Ramappa temples
-
రామప్ప దగ్గర భూముల ధరకు రెక్కలు
హాలో సునీల్ అన్నా, బాగున్నవా ? నేను శ్రావణ్‌ని మాట్లాడుతున్న.. మన రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చింది కదా.. మన తరఫున అక్కడో వెంచర్ వేద్దామని ప్లాన్ చేస్తున్నం.. నువ్వే జర మంచి జాగ చూపియ్యాలే.. పైసలెంతైనా పర్వాలేదు. కానీ మనకు ఆడ జాగ కావాలే. నువ్వేంజేస్తవో ఏమో.. నిన్ను కూడా అరుసుకుంట. ఒక్క సునీల్కే కాదు రామప్ప ఆలయం కొలువైన పాలంపేట దాని చుట్టు పక్కల గ్రామాల్లోని ప్రజల ఫోన్లు వారం రోజులగా మోగుతూనే ఉన్నాయి. భూముల కోసం ఆరాలు తీస్తునే ఉన్నారు. నిమిషాల లెక్కన అక్కడ భూముల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సాక్షి, వెబ్‌డెస్క్ : ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కడం ఆలస్యం రామప్పలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే ఊహించని స్థాయికి చేరుకున్నాయి. వరంగల్, హైదరాబాద్‌ల నుంచి బడా రియల్టర్లు ఇక్కడ వాలిపోతున్నారు. ధరెంతైనా పర్వాలేదు.. ఇక్కడ మనకో వెంచర్ ఉండాలన్నట్టుగా బేరాలకు దిగుతున్నారు. యునెస్కో గుర్తింపు కాకతీయులు ఎనిమిది వందల ఏళ్ల కిందట కట్టించిన రుద్రేశ్వరాలయాలన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా ఇటీవల యునెస్కో గుర్తించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ గుర్తింపు దక్కించుకున్న తొలి కట్టడంగా రికార్డులెక్కింది. యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత రామప్పగుడిని చూసేందుకు వస్తున్న వారి సంఖ్య పెరగడంతో పాటు ఒక్కసారిగా ఆలయం చుట్టు పక్కల స్థలాల ధరలకు రెక్కలు వచ్చాయి. గుర్తింపుతో రెట్టింపు ఆలయానికి సమీపంలోనే రామప్ప చెరువు ఉంది. సాగునీటి లభ్యత ఉండటంతో ఇక్కడి భూములకు ముందు నుంచి డిమాండ్ ఎక్కువ. ఎకరం పొలం సుమారు రూ. 20 లక్షల నుంచి 25 లక్షల వరకు పలికేది. అయితే యునెస్కో గుర్తింపు రావడం ఆలస్యం ఒక్కసారిగా ఎకరం భూమి ధర రూ. 40 లక్షల నుంచి 45 లక్షలకు చేరుకుంది. వారం తిరక్కుండానే యునెస్కో గుర్తింపు రావడం ఆలస్యం వరంగల్, హైదరాబాద్‌లకి చెందిన రియల్టర్లు ఇక్కడి స్థలాల కోసం ఆరా తీయడం మొదలు పెట్టారు. తమకే స్థలాలు అమ్మాలంటూ రైతులతో సంప్రదింపులు మొదలెట్టారు. దీంతో రియల్టర్ల మధ్య నెలకొన్న పోటీతో వారం తిరిగే సరికి ఇక్కడ ఎకరం భూమి ధర రూ. 60 లక్షల నుంచి 65 లక్షలకు చేరుకుంది. ఇక్కడే డిమాండ్ రామప్ప దేవాలయం ములుగు జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్లు, వరంగల్ నగరం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో ఉంది. వరంగల్ - భూపాలపట్నం జాతీయ రహదారి 163లో జంగాలపల్లి క్రాస్‌రోడ్డు నుంచి రామప్ప ఆలయం వరకు ఉన్న 10 కిలోమీటర్ల పరిధిలోని భూములకు ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉంది. ఒకరి తర్వాత ఒకరుగా రియల్టర్లు ఆఫర్లు ఇస్తుండటంతో ఇక్కడి రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొందరు అగ్రిమెంట్లు చేసుకునేందుకు సిద్ధమవుతుండగా మరికొందరు మరింత రేటు పెరుగుతుందేమో అని వేచి చేసే ధోరణిలో ఉన్నారు. యాదగిరిగుట్ట యాదాద్రి తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వా యాదగిరిగుట్ట దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మరుక్షణం భువనగిరి-యాదగిరిగుట్ట-ఆలేరు రోడ్డులో భూముల ధరకు రెక్కలు వచ్చాయి. నెలల వ్యవధిలోనే వందల కొద్ది వెంచర్లు వెలిశాయి. ప్రమోటర్లను పెట్టుకుని లే అవుట్ పూర్తికాకముందే ప్లాట్లు అమ్ముడుపోయాయి. ఇప్పుడు