Rogers Cup
-
రోజర్స్ కప్ డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నీ రద్దు
మాంట్రియల్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌కు సన్నాహకంగా జరిగే రోజర్స్ కప్ మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) టోర్నమెంట్‌ను ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ ఆగస్టు 7 నుంచి 16 వరకు కెనడాలోని మాంట్రియల్లో జరగాల్సింది. అయితే కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా కెనడా ప్రభుత్వం ఆగస్టు 31 వరకు ఎలాంటి ఈవెంట్స్ నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఈ టోర్నీ నిర్వాహకులు ఈ ఏడాది టోర్నీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. -
జొకో ఖాతాలో మరో మాస్టర్స్ టైటిల్..
టొరొంటో: ప్రపంచ టెన్నిస్ నంబర్ వన్ ఆటగాడు, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఖాతాలో మరో మాస్టర్స్ టైటిల్ చేరింది. రోజర్స్ కప్‌లో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో జొకోవిచ్ 6-3,7-5 తేడాతో జపాన్ యువతార కీ నిషికోరిపై గెలిచి టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. తద్వారా 30వ ఏటీపీ మాస్టర్స్ టైటిల్స్‌ను తన ఖాతాలో వేసుకున్న జొకోవిచ్.. తన అత్యధిక మాస్టర్స్ టైటిల్స్ రికార్డును మరోసారి సవరించుకున్నాడు. మరోవైపు స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్(28 మాస్టర్స్ టైటిల్స్), స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్(24 మాస్టర్స్ టైటిల్స్)లను మరింత వెనక్కి నెట్టాడు. రోజర్స్ కప్ టైటిల్ పోరులో తొలి సెట్‌ను 32 నిమిషాల్లో అవలీలగా గెలుచుకున్న జొకోవిచ్.. రెండో సెట్లో మాత్రం నిషికోరి నుంచి కాస్త ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. రెండో సెట్ టై బ్రేక్‌కు దారి తీసే తరుణంలో రెండు బ్రేక్ పాయింట్లతో ఆ సెట్‌ను కైవసం చేసుకున్న జొకోవిచ్ టైటిల్‌ను కూడా గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్ అనంతరం జొకోవిచ్ మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడంపైనే ప్రస్తుతం దృష్టి సారించినట్లు జొకోవిచ్ తెలిపాడు. -
వరల్డ్ నంబర్.1ను హడలెత్తించాడు!
టొరంటో: సెర్బియా సంచలనం, ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ నోవాక్ జొకోవిచ్ కాస్త తడ బడ్డాడు. టొరంటో టెన్నిస్ ఈవెంట్ రోజర్స్ కప్ లో బుధవారం జరిగిన మ్యాచ్ లో లగ్జెంబర్గ్ కు చెందిన ప్రత్యర్థి గిల్స్ ముల్లర్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో ఓ దశలో వెనకంజ వేసినా చివరికి 7-5, 7-6(3) తేడాతో నెగ్గి ఊపిరి పీల్చుకున్నాడు. సెర్బియా యోధుడు టొరంటో టెన్నిస్ టోర్నీ, మాంట్రియల్ 2007, 2011, 2012లలో గెలుపొందాడు. మ్యాచ్ ఓడినప్పటికీ ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. మరోవైపు ఈ ఏడాది మార్చి తర్వాత హార్డ్ కోర్ట్ పై జొకో ఆడిన తొలి మ్యాచ్ కావడం విశేషం. అన్ సీడెడ్ ఆటగాడు ముల్లర్ సర్వీస్ ఎదుర్కోవడానికి వరల్డ్ చాంపియన్ తీవ్రంగా శ్రమించాడు. అయితే ముల్లర్ చేసిన తప్పిదాలను స్కోర్లుగా మలుచుకుని జొకోవిచ్ రెండు సెట్లు కైవసం చేసుకున్నాడు. లేకపోతే అనామకుడి చేతిలో ఓడిపోయి పరాభవం చెందేవాడు. ఓటమి బాధతో రియో ఒలింపిక్స్ లో పాల్గొనాల్సి వచ్చేది. మూడో రౌండ్ లో చెక్ రిపబ్లిక్ కు చెందిన రాడెక్ స్టెఫానెక్ తో తలపడనున్నాడు. మూడో సీడ్ ఆటగాడు నిషికోరి(జపాన్) 6-4, 7-5 తేడాతో అమెరికాకు చెందిన డెన్నిస్ నోవికొవ్ పై నెగ్గాడు. మరో మ్యాచ్ లో నాలుగో సీడెడ్ మిలోస్ రొనిక్(కెనడా) 6-3, 6-3 తో తైవాన్ కు చెందిన లు యెన్సున్ పై గెలుపొందాడు. -
సెమీస్‌లో ఓడిన సానియా జంట
టొరంటో : రోజర్స్ కప్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంటకు చుక్కెదురైంది. ఆదివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో ఈ జోడీ 3-6, 2-6 తేడాతో కరోలిన్ గార్సియా (ఫ్రాన్స్), కాటరీనా స్రెబోత్నిక్ (స్లొవేనియా) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. ప్రత్యర్థి సర్వీస్‌ను రెండు సార్లు బ్రేక్ చేసిన సానియా జంట తమ సర్వీస్‌ను ఐదు సార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. సెమీస్‌లో నిష్ర్కమించిన సానియా జోడికి 350 ర్యాంకింగ్ పాయింట్లతోపాటు 32,520 డాలర్లు (రూ. 21 లక్షల 18 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
సెమీస్‌లో సానియా జంట
టొరంటో : రోజర్స్ కప్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్) -మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఏకపక్షంగా జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా జోడీ 6-4, 6-2తో హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. సెమీఫైనల్లో ఈ ఇండో-స్విస్ జంట నాలుగో సీడ్ కరోలైన్ గార్సియా-కాటరీనా స్రెబోత్నిక్లతో తలపడుతుంది. -
సెమీఫైనల్స్‌లో సానియా జంట
టొరంటో: రోజర్స్ కప్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా- మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) జంట సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-4, 6-2 తో చాన్ సోదరీమణులు హవో-చాన్, యుంగ్-చాన్ జంటపై గెలిచింది. ఆట ముగిసిన తర్వాత హింగిస్ మాట్లాడుతూ.. గత మూడు నెలలనుంచి మేం బాగా ఆడుతున్నాం, ముఖ్యంగా వింబుల్డన్ విజయం తర్వాత మా ఆట తీరు సంతృప్తికరంగా ఉందన్నారు. తొలి రౌండ్ లో కొంచెం వెనకంజలో ఉన్నా ఇద్దరం కలిసి మెరుగ్గా ఆడి విజయం సాధించాం అన్నారు. ప్రతి మ్యాచ్‌లో ఆటతీరు మెరుగు పరుచుకుంటున్నామని తెలిపారు. -
రోజర్స్ కప్ టోర్నీలో లియాండర్ పేస్ ఓటమి
రోజర్స్ కప్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత స్టార్ లియాండర్ పేస్ పోరాటం ముగిసింది. రాడెక్ స్టెఫానక్ కలిసి బరిలోకి దిగిన పేస్ రెండో రౌండ్లోనే ఇంటి ముఖంపట్టాడు. బ్రిటన్‌కు చెందిన ఆండీ ముర్రే-కోలిన్ ఫ్లెమ్మింగ్ చేతిలో 3-6 3-6తో పేస్-రాడెక్ ద్వయం పరాజయం పాలయింది. రోహన్ బోపన్న-ఆండ్రీ బెజిమాన్ కూడా ఇప్పటి ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. కొత్త భాగస్వామి జీ జంగ్(చైనా)తో కలిసి బరిలోకి దిగిన సానియా మీర్జా రెండో రౌండ్లోనే ఓడిపోయింది. దీంతో 2,887,085 డాలర్ల ఈ టోర్నీలో భారత్ పోరు ముగిసింది. -
రెండో రౌండ్లో సానియా జోడి
టొరంటో (కెనడా): రోజర్స్ కప్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)-జెంగ్ జీ (చైనా) జోడి రెండో రౌండ్లోకి అడుగుపెట్టింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా-జెంగ్ జీ జంట 4-6, 7-6 (7/5), 10-2తో నటాలీ గ్రాన్డిన్ (దక్షిణాఫ్రికా)-దరియా జురాక్ (క్రొయేషియా) ద్వయంపై గెలిచింది. గంటా 38 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట రెండుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది. తదుపరి రౌండ్లో ఈ ఇండో-చైనా జోడి ఒక్సానా కలష్నికోవా (జార్జియా)-అలిసియా రొసాల్స్కా (పోలండ్) జంటతో తలపడుతుంది. బోపన్న జంట ఓటమి ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)-బెగెమన్ (జర్మనీ) జోడి 6-7 (4/7), 4-6తో ఇంగ్లోట్ (బ్రిటన్)-జనోవిజ్ (పోలండ్) జంట చేతిలో ఓడిపోయింది.