సాగుబడి : ‘రాంభూటాన్’ పండ్లు పండిద్దామా?
మృగశిర కార్తె (జూన్ 21 వరకు), ఆరుద్ర కార్తె (జూన్ 22 నుంచి)
ఎర్రగా, ఒళ్లంతా రోమాలతో మన ఆకాకర కాయ మాదిరిగా కనిపించే ఈ మలేసియా పండు పేరు ‘రాంభూటాన్’. తీపిలో కొంచెం పులుపు కలగలిసిన రుచి ఉంటుంది. అత్యంత పోషక విలువలున్న ఈ పండ్ల తోటలు శ్రీలంక, తైవాన్, మలేసియా తదితర దేశాల్లో.. కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సాగవుతూ విదేశాలకు ఎగుమతవుతున్నాయి.
ఈ పండ్ల మొక్కలను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన యూనివ ర్సిటీ(వెంకట్రామన్నగూడెం, ప.గో. జిల్లా) ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నది. ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవసరం లేకుండా పెరగటం రాంభూటాన్ చెట్ల ప్రత్యేకత. నాలుగేళ్ల క్రితం కర్ణాటకలోని చిత్తలీ ఫాం నుంచి విత్తనాలు తెచ్చి వెంకట్రామన్నగూడెంలో నాటారు. ఆ చెట్లకు సంతృప్తికరమైన పండ్ల దిగుబడి వస్తోంది. ఇక్కడి వాతావరణంలోనూ ఈ జాతి పండ్ల చెట్లు చక్కగా పెరుగుతాయని రుజువైంది. కేరళ నుంచి తెప్పించిన అంటు మొక్కలను ఇటీవలే నాటారు. అంటు మొక్కల నుంచి వచ్చే పండ్లు మరింత రుచిగా ఉంటాయని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన వర్సిటీ పండ్ల తోటల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.రాజశేఖర్(73826 33660) తెలిపారు. మొక్క నాటిన మూడో ఏడాది నుంచి కాపు మొదలవుతుంది. పండ్ల దిగుబడి మూడో ఏడాదిలో చెట్టుకు 3 - 8 కిలోలతో ప్రారంభమై.. ఆరో ఏడాదికి 50 నుంచి 80 కిలోలకు పెరుగుతుంది. కాయ బరువు 18 గ్రాములుంటుంది. లోపల గింజతో ఉన్న గుంజు బరువు 12 గ్రాములు ఉంటుంది.
కేరళలోని కొట్టాయం జిల్లాలోని కంజీరాపల్లితో పాటు, తిరువనంతపురం సమీపంలోని పాలోడ్, వితుర ప్రాంతాల్లోని రాంభూటాన్ తోటలు, నర్సరీలలో అంటు మొక్కలను విక్రయిస్తున్నారు. అక్కడ కిలో పండ్లకు రూ. 180కు పైగా ధర పలుకుతోంది. రాంభూటాన్ చెట్టు భాగాలు ఔషధాల తయారీలో, బ్లాక్ డై, సబ్బులు, కొవ్వొత్తుల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. మార్కెట్ అవకాశాలుంటే విస్తృతంగా సాగు చేయదగిన కొత్తరకం పండ్ల జాతి ఇది.
- యడ్లపల్లి మురళీకృష్ణ, తాడేపల్లిగూడెం
పర్యావరణహిత సేద్యంపై సర్టిఫికెట్ కోర్సు
పర్యావరణ హితమైన సేద్య పద్ధతులు, నమూనాలపై కోల్కతా యూనివర్సిటీ ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సును ప్రారం భించనుంది. నార్వేకు చెందిన యూని వర్సిటీ ఆఫ్ లైఫ్ సెన్సైస్తో కలిసి కోల్కతా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ పొల్లినేషన్ స్టడీస్ ఆంగ్ల మాధ్యమంలో ఈ కోర్సును కోల్కతా కేంద్రంగా ఆఫర్ చేస్తోంది. సుస్థిర వ్యవసాయ కేంద్రం (సికింద్రాబాద్ ఫోన్: 040 27014302) ఈ కోర్సు నిర్వహణలో తోడ్పాటు నందిస్తుంది. సైన్స్, ఎకనామిక్స్, సోషల్ సెన్సైస్లలో ఏదైనా డిగ్రీ కలిగి ఉన్న వారెవరైనా అర్హులే. జూన్ 22 నుంచి ధరఖాస్తులు పొందవచ్చు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కోర్సు ప్రారంభమవుతుంది. పర్యావరణ హితమైన సేద్య నమూనాలను రూపొందించడం, విశ్లేషించడంపై శిక్షణ ఉంటుంది. వివరాలకు సంప్రదించాల్సిన మెయిల్ ఐడి: groecology.cps@gmail.com