మోదీని నవ్వుల్లో ముంచెత్తిన ఎంపీ
కేంద్ర ప్రభుత్వం 500, 1000 నోట్ల రూపాయలను రద్దుచేయడంపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ప్రతిపక్షానికి చెందిన ఒక ఎంపీ చేసిన వ్యాఖ్యలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఇద్దరూ బిగ్గరగా నవ్వుకున్నారు. సమాజ్వాదీ పార్టీకి చెందిన నరేష్ అగర్వాల్ ఈ నవ్వులకు కారణమయ్యారు. చర్చ సందర్భంగా నరేష్ అగర్వాల్ మాట్లాడారు. ''పెద్ద నోట్ల రద్దు విషయాన్ని ప్రకటించడానికి ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కూడా విశ్వాసంలోకి తీసుకోలేదు. తీసుకుని ఉంటే ఆయనకు చెప్పేవారు. అరుణ్ జైట్లీ నాకు తెలుసు కాబట్టి, ఆయన నా చెవిలో ఆ విషయం ఊదేవారు'' అని అగర్వాల్ చెప్పారు. దాంతో ఒక్కసారిగా మోదీ, జైట్లీ నవ్వుల్లో మునిగిపోయారు.
అదే ప్రసంగంలోని మరో సందర్భంలో ''మీరు భయపడొద్దు.. ఉత్తర ప్రదేశ్లో మీరు సురక్షితంగా ఉంటారు'' అనడంతో ప్రధానమంత్రి మరోసారి విపరీతంగా నవ్వుకున్నారు. అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నందున తనను కొన్ని శక్తులు బతకనివ్వకపోవచ్చని ప్రధానమంత్రి ఉద్వేగంగా చెప్పడంతో, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అగర్వాల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.