దత్తపుత్రుడు ఆరాట పడుతున్నాడు: బాలినేని | Minister Balineni Talks About Localbody Elections | Sakshi
Sakshi News home page

దత్తపుత్రుడు ఆరాట పడుతున్నాడు: బాలినేని

Published Wed, Nov 6 2019 12:07 PM | Last Updated on Wed, Nov 6 2019 12:09 PM

Minister Balineni Talks About Localbody Elections - Sakshi

మాట్లాడుతున్న మంత్రి బాలినేని, పక్కన ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి

సాక్షి, కావలి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో సంపూర్ణ విజయాన్ని సాధిస్తామని జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి చెప్పారు. రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమితులైన తర్వాత మొట్ట మొదటిసారిగా జిల్లాకు వస్తూ  కావలిలోని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనను జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా నియమించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. జిల్లాలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నింటిని కూడా కచ్చితంగా అమలు చేసే తీరుతామని చెప్పారు. జిల్లా ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన అభివృద్ధి పనులన్నీ కూడా అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీకి కంచుకోటగా ఉందని, జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు పది స్థానాల్లో వైఎస్సార్‌సీపీనే ప్రజలు గెలిపించారని మంత్రి గుర్తు చేశారు. దానికి ప్రతిఫలంగా తమ వంతుగా జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అటవీశాఖ అభ్యంతరాలు వల్ల దశాబ్దాలుగా నిలిచి పోయిన సాగునీటి కాలువలు నిర్మాణాలపై దృష్టి పెడతామన్నారు. రైతులకు సాగునీరు అందించే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందని, అటవీ శాఖ అధికారులను అమరావతికి పిలిపించి సాగునీటి కాలువలు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. రామాయపట్నంలో పోర్టు నిర్మాణం కోసం సీఎం అన్ని చర్యలు తీసుకొంటున్నారని వెల్లడించారు.

రాష్ట్రంలో  వర్షాలు రావడంతో వరదలు వచ్చి అన్ని చోట్ల నీరు ప్రవహిస్తుంటే చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌ ఇసుక కొరత అంటూ రాజకీయాల కోసం రాద్ధాతం చేస్తున్నారని మంత్రి మండి పడ్డారు. పవన్‌కళ్యాణ్‌ రాజకీయ అజ్ఞాని అని, చంద్రబాబు కోసం ఏదేదో మాట్లాడుతున్నాడన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జనరంజక పాలన చేస్తే, తాను వెళ్లి సినిమాలు చేసుకొంటానని పవన్‌ కళ్యాణ్‌ చెప్పారన్నారు. మరీ పవన్‌కళ్యాణ్‌ సినిమాలు చేస్తున్నారంటే.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జనరంజక పాలన చేస్తున్నట్లే కదా అని మంత్రి అన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనపై సర్వే చేస్తే, సంక్షేమ పథకాల్లో 80 శాతం రాష్ట్రంలోని ప్రజలు ఆమోదం తెలిపారని మంత్రి వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు మన్నెమాల సుకుమార్‌రెడ్డి, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, కొండూరు అనీల్‌ బాబు, కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి  పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement