Rajasingh lodha
-
ఇద్దరు చిన్నారులు దుర్మరణం..
సాక్షి, హైదరాబాద్ : నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో విషాదకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రమాదాల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు స్థానికంగా విషాదాన్ని నింపాయి. మంగళ్‌హాట్, చాంద్రాయణగుట్టలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మూడేళ్ల మరుయం, అయిదేళ్ల హర్షవర్థన్ మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. సీతారాం బాగ్ చౌరస్తా వద్ద హర్షవర్ధన్ అనే అయిదేళ్ల బాలుడిని పెట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో గాయపడిన బాలుడిని హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పెట్రోలింగ్ వాహనం డ్రైవర్ భగవాన్ రెడ్డి పై చర్యలు తీసుకుంటామని సీఐ రంవీర్ రెడ్డి తెలిపారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు. (రోడ్డు ప్రమాదాలు తగ్గితే ఊహించని స్థాయిలో..) నిర్లక్ష్యం ఖరీదు ఓ పసి బాలిక మృతి.. మరోవైపు హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మిల్లత్ నగర్ వద్ద ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన మూడేళ్ల మరుయం అనే బాలిక టిప్పర్ టైర్ల కింద పడి నుజ్జునుజ్జయింది. సమాచారం తెలుసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పాప మృత దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో స్థానికులు తీవ్ర కోపోద్రిక్తులు అవుతున్నారు. (ఘోర ప్రమాదం; గర్భిణి సహా ఏడుగురు మృతి) -
పాక్ పాటను కాపీ కొట్టిన బేజీపీ ఎమ్మెల్యే రాజా సింగ్
-
పాక్ పాటను కాపీ కొట్టిన ఎమ్మెల్యే
సాక్షి, న్యూఢిల్లీ : భారత సైన్యానికి నివాళిగా శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఏప్రిల్ 14వ తేదీన ఓ పాటను విడుదల చేస్తున్నానని తెలంగాణ బేజీపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ట్విట్టర్ సాక్షిగా శుక్రవారం నాడు గొప్పగా ప్రకటించారు. అన్నట్లుగానే ఆయన స్వయంగా పాడిన పాటను రిలీజ్ చేశారు. అయితే ఆశించినట్లుగా ప్రశంసల జల్లు కురవకుండా, ముఖ్యంగా సోషల్ మీడియాలో విమర్శల జడివానా మొదలయింది. ఆ తిట్ల పరంపర ఒక్క భారతీయుల నుంచే కాకుండా సరిహద్దుకు ఆవల ఉన్న పాకిస్థాన్ ప్రజల నుంచి కూడా హోరెత్తుతోంది. అందుకు కారణం పాకిస్థాన్ మిలటరీ మీడియా (ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్) పాకిస్థాన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 23వ తేదీన విడుదల చేసిన వీడియో సాంగ్‌న మక్కీకి మక్కీ కాపీ కొట్టడమే కారణం. కాకపోతే ‘పాకిస్థాన్ జిందాబాద్’ అని ఉన్న చోటల్లా ‘హిందుస్థాన్ జిందాబాద్’ అని మార్చారు. పాకిస్థాన్ పాటను సాహిర్ అలీ బగ్గా చాలా హద్యంగా పాడగా, మన చౌకీదార్ రాజాసింగ్ తన శక్తిమేరకు పాడారు. రాజాసింగ్ పాట్‌పై పాకిస్థాన్ మిలటరీ మీడియా డైరెక్టర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘పాటను కాపీ కొట్టావ్, బాగుంది! అలాగే నిజం మాట్లాడడాన్ని కూడా కాపీ కొడితే బాగుంటుంది’ అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల ఉద్దేశం ఏమిటో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. గత ఫిబ్రవరి నెలలో పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేశామని భారత్ చెబుతుండగా, అది అబద్ధమని భారత్ విమానాన్ని తాము కూల్చడం వల్లనే భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ తమకు చిక్కారని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. అభినందన్ చిక్కడం ఎంత నిజమో, ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చడం అంతే నిజమని భారత్ వాదిస్తోంది. యుద్ధ విమానాన్ని కూల్చడం అబద్ధమని పాక్ ఇప్పటికీ ఖండిస్తోంది. ఇదే విషయమై నిజం చెప్పడం కాపీ కొట్టండంటూ గఫూర్ వ్యాఖ్యానించారు. రాజాసింగ్, పాక్ పాటను కాపీ కొట్టలేదని, దొంగిలించారని, ఆయనప్పటికీ ఆయన పాటలో వచనం అంత బాగా లేదని పాకిస్థాన్ జర్నలిస్ట్ హమీద్ మీర్ చమత్కరించారు. ఇది భారత సైన్యానికి నివాళి అర్పించడం కాదని, అవమానించడమని పలువురు సోషల్ నెటిజెన్లు విమర్శిస్తున్నారు. -
హిందుస్థాన్ జిందాబాద్.. దిల్‌కీ అవాజ్..
