మూత'బడు'లు
మూసివేత దిశగా 100కు పైగా పాఠశాలలు
1:30 ప్రకారం 155, 1:20 ప్రకారం అయితే 105 స్కూళ్లు ..
78 సక్సెస్ పాఠశాలలపైనా వేటు
కొంపముంచుతున్న రేషనలైజేషన్
డీఎస్సీపైనా తీవ్ర ప్రభావం
విద్యాశాఖలో రేషనలైజేషన్ సంక్షోభం నెల కొంది. తాజా బదిలీలు, రేషనలైజేషన్‌కు సంబంధించి జీవో నం.11 లేదా సవరించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం కూడా సర్కారు పాఠశాలలపై తీవ్ర ప్రభావం పడనుంది.
నిజామాబాద్ అర్బన్ :
విద్యాశాఖలో రేషనలైజేషన్ సంక్షోభం నెలకొంది. తాజా బదిలీలు, రేషనలైజేషన్‌కు సంబంధించి జీవో నం.11 లేదా సవరించిన కొత్త మార్గదర్శకాల ప్రకారమైనా సర్కారు పాఠశాలలపై తీవ్ర ప్రభావం పడనుంది. జిల్లాలో 100కు పాఠశాలలు మూసివేసే ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రక్రియను అమలు చేస్తే విద్యాశాఖనే సందిగ్ధంలో పడే అవకాశం ఉంది. తాజా మార్గదర్శకాలపై పాఠశాల డెరైక్టర్ ఆదేశాల కోసం విద్యాశాఖ ఎదురుచూస్తుండగా జీవో నం. 11ను అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో సర్కారు పాఠశాలల మనుగడకు ముప్పు ఏర్పడనుంది.
100కు పైగా పాఠశాలలు మూత..
తాజా ఉత్తర్వులు లేదా సవరించిన మార్గదర్శకాల ప్రకారం 100కు పైగా పాఠశాలలకు ముప్పు వాటిల్లనుండడంతో విద్యాశాఖ అధికారులే విస్మయం చెందుతున్నారు. జిల్లాలో 463 ఉన్నత పాఠశాలలు, 576 ప్రాథమిక పాఠశాలు, 263 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 2.65 లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు. తాజాగా టీచర్ల బదిలీలు, రేషనలైజేషన్‌కు సంబంధించి ప్రభుత్వం జీవోనం.11ను విడుదల చేసింది. దీని ప్రకారం 1:30 ప్రకారం అరుుతే 155 పాఠశాలలు, ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ మేరకు 1:20 ప్రకారం అరుుతే 105 పాఠశాలలు మూసివేసే అవకాశం ఉంది. అంతేకాక 1:30 ప్రకారం రేషనలైజేషన్ చేపడితే 1175 టీచర్ పోస్టులు బదలాయించాల్సి వస్తుంది. ఇందులో 68 మంది టీచర్లను మాత్రమే బదలాయించే అవకాశం ఉంది. మిగితా 1107 టీచర్ పోస్టులు ఎక్కువగా మిగిలిపోతున్నాయి. ఈ పోస్టులను ఎక్కడ భర్తీ చేయాలనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ సమయంలో మిగిలిన వారిని సైతం ఆయా పాఠశాలల్లో వరుస క్రమంగా కేటాయిస్తే పాఠశాలలకు అదనంగా ఉపాధ్యాయులను కేటాయించినట్టవుతుంది. ఈ విధానాన్నే విద్యాశాఖ కొనసాగించే అవకాశం ఉంది. 1:20 ప్రకారం రేషనలైజేషన్ చేపడితే 750 పోస్టులు మిగిలిపోతున్నాయి. వీరిని సైతం ఇదే విధంగా కేటాయించే అవకాశం ఉంది.
78 సక్సెస్ పాఠశాలలకు ఎసరు...
రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా ఇంగ్లిష్ మీడియం బోధిస్తే సక్సెస్ పాఠశాలలు మూసివేసే ప్రమాదం ఏర్పడింది. జీవో నం.11 ప్రకారం 50 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న సక్సెస్ పాఠశాలలను మూసివేయాలని ఆదేశాలు అందాయి. జిల్లాలో 188 సక్సెస్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 50 మంది విద్యార్థుల కన్న తక్కువ ఉన్న పాఠశాలలు 78 ఉన్నాయి. వీటిని మూసివేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ సమీప పాఠశాలలకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో సక్సెస్ పాఠశాలలో విలీనం చేయనున్నారు. లేదంటే ఉన్నత పాఠశాలల్లోనే కొనసాగించనున్నారు. ఈ పాఠశాలల్లో ఉన్న టీచర్లను సైతం బదలాయిస్తారు.
డీఎస్సీపై తీవ్ర ప్రభావం...
రేషనలైజేషన్ ప్రక్రియ డీఎస్సీపై తీవ్ర ప్రభావం చూపనుంది. రేషనలైజేషన్‌లో సుమారు వెయ్యి పోస్టులు ఎక్కువగా మిగిలిపోనున్న నేపథ్యంలో ఆ ఉపాధ్యాయులతో ఖాళీలు భర్తీ చేస్తారు. ఇది డీఎస్సీపై ప్రభావం చూపుతుంది. 1:30 ప్రకారం 1107, 1:20 ప్రకారం 750 పోస్టులు మిగిలిపోనున్నాయి. దీంతో జిల్లాలో అసలు పోస్టులు ఖాళీలు లేకుండా పోతున్నాయి. డీఎస్సీ నిర్వహణకు జిల్లాలో 1150 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు జిల్లా అధికారులు పాఠశాల డెరైక్టర్‌కు నివేదించారు. రేషనలైజేషన్ చేస్తే ఈ పోస్టులు సైతం మిగిలేలా లేవు. మరి దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.
పాఠశాలల మూసివేత మానుకోవాలి
రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను ఒక్కటి కూడా మూసివేయొద్దు. టీచర్ల పోస్టులు బదలాయించినా 1:20 ప్రకారం రేషనలైజేషన్ చేపట్టాలి. ప్రభుత్వ పాఠశాలల మనుగడను కాపాడాలి.
- కమలాకర్‌రావు,
పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు
ప్రాథమిక పాఠశాలలను మెరుగుపర్చాలి
రేషనలైజేషన్‌లో భాగంగా ప్రాథమిక పాఠశాలలకు తీవ్ర అన్యాయం జరుగనుంది. వందలాది పాఠశలలు మూసివేసే ప్రక్రియ వెంటనే విరమించుకోవాలి. పాఠశాలలను మెరుగుపర్చాలి. పేద, మధ్యతరగతి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలి.
- మాడవేడి వినోద్‌కుమార్,
బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు