చిన్నారులకోసం సేవింగ్స్ ఖాతాలు
నిజామాబాద్ బిజినెస్ : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రాబ్యాంక్ బాలల కోసం ఏబీ లిటిల్ స్టార్స్, ఏబీ టీన్స్ అనే రెండు కొత్త సేవింగ్స్ ఖాతాలను ప్రారంభించిందని ఆంధ్రాబ్యాంకు జోనల్ మేనేజర్ ఆర్.మల్లికార్జున తెలిపారు. బ్యాంకు ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా నగరంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలు నిర్వహించారు.
శుక్రవారం రాత్రి స్థానిక ప్రగతినగర్‌లోని మున్నూరుకాపు కల్యాణ మండపంలో బహుమతుల ప్రదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంద్రజాలికుడు జాదూ యుగేందర్ రంగనాథ్ తన ప్రదర్శనతో ఆహూతులను అలరించారు. అనంతరం విజేతలకు బహుమతులతోపాటు, కొత్త స్కీమ్ ఖాతా పుస్తకాలను అందించారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాసాచారి, ఆంధ్రాబ్యాంక్ జోనల్ కార్యాలయం చీఫ్ మేనేజర్లు, సీనియర్ మేనేజర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.