ramireddy prathap reddy
-
మాధురికి ఎమ్మెల్యే ప్రసన్న రూ. లక్ష సాయం
సాక్షి, కావలి: పట్టణంలోని ముసునూరుకు చెందిన డిగ్రీ ఫైనలియర్ విద్యార్థి కాకర్ల మాధురిని ఆదుకునేందుకు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ముందుకొచ్చారు. మాధురి బ్లడ్ కేన్సర్‌తో పోరాటం చేస్తోంది. అమ్మ, తమ్ముడు దివ్యాంగులు, తండ్రికి ప్రమాదవశాత్తూ కాలు విరగడంతో ఆ కుటుంబ దుస్థితిపై ‘అయ్యో’ అనే శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి దాతల నుంచి అనూహ్య స్పందన లభించింది. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరుతో నిర్వహిస్తున్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందజేయనున్నామని ప్రకటించారు. ఈ ఆర్థిక సాయాన్ని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా విద్యార్థిని కుటుంబసభ్యులకు అందజేస్తామని ట్రస్ట్ చైర్మన్ ప్రసన్నకుమార్‌రెడ్డి, ట్రస్ట్ కోశాధికారి, ఎమ్మెల్యే తనయుడు నల్లపరెడ్డి రజత్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడారు. చదువుల్లో టాపరైన విద్యారి్థని తన ప్రతిభతో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా అవార్డును అందుకోవడం గర్వంగా ఉందన్నారు. ఇలాంటి చురుకైన విద్యార్థినికి బ్లడ్ కేన్సర్ రావడం దురదృష్టకరమని తెలిపారు. ఈ క్రమంలో నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సాయం చేయాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. అనంతరం రజత్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. విద్యార్థిని మాధురి వ్యాధి నుంచి కోలుకొని సమాజానికి ఉపయోగపడేలా భగవంతుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నామని చెప్పారు. మాధురి పరిస్థితిపై ఆరోగ్యశ్రీ అధికారుల ఆరా కాకర్ల మాధురి కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్య చికిత్స నిమిత్తం చేరింది. ఈ క్రమంలో అమరావతిలోని సీఎం కార్యాలయం నుంచి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పర్యవేక్షిస్తున్న అధికారులు సదరు కార్పొరేట్ ఆస్పత్రి వర్గాలతో ఫోన్లో మాట్లాడారు. మరోవైపు సాక్షిలో ప్రచురితమైన కథనానికి పలువురు స్పందించారు. ఓ పోలీస్ అ«ధికారి రూ.25 వేల ఆర్థిక సాయాన్ని అందజేస్తామని ప్రకటించారు. మాధురి చదువుతున్న డిగ్రీ కళాశాల యాజమాన్యం, విద్యార్థులు ఆర్థిక సాయాన్ని అందించారు. విద్యారి్థని నివాసం ఉండే ముసునూరుకు చెందిన స్థానికులు ఆర్థిక సాయాన్ని అందజేశారు. -
దత్తపుత్రుడు ఆరాట పడుతున్నాడు: బాలినేని
సాక్షి, కావలి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో సంపూర్ణ విజయాన్ని సాధిస్తామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి చెప్పారు. రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన తర్వాత మొట్ట మొదటిసారిగా జిల్లాకు వస్తూ కావలిలోని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనను జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా నియమించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. జిల్లాలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నింటిని కూడా కచ్చితంగా అమలు చేసే తీరుతామని చెప్పారు. జిల్లా ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన అభివృద్ధి పనులన్నీ కూడా అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీకి కంచుకోటగా ఉందని, జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు పది స్థానాల్లో వైఎస్సార్సీపీనే ప్రజలు గెలిపించారని మంత్రి గుర్తు చేశారు. దానికి ప్రతిఫలంగా తమ వంతుగా జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అటవీశాఖ అభ్యంతరాలు వల్ల దశాబ్దాలుగా నిలిచి పోయిన సాగునీటి కాలువలు నిర్మాణాలపై దృష్టి పెడతామన్నారు. రైతులకు సాగునీరు అందించే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందని, అటవీ శాఖ అధికారులను అమరావతికి పిలిపించి సాగునీటి కాలువలు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. రామాయపట్నంలో పోర్టు నిర్మాణం కోసం సీఎం అన్ని చర్యలు తీసుకొంటున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో వర్షాలు రావడంతో వరదలు వచ్చి అన్ని చోట్ల నీరు ప్రవహిస్తుంటే చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఇసుక కొరత అంటూ రాజకీయాల కోసం రాద్ధాతం చేస్తున్నారని మంత్రి మండి పడ్డారు. పవన్‌కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని అని, చంద్రబాబు కోసం ఏదేదో మాట్లాడుతున్నాడన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జనరంజక పాలన చేస్తే, తాను వెళ్లి సినిమాలు చేసుకొంటానని పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు. మరీ పవన్‌కళ్యాణ్ సినిమాలు చేస్తున్నారంటే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి జనరంజక పాలన చేస్తున్నట్లే కదా అని మంత్రి అన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనపై సర్వే చేస్తే, సంక్షేమ పథకాల్లో 80 శాతం రాష్ట్రంలోని ప్రజలు ఆమోదం తెలిపారని మంత్రి వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు మన్నెమాల సుకుమార్‌రెడ్డి, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, కొండూరు అనీల్ బాబు, కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఆ ఇద్దరూ జగనన్నకు దూరం కారు
నెల్లూరు, కావలి: మాజీ ఎమ్మెల్యేలు కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, వంటేరు వేణుగోపాల్‌రెడ్డిలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే అభిమానమని, వారిద్దరూ జగనన్నకు దూరం కారని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. కావలిలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డితో ప్రత్యేక అనుబంధం ఉన్న విష్ణువర్ధన్‌రెడ్డి, అదే అభిమానాన్ని జగన్మోహన్రెడ్డిపై పెంచుకున్నారని అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండటానికి విష్ణువర్ధన్‌రెడ్డికి ఇష్టమే కానీ, ఎవరో ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చి పక్కదోవ పట్టిస్తున్నారనేది తన అభిప్రాయమన్నారు. జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని మా అందరికన్నా విష్ణువర్ధన్‌రెడ్డికే ఉందని ఎమ్మెల్యే అన్నారు. విష్ణువర్ధన్‌రెడ్డికి వైఎస్సార్సీపీలో అన్ని రకాల హక్కులు ఉన్నాయన్నారు. ఆయన మాటను తామందరం గౌరవించాల్సిందే అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే విష్ణువర్ధన్‌రెడ్డి ద్వారా ప్రజలకు ఉపయోగపడే శాశ్వతమైన పనులు చేయడానికి తాము ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే జిల్లాలో విష్ణువర్ధన్‌రెడ్డికే పెద్దపీట వేస్తారనే విషయం తమకు తెలుసన్నారు. మరో రెండు నెలల్లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతుండడంలో విష్ణువర్ధన్‌రెడ్డి భాగస్వామ్యం కూడా ఉండి చరిత్రలో ఆయన పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోతుందని నమ్ముతున్నానని ఎమ్మెల్యే అన్నారు. అలాగే చంద్రబాబు, టీడీపీలో ఉన్న నాయకుల వల్ల ఆర్థికంగా, రాజకీయంగా తీవ్రంగా నష్టపోయిన మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డికి వైఎస్సార్సీపీలో సముచితమైన గౌరవం ఉంటుందన్నారు. తనకు వేణుగోపాల్‌రెడ్డిపై ప్రత్యేక గౌరవం ఉందన్నారు. చంద్రబాబు మోసాలు గురించి టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కథలుగా చెబుతూ ప్రస్తుతం వైఎస్సార్సీపీలో చేరుతున్నారని, కానీ వంటేరు వేణుగోపాల్‌రెడ్డికి ఎనిమిదేళ్ల క్రితమే చంద్రబాబు మోసాల గురించి బాగా తెలుసునని, అందుకే వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారని అన్నారు. జగన్మోహన్రెడ్డి ఆలోచనా విధానాన్ని, వైఎస్సార్సీపీ దృక్పథాన్ని బలంగా వినిపించిన వంటేరు వేణుగోపాల్‌రెడ్డి లాంటి నాయకుడు జగనన్నకు దూరం కారని ఎమ్మెల్యే అన్నారు. కావలి ప్రాంత సమస్యలు, ప్రజల మనోభావాలపై సమగ్రమైన అవగాహన ఉన్న వేణుగోపాల్‌రెడ్డి పార్టీలో ఉండి ఉన్నతమైన గౌరవాన్ని అందుకొంటారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
తెలుగు తమ్ముళ్ల వీరంగం
కావలి: తెలుగు తమ్ముళ్లు బుధవారం వీరంగం సృష్టించారు. వివరాలు.. కావలి పట్టణంలో కొత్తగా మంజూరైన పింఛన్లు లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మున్సిపల్ అధికా రులు బుధవారం స్థానిక రైల్వేరోడ్డులోని కారోనేషన్ రీడింగ్ రూం ఆవరణలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, టీడీపీ నాయకుడైన మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, వైఎస్సార్సీపీ, టీడీపీ కౌన్సి లర్లు, నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల పేద ప్రజలు నాలుగేళ్లుగా నలిగిపోయారని అన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్ప డు 6000 మందికి ఇంటి స్థలాలు, ఇళ్లు నిర్మించి ఇచ్చారని, టీడీపీ ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇవ్వకుండా అపార్ట్మెంట్లు నిర్మించి అధిక ధరలకు అందులోని ప్లాట్లను అంటగట్టి అప్పులపాలు చేస్తోందన్నారు. కావలి పట్టణంలో 4,500 మంది స్వయం ఉపాధి బ్యాంక్ రుణాల కోసం దరఖాస్తులు చేసుకుంటే, కేవలం 578 మంది టీడీపీ కార్యకర్తలకు మాత్రమే రుణాలు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. దీంతో వేదికపై ఉన్న టీడీపీ నాయకుడి వద్ద మెప్పు పొందుదామనుకున్న యావతో టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అయితే తాను మాట్లాడేది నిజం కాదా అని ఎమ్మెల్యే అనడంతో ప్రజలు నిజమేనని నినదించారు. దీంతో టీడీపీ నాయకులు చెలరేగిపోయారు. వారిని వైఎస్సార్సీపీ నాయకులు కూడా ఎదుర్కొన్నారు. టీడీపీ నాయకుల ఘర్షణ విధానాన్ని అనుసరిస్తున్నందుకు నిరసనగా ఎమ్మెల్యే తాము కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. ఆయనతోపాటు వైఎస్సా ర్ సీపీ నాయకులు కూడా వెళ్లిపోయారు. -
'ధైర్యం ఉంటే కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించాలి'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి లేదని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే టీడీపీకి చెందిన కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలతో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలనే ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ది రావాలనే ఆగస్టు 10న ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధర్నా చేస్తున్నట్టు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి చెప్పారు.