రజకుల డిమాండ్ న్యాయబద్ధమైనది! | Rajaks demand more justiable | Sakshi
Sakshi News home page

రజకుల డిమాండ్ న్యాయబద్ధమైనది!

Published Sun, Apr 3 2016 1:09 AM | Last Updated on Sat, Sep 15 2018 8:18 PM

Rajaks demand more justiable

దేశంలో అత్యంత వెనుకబాటుకు గురైన కులాలకు రాజ్యాంగపరంగా అందిస్తున్న అండదండలు కొన్ని వర్గాలకే పరిమితం కావడం దురదృష్ట్టకరం. రజకులను ఎస్సీల జాబితాలో చేర్చడం రాజ్యంగపరంగా సమంజసం కాదనడం సరికాదు.  రజకులు కులవృత్తి మీద ఆధారపడి బతికే పరిస్థితి లేదు. వారికి విద్య, ఉపాధి అవకాశాలను, తగు శిక్షణను ఇచ్చి నూతన జీవన విధానంలోకి నడిపించే ప్రయత్నం చేయాలని చెబుతూనే ఎస్సీల జాబితాలో చేర్చడం కుదరదన్న రీతిలో మల్లెపల్లి లక్ష్మయ్య  విశ్లేషిం చడం  ఆక్షేపణీయం.  తమను ఎస్సీ జాబితాలో చేర్చాలని రజ కులు డిమాండ్ చేస్తున్నది ఎందుకు? వీటి కోసమే కదా! ‘సాక్షి’ ది.24-03-2016 నాటి సంచికలో ‘రాజ్యాంగబద్ధం కాని హామీ లేల?’ అనే శీర్షికతో ప్రచురితమైన లక్ష్మయ్య గారి వ్యాసం లక్షలాది మంది రజకుల మనోభావాలను గాయపరిచింది.
 
 ఆర్థికంగా, సామాజికంగా అత్యంత దయనీయ స్థితిలో ఉన్న ఓ సామాజికవర్గ ప్రయోజనాలను కాపాడాలని ప్రధాన రాజకీయ పక్షాలు తల్చుకుంటే రాజ్యాంగాన్ని సవరించైనా చేయగల్గుతాయి. అంటరానితనానికి, వెనుకబాటుకు గురైన ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు  68ఏళ్లుగా చట్టసభలు, విద్య, ఉద్యోగాలు, అభివృద్ధిప రంగా  రిజర్వేషన్ల ఫలాలను అందుకుంటున్నారు. కాబట్టి ఆర్థి కంగా, సామాజికంగా, రాజకీయంగా ఎస్సీ, ఎస్టీల కంటే కడు దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్న రజకులకు న్యాయం చేయడానికి రాజ్యాంగం అడ్డుకాబోదు.

2014 ఎన్నికల సందర్భంగా రాష్ర్టంలో వివిధ పార్టీలు, తమను ఎస్సీలలో చేర్చాలన్న  రజకుల డిమాండ్ నెరవేర్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చాయి. రజకుల పోరా టానికి ఊతమిచ్చినందుకు సంతోషం. దశాబ్దాలు గడుస్తున్నా ప్రభుత్వ పరంగా రిజర్వేషన్లు కొన్ని వర్గాలకే పరిమితం కావాల నడం సబబు కాదు. పరిస్థితులను బట్టి మార్పులు చేర్పులు జర గడం సహజం.
 
 ఇప్పటికే మన రాజ్యాంగానికి సుమారుగా 120 పర్యాయాలు సవరణలు చేయలేదా? రిజర్వేషన్లు కల్పించాలని కాపు, ఒంటరి, బలిజ కులస్తులు ఉద్యమిస్తే అన్ని రాజకీయపక్షాలు మద్దతు ప్రకటించలేదా?  రాష్ర్ట ప్రభుత్వం దీనిపై కమిషన్ కూడా నియమించింది. ఇక ప్రాతిపదిక చెప్పాలంటే చాలానే ఉంది.  దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో రజకులు(దోబీలు) ఎస్సీలుగా ఉన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నారు.

అన్ని రాష్ట్రాల్లోనూ రజకులు ఒకే వృత్తి, ఒకే జీవన విధానం, ఒకే సామాజిక హైన్యం కలిగి ఉన్నారు. కాబట్టి వారు ఏ రాష్ర్టంలో ఉన్నా దేశవ్యాప్తంగా ఒకే కమ్యూనిటీగా (దోబీగా) గుర్తించాలి. దేశవ్యాప్తంగా దోబీలు ఎస్సీ జాబితాలో గుర్తించ బడ్డారు. దోబీలు ఎస్సీలైనప్పుడు దోబీ పోస్టులకు ఎన్నికయ్యే రజకులు కూడా ఎస్సీలవుతారు.
 
 భారత్‌లో అత్యంత ప్రాచీనమైన కుల వ్యవస్థలో ఇతిహాసాల కాలంలోనే ఉనికిలో ఉన్న చాకలి కులం ప్రధానవృత్తి బట్టలు ఉతకడం. బట్టలు ఉతకడమే కాక, దేవుళ్ల ఉత్సవాల్లో సవారీలు మోయడం, దివిటీలు పట్టడం చేస్తారు. చాకళ్ళ గురించి ప్రభుత్వా లకు కూడా ఇంతకుమించి తెలియదేమో? బట్టలుతికేవారందరినీ తెలుగు రాష్ట్రాలలో రజక/చాకలి/వన్నార్ కులస్తులుగా గుర్తించారు.
 
 ఒకే కులంగా గుర్తించడంతో చాకలి కులంలో ఉండే అనేక ఉపకులాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇంకా నష్టపోతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని   ఎస్సీ జాబితాలో ప్రధాన కులా లనూ, వాటి ఉప కులాలనూ ప్రత్యేక కులాలుగా గుర్తించారు. ఒక మాల కులాన్ని ఉదాహరణగా తీసుకుంటే 11 ప్రధాన, ఉపకులా లను ప్రత్యేక కులాలుగా గుర్తించటాన్ని గమనించవచ్చు. బీసీ జాబితా చూస్తే చాకలి కులం విషయంలో ఈ ఉపకులాల ప్రస్తా వనే ఉండదు.

రజక/చాకలి/ వన్నార్ అనే పేరుతో చాకలి కులస్థు లందరినీ ఒకే కులంగా గుర్తించి ఆదిమ జాతి/విముక్తి జాతి/ సంచార జాతి/ ఉప సంచార జాతుల కులాల గ్రూపు అయిన ‘ఏ’ గ్రూపులో చేర్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఏర్పడక ముందు 1950లో ఉమ్మడి మద్రాసు రాష్ర్టంలో పొదర వన్నాన్ అనే చాకలి కులానికి ఎస్సీ హోదా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రజకులను ఎస్సీల జాబితాలో చేర్చే విషయంపై కమిషన్ వేసింది.
 
 1947 నుంచి 2015 వరకు.. అంటే 68 ఏళ్ల స్వతంత్రం భార తావనిలో రజకజాతి ఎంపీలు, ఆలిండియా స్థాయి ఉద్యోగులైన ఐఏఎస్, ఐపీఎస్‌లు జీరో. 59 ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోగాని, ప్రస్తుత తెలంగాణలోగాని రజకులు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ఎన్నికైంది కేవలం ఒక్కరే. 2005- 2011 మధ్య కాలంలో రజక మహిళలపై వందకు పైగా అత్యాచారాలు జరిగాయి. కేసులు నమోదుకానివి, వెలుగులోకి రానివి, సభ్యసమాజం దృష్టికి రానివి అనేకం ఉన్నాయి. 

రజకుల్లో ఆర్థిక పరాధీనత, సామాజిక హైన్యం వీరిని బలహీనులుగా మారుస్తోంది. విద్య కూడా తగినంత లేకపోవడంతో రజకులు దయనీయస్థితిలో మిగిలిపోతున్నారు. ఇదీ అంకెల్లో రజకుల దుస్థితి. మచ్చుకు కొన్ని లెక్కలివి. తప్పుడు లెక్కలు చరిత్రలో నమోదయ్యాయి. తప్పనిసరిగా వాటిని సరి చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉంది.
 (24.03.2016న ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసానికి స్పందన)
 వ్యాసకర్త వెనుకబడిన వర్గాల నాయకులు 9866200463
 - కొలనుకొండ శివాజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement