోపాల్, రామలింగమయ్య, రాంగోపాల్, నాగరాజు తదితరులను ఎన్నుకున్నారు. -
పోరాటంతోనే రజకులకు లబ్ధి
రాష్ట్ర రజక సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాతపాటి అంజిబాబు నరసరావుపేట రూరల్: రాష్ట్రంలో ఉన్న 45 లక్షల మంది రజకుల సమస్యల పరిష్కారానికి శాంతియుత పోరాటంSచేస్తున్నట్లు రాష్ట్ర రజక సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు పాతపాటి అంజిబాబు ప్రకటించారు. శనివారం కోటప్పకొండలో నిర్వహించిన మేధోమధన సదస్సులో ఆయన మాట్లాడారు. పాదయాత్రలో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తూ గతంలో చంద్రబాబు రజకులను ఎస్సీల్లో చేర్చుతామని హామీ ఇచ్చారని, ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం కూడా చేసారన్నారు. ఆ తర్వాత ఆచరణలో మాత్రం నోచుకోలేదన్నారు. త్వరలో 5 లక్షల మందితో విజయవాడలో భారీ బహిరంగ నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు గుర్రపుసాల రామకృష్ణ, సింగారం రంగా, పద్మజ, దేవేంద్రప్ప, సుధాకర్, కుందేటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
రజకుల డిమాండ్ న్యాయబద్ధమైనది!
దేశంలో అత్యంత వెనుకబాటుకు గురైన కులాలకు రాజ్యాంగపరంగా అందిస్తున్న అండదండలు కొన్ని వర్గాలకే పరిమితం కావడం దురదృష్ట్టకరం. రజకులను ఎస్సీల జాబితాలో చేర్చడం రాజ్యంగపరంగా సమంజసం కాదనడం సరికాదు. రజకులు కులవృత్తి మీద ఆధారపడి బతికే పరిస్థితి లేదు. వారికి విద్య, ఉపాధి అవకాశాలను, తగు శిక్షణను ఇచ్చి నూతన జీవన విధానంలోకి నడిపించే ప్రయత్నం చేయాలని చెబుతూనే ఎస్సీల జాబితాలో చేర్చడం కుదరదన్న రీతిలో మల్లెపల్లి లక్ష్మయ్య విశ్లేషిం చడం ఆక్షేపణీయం. తమను ఎస్సీ జాబితాలో చేర్చాలని రజ కులు డిమాండ్ చేస్తున్నది ఎందుకు? వీటి కోసమే కదా! ‘సాక్షి’ ది.24-03-2016 నాటి సంచికలో ‘రాజ్యాంగబద్ధం కాని హామీ లేల?’ అనే శీర్షికతో ప్రచురితమైన లక్ష్మయ్య గారి వ్యాసం లక్షలాది మంది రజకుల మనోభావాలను గాయపరిచింది. ఆర్థికంగా, సామాజికంగా అత్యంత దయనీయ స్థితిలో ఉన్న ఓ సామాజికవర్గ ప్రయోజనాలను కాపాడాలని ప్రధాన రాజకీయ పక్షాలు తల్చుకుంటే రాజ్యాంగాన్ని సవరించైనా చేయగల్గుతాయి. అంటరానితనానికి, వెనుకబాటుకు గురైన ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు 68ఏళ్లుగా చట్టసభలు, విద్య, ఉద్యోగాలు, అభివృద్ధిప రంగా రిజర్వేషన్ల ఫలాలను అందుకుంటున్నారు. కాబట్టి ఆర్థి కంగా, సామాజికంగా, రాజకీయంగా ఎస్సీ, ఎస్టీల కంటే కడు దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్న రజకులకు న్యాయం చేయడానికి రాజ్యాంగం అడ్డుకాబోదు. 2014 ఎన్నికల సందర్భంగా రాష్ర్టంలో వివిధ పార్టీలు, తమను ఎస్సీలలో చేర్చాలన్న రజకుల డిమాండ్ నెరవేర్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చాయి. రజకుల పోరా టానికి ఊతమిచ్చినందుకు సంతోషం. దశాబ్దాలు గడుస్తున్నా ప్రభుత్వ పరంగా రిజర్వేషన్లు కొన్ని వర్గాలకే పరిమితం కావాల నడం సబబు కాదు. పరిస్థితులను బట్టి మార్పులు చేర్పులు జర గడం సహజం. ఇప్పటికే మన రాజ్యాంగానికి సుమారుగా 120 పర్యాయాలు సవరణలు చేయలేదా? రిజర్వేషన్లు కల్పించాలని కాపు, ఒంటరి, బలిజ కులస్తులు ఉద్యమిస్తే అన్ని రాజకీయపక్షాలు మద్దతు ప్రకటించలేదా? రాష్ర్ట ప్రభుత్వం దీనిపై కమిషన్ కూడా నియమించింది. ఇక ప్రాతిపదిక చెప్పాలంటే చాలానే ఉంది. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో రజకులు(దోబీలు) ఎస్సీలుగా ఉన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ రజకులు ఒకే వృత్తి, ఒకే జీవన విధానం, ఒకే సామాజిక హైన్యం కలిగి ఉన్నారు. కాబట్టి వారు ఏ రాష్ర్టంలో ఉన్నా దేశవ్యాప్తంగా ఒకే కమ్యూనిటీగా (దోబీగా) గుర్తించాలి. దేశవ్యాప్తంగా దోబీలు ఎస్సీ జాబితాలో గుర్తించ బడ్డారు. దోబీలు ఎస్సీలైనప్పుడు దోబీ పోస్టులకు ఎన్నికయ్యే రజకులు కూడా ఎస్సీలవుతారు. భారత్లో అత్యంత ప్రాచీనమైన కుల వ్యవస్థలో ఇతిహాసాల కాలంలోనే ఉనికిలో ఉన్న చాకలి కులం ప్రధానవృత్తి బట్టలు ఉతకడం. బట్టలు ఉతకడమే కాక, దేవుళ్ల ఉత్సవాల్లో సవారీలు మోయడం, దివిటీలు పట్టడం చేస్తారు. చాకళ్ళ గురించి ప్రభుత్వా లకు కూడా ఇంతకుమించి తెలియదేమో? బట్టలుతికేవారందరినీ తెలుగు రాష్ట్రాలలో రజక/చాకలి/వన్నార్ కులస్తులుగా గుర్తించారు. ఒకే కులంగా గుర్తించడంతో చాకలి కులంలో ఉండే అనేక ఉపకులాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇంకా నష్టపోతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ జాబితాలో ప్రధాన కులా లనూ, వాటి ఉప కులాలనూ ప్రత్యేక కులాలుగా గుర్తించారు. ఒక మాల కులాన్ని ఉదాహరణగా తీసుకుంటే 11 ప్రధాన, ఉపకులా లను ప్రత్యేక కులాలుగా గుర్తించటాన్ని గమనించవచ్చు. బీసీ జాబితా చూస్తే చాకలి కులం విషయంలో ఈ ఉపకులాల ప్రస్తా వనే ఉండదు. రజక/చాకలి/ వన్నార్ అనే పేరుతో చాకలి కులస్థు లందరినీ ఒకే కులంగా గుర్తించి ఆదిమ జాతి/విముక్తి జాతి/ సంచార జాతి/ ఉప సంచార జాతుల కులాల గ్రూపు అయిన ‘ఏ’ గ్రూపులో చేర్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఏర్పడక ముందు 1950లో ఉమ్మడి మద్రాసు రాష్ర్టంలో పొదర వన్నాన్ అనే చాకలి కులానికి ఎస్సీ హోదా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రజకులను ఎస్సీల జాబితాలో చేర్చే విషయంపై కమిషన్ వేసింది. 1947 నుంచి 2015 వరకు.. అంటే 68 ఏళ్ల స్వతంత్రం భార తావనిలో రజకజాతి ఎంపీలు, ఆలిండియా స్థాయి ఉద్యోగులైన ఐఏఎస్, ఐపీఎస్లు జీరో. 59 ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోగాని, ప్రస్తుత తెలంగాణలోగాని రజకులు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ఎన్నికైంది కేవలం ఒక్కరే. 2005- 2011 మధ్య కాలంలో రజక మహిళలపై వందకు పైగా అత్యాచారాలు జరిగాయి. కేసులు నమోదుకానివి, వెలుగులోకి రానివి, సభ్యసమాజం దృష్టికి రానివి అనేకం ఉన్నాయి. రజకుల్లో ఆర్థిక పరాధీనత, సామాజిక హైన్యం వీరిని బలహీనులుగా మారుస్తోంది. విద్య కూడా తగినంత లేకపోవడంతో రజకులు దయనీయస్థితిలో మిగిలిపోతున్నారు. ఇదీ అంకెల్లో రజకుల దుస్థితి. మచ్చుకు కొన్ని లెక్కలివి. తప్పుడు లెక్కలు చరిత్రలో నమోదయ్యాయి. తప్పనిసరిగా వాటిని సరి చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. (24.03.2016న ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసానికి స్పందన) వ్యాసకర్త వెనుకబడిన వర్గాల నాయకులు 9866200463 - కొలనుకొండ శివాజీ -
వైఎస్ ఉంటే రజకులకు న్యాయం జరిగేది
