సాక్షి, సిటీబ్యూరో: గోషామహల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథా ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయింది. దీనిపై ఆయన సోమవారం సిటీ సైబర్ క్రైమ్ అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. రాజాసింగ్ తన పేరుతో ఓ ఫేస్‌బుక్ ఖాతా నిర్వహిస్తున్నారు. తన కార్యకలాపాలు, సందేశాలతో ఎప్పుడూ అప్‌డేట్ చేసే దీనిని దాదాపు ఐదు లక్షల మంది లైక్ చేయగా.. వేల మంది ఫ్రెండ్, ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫేస్‌బుక్ ఖాతా రాజాసింగ్‌కు చెందిన ఓ మెయిల్‌తో లింకై ఉంది.
సోమవారం ఈయనకు హఠాత్తుగా ఆ ఫేస్‌బుక్ ఖాతాను అడ్మిన్‌గా మీరు నిర్వహించలేరంటూ ఓ ఈ–మెయిల్ సందేశం వచ్చింది. ఇది చూసిన ఆయన తన ఫేస్‌బుక్‌కు యాక్సస్ చేయడానికి ప్రయత్నించగా... పాస్‌వర్డ్ మారినట్లు గుర్తించాడు. ఈ నేపథ్యంలోనే తన ఫేస్‌బుక్ ఖాతాను కొందరు హ్యాక్ చేసినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై రాజాసింగ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కుట్ర పూరితంగా ఫేస్ బుక్ హాక్ చేశారని, రాజకీయ కుట్రలో భాగంగానే ఎంఐఎం పార్టీ నేతలే ఈ పని చేయించినట్లు ఆరోపించాడు. గోషామహల్ నుంచి తనను ఓడించేందుకు అన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని, ఎవరెన్ని కుట్రలు చేసినా తాను భారీ మెజారిటీతో గెలుస్తానన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment