ఫిరాయింపుదారులకు నజరానాలు
హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకుని ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రజల సొమ్మును పంచిపెడుతున్నదని కాంగ్రెస్ విప్, ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఖమ్మం ఎంపీ శ్రీనివాస్ రెడ్డికి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కు సీఎం కేసీఆర్ ప్రభుత్వ భూములను కట్టబెట్టారని ఆరోపించారు.
జీఓ 59 కింద 45 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించారని ఎమ్మెల్యే చెప్పారు. ఈ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ చేస్తున్న నీతిమాలిన రాజకీయాలకు అధికారులు సహకరించవద్దని సంపత్ సూచించారు. ఫిరాయింపుదారులకు టీఆర్ఎస్ నజరానాలు ఇస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే అబద్దపు సర్వేలను ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ సర్వేలను ప్రజలు నమ్మరని ఎమ్మెల్యే సంపత్ హెచ్చరించారు.