ఇంచుమించు అదే పరిస్థితి రామప్ప దగ్గరా కనిపిస్తోంది. ఇక్కడ వెంచర్లు వేసేందుకు రియల్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. భద్రాకాళి ఆలయం పర్యాటక కేంద్రం తెలంగాణలో హైదరాబాద్‌ని మినహాయిస్తే అతి పెద్ద పర్యాటక కేంద్రంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నిలుస్తోంది. వరంగల్‌లో వేయిస్థంభాలగుడి, భద్రాకాళి, ఖిలావరంగల్ మొదలు రామప్ప ఆలయం, సమ్మక్క సారలమ్మ మేడారం, లక్నవరం, పాకాల, బొగత జలపాతం, మల్లూరు నరసింహస్వామి, కాళేశ్వరం, పాండవులగుట్ట, ఘణపురం కోటగుళ్లు, ఏటూరునాగారం అభయారణ్యం, తాడ్వాయి ఏకో టూరిజం, ప్రాచీన కాలానికి చెందిన డోల్మన్ సమాధాలు వంటి ఆథ్యాత్మిక పర్యాటక, ప్రకృతి రమణీయ ప్రాంతాలు వరుసగా ఉన్నాయి. ఆదివారం వస్తే పర్యాటకుల వాహనాలు వరంగల్ - ఏటూరునాగారం రోడ్డులో బారులు తీరుతాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు రెండు వందల కోట్ల రూపాయలతో టూరిజం సర్క్యూట్‌ని అభివృద్ధి చేస్తున్నాయి. బొగత జలపాతం ఢోకాలేదు తాజాగా యునెస్కో గుర్తింపు రావడంతో రామప్ప ఆలయ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రణాళికను రూపొందించాయి. ఇప్పటికే పాలంపేట ప్రాథికార సంస్థ ఏర్పాటును చేశారు. మరోవైపు త్వరలోనే వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయం ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వరంల్ టూరిజం సర్క్యూట్లో అటు బొగత జలపాతం ఇటు వరంగల్ నగరానికి నట్టనడుమ రామప్ప కొలువై ఉంది. దీంతో పర్యాటకుల సంఖ్య మరింతగా పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు లేవు. దీంతో రామప్ప దగ్గర పెట్టుబడికి ఢోకా లేదనే నమ్మకం రియల్టర్లలో నెలకొంది. హోటళ్లు రిసార్టులు రామప్ప దగ్గర భూములు కొనేందుకు రియల్టర్లతో పాటు బడా కంపెనీలు సైతం ఆసక్తి చూపిస్తున్నాయి. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా రామప్ప సమీపంలో హోటళ్లు, రిసార్టులు కట్టేందుకు సుముఖంగా ఉన్నాయి. హోటళ్లు, రిసార్టుల నిర్మాణానికి అనువుగా ఉండే స్థలం కోసం అన్వేషణ చేస్తున్నాయి. -
ఒక్క మెట్టు ఎక్కితే ‘వారసత్వ’ హోదా!
వెబ్‌డెస్క్: అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయం అంతర్జాతీయ ఖ్యాతికి ఆమడ దూరంలో నిలిచింది. కొత్తగా వరల్డ్ హెరిటేజ్ ప్రాంతాలను గుర్తించేందుకు యూనెస్కో బృందం జులై 16న సమావేశమవుతోంది. కాకతీయ వైభవం వరంగల్ కేంద్రంగా తెలుగు ప్రాంతాలను పాలించిన కాకతీయులు ఎన్నో అద్భుతమైన కట్టడాలను నిర్మించారు. వరంగల్ ఖిల్లా, వేయిస్థంభాలగుడి, పానగల్ దేవాలయం, గొలుసుకట్టు చెరువులు ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే వీటన్నింటీలో ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని రామప్ప దేవాలయం ప్రత్యేకంగా నిలిచింది. అందుకే ఈ కట్టడానికి వారసత్వ హోదా తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. జులై 16న ప్రపంచంలోని చారిత్రక కట్టడాలు, ప్రదేశాలకు హెరిటేజ్ హోదా ఇచ్చే యునెస్కో హెరిటేజ్ కమిటీ 2021 జులై 16న చైనా కేంద్రంగా వర్చువల్ సమావేశం నిర్వహించనుంది. సమావేశంలో 21 సభ్య దేశాల ప్రతినిధులు పాల్గొని వారసత్వ హోదా ప్రదానంపై ఆన్లైన్లోనే తమ ఓట్లు వేయనున్నారు. 16న జరిగే రామప్ప ఆలయానికి హోదా రావాలంటే మెజారిటీ ఓట్లు రావాల్సి ఉంటుంది బరిలో 255 కట్టడాలు ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 167 దేశాలకు చెందిన 1,121 కట్టడాలు, ప్రదేశాలు యునెస్కో జాబితాలో ఉండగా భారతదేశం నుంచి 38 కట్టడాలకు, ప్రదేశాలకు చోటుదక్కింది. ప్రస్తుతం ప్రపంచం నలుమూలల నుంచి 255 కట్టడాలు, ప్రదేశాలు యునెస్కో గుర్తింపు కోసం పోటీ పడుతున్నాయి. భారతదేశం నుంచి 2020 సంవత్సరానికి గాను రామప్ప దేవాలయాన్ని ప్రతిపాదించగా, 2021 సంవత్సరానికి గాను గుజరాత్ రాష్ట్రంలోని హరప్పా నాగరికతలో భాగమైన ధోలవీర ఆలయాన్ని ప్రతిపాదించారు. శిల్పి పేరుతోనే కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి సేనాధిపతి అయిన రేచర్ల రుద్రుడు శివుని మీద ఉన్న ఆపారమైన భక్తితో 1213లో రామప్ప ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయాన్ని నిర్మించేందుకు 40 ఏళ్ల సమయం పట్టింది. ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలు రామప్ప అనే శిల్పి చేపట్టాడు. ఇప్పుడు ఈ ఆలయం ఆయన పేరునే ప్రాచుర్యంలోకి వచ్చింది. శాండ్బాక్స్ టెక్నాలజీ రామప్ప ఆలయాన్ని నిర్మించి 808 ఏళ్లు కావస్తున్నప్పటికీ చెక్కు చెదరకుండా చూపరులను ఆకర్షిస్తోంది. ఈ ఆలయ నిర్మాణంలో శాండ్ బాక్స్ టెక్నాలజీని ఉపయోగించారు. అంటే ఇసుకపై ఆలయాన్ని నిర్మించారన్నమాట. మూడు మీటర్ల లోతు పునాది తవ్వి అందులో పూర్తిగా ఇసుకను నింపి దానిపై రాళ్లను, శిలలను పేర్చుకుంటూ పోయి ఆలయాన్ని నిర్మించారు. నీటిపై తేలియాడే ఇటుకలు ఆలయ గోపురం బరువు తగ్గించేందుకు తేలికైన ఇటుకలు ఉపయోగించారు. వీటిని ప్రత్యేక పద్దతిలో తయారు చేశారు. ఈ ఇటుకలు నీటిలో తేలియాడుతాయి. సాధారణంగా నిర్మాణంలో వినియోగించే ఇటుకలు 2.2 సాంద్రతను కలిగి ఉంటాయి. రామప్ప ఆలయ గోపురానికి వాడిన ఇటుకల సాంద్రత కేవలం 0.8 . దీంతో ఇవి నీటిలో తేలియాడుతాయి. ఇలాంటి ఇటుకలతో దేశంలో మరెక్కడా నిర్మాణాలు లేవని చరిత్రకారులు చెబుతున్నారు. ఇంజనీరింగ్ విశేషాలు ఆలయానికి లేత ఎరుపువర్ణం కలిగిన అరుదైన రాయిని వినియోగించడంతో నిర్మాణం చెక్కుచెదరకుండా ఉండటానికి కారణంగా పేర్కొంటున్నారు. కట్టడం బరువు ఎక్కువగా ఉన్న చోట తేలికగా ఉండే గ్రానైట్, డోలమైట్, బ్లాక్ గ్రానైట్లను వినియోగించి ఆలయాన్ని నిర్మించడం రామప్ప శిల్పికే సాధ్యమైంది. శిల్పకళ ఆలయం నలువైపులా ఉన్న మదనికల శిల్పాలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. బ్లాక్ గ్రానైట్ రాయిపై చెక్కిన మదనికల సొగసు వర్ణణాతీతం. ఇక ఆలయం నలువైపులా ఆనాటి కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా ఈజిఫ్టు, మంగోలియన యాత్రికుల శిల్పాలు అబ్బరు పరుస్తాయి. ఇక ఆలయం లోపల నాట్యమంటపం ఆనాటి శిల్ప కళా వైభవానికి తార్కాణంలా నిలిచిపోతుంది. సూది బెజ్జం సందుతో అతి సూక్ష్మమైన శిల్పాలు ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. ఐదేళ్ల శ్రమ రామప్ప ఆలయాన్ని యునెస్కో జాబితాలో చోటు కల్పించేందుకు కాతీయ హెరిటేజ్ ట్రస్ట్, ఇన్టాక్ వరంగల్ చాప్టర్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐదేళ్లుగా కృషి చేస్తున్నాయి. దీంతో 2017లో యూనెస్కో హెరిటేజ్ సైట్ టెంటిటీవ్ లిస్టులో చోటు సాధించింది. ఆ తర్వాత ఐకోమాస్ (ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్) సభ్యుడు, యునెస్కో ప్రతినిధి వాసు పోశ్యానందన (థాయ్‌లాండ్) 2019 సెప్టెంబర్‌లో ఆలయాన్ని సందర్శించారు. ప్రతి ఆంశాన్ని క్షుణ్ణంగా పరీశీలించి రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపునకు కావాల్సిన అర్హతలు ఉన్నాయంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రామప్ప ఆలయానికి సంబంధించిన సమగ్ర వివరాలతో కూడిన పుస్తకం (డోషియర్) రూపొందించి యూనెస్కోకు సమర్పించారు. ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి యునెస్కో గుర్తింపుకోసం రామప్ప ఆలయాన్ని ప్రతిపాదించడంతో, దీనిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్‌లతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఉన్నత స్థాయి బృందం జూన్ 24న ఢిల్లీకి వెళ్లింది. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చేలా కృషి చేయాలని కోరుతూ కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌కు వినతిపత్రం అందించింది. అలాగే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆలయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పలు అభివృద్ధి పనులు చేపట్టారు. చరిత్రకు సత్కారం ఈ హోదా లభిస్తే ఘనమైన కాకతీయుల చరిత్రకు ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కుతుంది. ఆలయం పూర్తిగా యునెస్కో అధీనంలోకి వెళుతుంది. ప్రత్యేకంగా నిధులు అందే అవకాశంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు, ఆలయంతో పాటు ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అవకాశం కలుగుతుంది. యునెస్కో గుర్తింపు నేపథ్యంలో విదేశీ పర్యాటకులు పెరుగుతారు. స్థానికులకు అన్ని విధాలా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. -
యునెస్కో జాబితాలో ఓరుగల్లు అద్భుతాలు!
ప్రపంచ వారసత్వ సంపదగా వేయిస్తంభాల గుడి, వరంగల్ కోట, రామప్ప దేవాలయం సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో మన రాష్ట్రానికి అరుదైన అవకాశం కలిగింది. అద్భుత శిల్పకళా సం పద, అబ్బురపరిచే అతి పురాతన నిర్మాణ పరిజ్ఞానానికి సజీవ సాక్ష్యంగా ఉన్న వరంగల్ ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ప్రపంచ వారసత్వ సంపద హోదాను కేటాయించే ‘యునెటైడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో)’ తాత్కాలిక జాబితాలో వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయాలు చోటు దక్కించుకున్నా యి. ఈ సంవత్సరం చివరలో పారిస్ నుంచి యునెస్కో ప్రతి నిధులు వచ్చి వాటిని పరిశీలిస్తారు. అనంతరం వాటికి ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు కల్పించాలా లేదా అనేదానిపై తుది నిర్ణయం తీసుకుంటారు. వీటిలో ఏ ఒక్కటైనా యునెస్కో గుర్తింపు పొందితే తెలుగు రాష్ట్రాల నుంచి ఆ ఘనత సాధించిన తొలి కట్టడంగా చరిత్రలో నిలిచిపోతుంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 32 ప్రాంతాలు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద హోదా దక్కించుకున్నాయి. దక్షిణ భారతదేశానికి సంబంధించి తమిళనాడు, కర్ణాటక, కేరళలు ఆ ఘనత పొం దగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు మాత్రం అవకాశం దక్కలేదు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోకి ప్రవేశించే సింహద్వారాన్ని కాకతీయ కళాతోరణం వలె నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం టెండర్లు పిలవడమా..?నామినేషన్ పద్ధతిలో అప్పగించడమా అనే అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణ సచివాలయంలోకి ప్రవేశ ద్వారం లేకుండా రహదారిపై ఉంది. బారికేడ్ల సాయంతోనే సందర్శకులను లోపలికి అనుమతిస్తున్నారు. గుంపులుగా వస్తే వారిని నిలువరించడం కష్టంగా ఉంది. శుక్రవారంలోగా ప్రవేశమార్గం వద్ద గేట్లు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కాకతీయ కళాతోరణాన్ని ఇక్కడ నిర్మించడం ద్వారా ప్రత్యేకత చూపించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు అధికారవర్గాలు వివరించాయి.