మెదక్ రూరల్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉంటే రజకులకు సముచిత న్యాయం జరిగేదని, ఆయన అకాల మృతితో రజకులకు తీరని లోటు జరిగిందని రజక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోతరాజు రమణ పేర్కొన్నారు. మెదక్ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో ఆదివారం రజక ఉద్యోగుల ఐక్యవేదిక జిల్లా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రమణ మాట్లాడుతూ సమాజంలో నేటికీ వెట్టి చేస్తున్నది ఒక్క రజక కులస్తులేనన్నారు. ఇతర కులవృత్తుల వారు తాము చేసిన పనికి డిమాండ్ చేసి డబ్బులు తీసుకుంటుంటే గ్రామీణ ప్రాంతంలోని రజకులు రోజంతా కష్టపడి దుస్తులు ఉతికి రాత్రి పూట వెళ్లి ఇల్లిల్లూ తిరిగి అడుక్కునే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రజకుల కష్టాలను గుర్తించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపారన్నారు. ఆయన అకాల మృతితో రజకులను పట్టించుకునే వారే లేరన్నారు. రజకులకు న్యాయం జరగాలంటే ఎస్టీ, లేదా ఎస్సీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రజక ఐక్యవేదిక జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు దుర్గయ్య మాట్లాడుతూ దేశంలోని 19 రాష్ట్రాల్లో రజకులు ఎస్టీ, ఎస్సీ జాబితాల్లో ఉన్నారని, మన రాష్ట్రంలో కూడా రజకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. రజకుల సమాజసేవను గుర్తించి వారికి గీతవృత్తిదారులకు ఇస్తున్న మాదిరిగానే పింఛన్ ఇవ్వాలన్నారు. రజక ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింలు మాట్లాడుతూ ప్రతి మండల కేంద్రంలో ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఐక్యవేదిక ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, ప్రధాన క్యాదర్శి పెంటయ్య, కార్యదర్శి రాజేష్, నాయకులు ప్రభాకర్, శ్రీకాంత్, యాదగిరి, విద్యార్థి విభాగం నాయకులు విజయ్, మల్లేశం, కుమార్లతో పాటు జిల్లా నాయకుడు బ్యాతోల్ సిద్ద రాములు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలి
రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి ఆర్డీవో కార్యాలయం వద్ద రజకుల వినూత్న నిరసన తిరుపతి(మంగళం) : సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన వెంటనే రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తానంటూ చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అఖిల భారతీయ దోబీ మహా సమాజ్ ఏపీ రాష్ట్ర శాఖ కన్వీనర్ అక్కినపల్లి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. తిరుపతి ఆర్డీ వో కార్యాలయం వద్ద సోమవారం రజకులు అర్ధనగ్నంగా బట్టలు ఉతకడం, ఉడకబెట్టడం, ఆరబెట్టడం వంటి వినూత్న కార్యక్రమాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కినపల్లి లక్ష్మయ్య మాట్లాడు తూ రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తానని మాట ఇచ్చిన చంద్రబాబునాయుడు ఇంతవరకు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఇప్పటికైనా రజకులను ఎస్సీ జాబితా లో చేర్చాలని డిమాండ్ చేశారు. భారతదేశంలోని 18 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారని, ఇక్కడ మాత్రం బీసీలుగా ఉండి కులవృత్తితో జీవనం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చడం వలన అన్ని విధాలా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయన్నారు. రజక మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా తమను పట్టించుకునే వారే లేరన్నారు. అనంతరం ఆర్డీ వో కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రంగస్వామికి రజకులు వినతిపత్రం సమర్పించారు. వివిధ రజక సంఘాల నాయకులు గంధం బాబు, హరిప్రసాద్, దాము, కుమారస్వామి, శంకరయ్య, మురళి, శ్రీనివాసులు, సంపూర్ణమ్మ, సుబ్రమణ్యం పాల్గొన్నారు.