జియాగూడ: హిందుస్థాన్ జిందాబాద్.. దిల్‌కీ అవాజ్.. హర్ దిల్‌కీ అవాజ్.. అవుతుందని గోషామహల్ ఎమ్మెల్యే, శ్రీరామ్ యువసేన భాగ్యనగర్ అధ్యక్షుడు టి.రాజాసింగ్ లోథా అన్నారు. ప్రతి యేటా శ్రీరామనవమి శోభాయాత్రలో తనే స్వయంగా రచించిన ఒక పాటను పాడడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈసారి శ్రీరామనవమి శోభాయాత్రలో హిందుస్థాన్ జిందాబాద్.. దిల్కే అవాజ్.. హర్ దిల్‌కీ అవాజ్ పాటను పాడడం జరిగిందన్నారు. ఈ పాటను సైనికులకు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు మూడు దేశభక్తి పాటలు ఐదు శ్రీరాముడిపై రచించానని వెల్లడించారు. శోభాయాత్ర రోజున ఈ పాటను ప్రజల సమక్షంలో కూడా పాడి వినిపిస్తానని రాజాసింగ్ తెలిపారు. పాటల సీడీలను లాంచ్ చేయనున్నట్లు తెలిపారు. -
రాజాసింగ్ ఫేస్బుక్ హ్యాక్
సాక్షి, సిటీబ్యూరో: గోషామహల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథా ఫేస్బుక్ ఖాతా హ్యాక్ అయింది. దీనిపై ఆయన సోమవారం సిటీ సైబర్ క్రైమ్ అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. రాజాసింగ్ తన పేరుతో ఓ ఫేస్బుక్ ఖాతా నిర్వహిస్తున్నారు. తన కార్యకలాపాలు, సందేశాలతో ఎప్పుడూ అప్డేట్ చేసే దీనిని దాదాపు ఐదు లక్షల మంది లైక్ చేయగా.. వేల మంది ఫ్రెండ్, ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫేస్బుక్ ఖాతా రాజాసింగ్‌కు చెందిన ఓ మెయిల్‌తో లింకై ఉంది. సోమవారం ఈయనకు హఠాత్తుగా ఆ ఫేస్బుక్ ఖాతాను అడ్మిన్‌గా మీరు నిర్వహించలేరంటూ ఓ ఈ–మెయిల్ సందేశం వచ్చింది. ఇది చూసిన ఆయన తన ఫేస్‌బుక్‌కు యాక్సస్ చేయడానికి ప్రయత్నించగా... పాస్వర్డ్ మారినట్లు గుర్తించాడు. ఈ నేపథ్యంలోనే తన ఫేస్బుక్ ఖాతాను కొందరు హ్యాక్ చేసినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై రాజాసింగ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కుట్ర పూరితంగా ఫేస్ బుక్ హాక్ చేశారని, రాజకీయ కుట్రలో భాగంగానే ఎంఐఎం పార్టీ నేతలే ఈ పని చేయించినట్లు ఆరోపించాడు. గోషామహల్ నుంచి తనను ఓడించేందుకు అన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని, ఎవరెన్ని కుట్రలు చేసినా తాను భారీ మెజారిటీతో గెలుస్తానన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
మోడీతో దేశం అగ్రగామీ: రాజాసింగ్
హైదరాబాద్: నరేంద్ర మోడీ భారతదేశానికి ప్రధాని కావడంతో దేశం ప్రపంచలోనే నెంబర్ 1 స్థాయికి చేరుకుంటుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ పేర్కొన్నారు. సోమవారం నరేంద్రమోడీ ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకారానికి ఆయన నగరం నుంచి ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. అంతకుముందు ధూల్‌పేట్‌లోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మోడీ ప్రధాని కావడం దేశ ప్రజల అదృష్టమని అన్నారు. కొన్ని రోజుల్లోనే భారతదేశం ఆర్థిక రంగాల్లో అమెరికాను మించిపోతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల్లో లక్షల కోట్ల కుంభకోణాలు చేసి దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందన్నారు. దేశ అభివృద్ధిని విస్మరించిన కాంగ్రెస్‌ను ప్రజలు ఛీకొట్టారని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే పదేళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలు ఎప్పుడూ జరగలేదన్నారు. లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డ కాంగ్రెస్ మంత్రులు, నాయకులను దేశ బహిష్కరణ చేయాలని రాజాసింగ్‌లోథ డిమాండ్ చేశారు. ప్రజలంతా బీజేపీవైపే మొగ్గుచూపుతున్నారని ఆయన అన్నారు. -
మోడీ నాయకత్వంలోనే దేశప్రగతి: రాజాసింగ్
హైదరాబాద్: నరేంద్ర మోడీ నాయకత్వంలోనే దేశం ప్రగతి సాధిస్తుందని గోషామహల్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ లోథా అన్నారు. శుక్రవారం బేగంబజార్, కోల్సావాడీ, ఫీల్‌ఖానా, మచ్ఛీమార్కెట్, ఉస్మాన్‌షాహి, గౌలిగూడ తదితర ప్రాంతాలలో ఆయన ఇంటింటికి పాదయాత్ర నిర్వహించి బీజేపీకి ఓటువేయాలని ప్రచారం సాగించారు. కాంగ్రెస్ పాలనలో దేశం అన్ని రంగాల్లోనూ వెనుకబడి పోయిందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలు నరేంద్రమోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, మోడీ నేతృత్వంలో దేశం పురోగమిస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. గుజరాత్ రాష్ట్రంలా దేశాన్ని అభివృద్ధి చేయగల సత్తా మోడీకే ఉందన్నారు. అవినీతి రహిత పాలన కోసం బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.