చెంప దెబ్బకు అయిదు లక్షలు
ముంబై: బాలీవుడ్ నటుడు గోవింద 2008లో ఓ అభిమాని చెంప చెళ్లుమనిపించిన కేసు తీర్పును సుప్రీం కోర్టు మంగళవారం వెల్లడించింది. బాధితుడు సంతోష్ రాయ్‌కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ గోవిందాను దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సంతోష్ రాయ్ ని కలిసి ముఖాముఖిగా క్షమాపణ చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం గోవిందాకు రెండు వారాల గడువు ఇచ్చింది.
వివరాల్లోకి వెళ్తే... 2008లో ముంబైలోని ఫిల్మిస్థాన్ స్టూడియోస్‌లో 'మనీ హైతో హానీ హై' అనే సినిమా షూటింగ్ సందర్భంగా సంతోష్ రాయ్ అనే వ్యక్తి చెంపను గోవిందా చెళ్లుమనిపించాడు. ఒక పాట చిత్రీకరణ సందర్భంగా అనుమతి లేకుండా స్పాట్ లోకి చొచ్చుకు రావడం, అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్నాడనే ఆగ్రహంతో గోవిందా అతనిపై చేయి చేసుకున్నట్టు సమాచారం.
దీంతో గోవిందా తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సంతోష్ రాయ్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, ఘటన జరిగిన ఏడాది తర్వాత కేసు నమోదు చేశాడన్న కారణంతో 2013లో హైకోర్టు ఈ కేసును కొట్టి వేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే తాను ఐదారు లక్షలను ఖర్చు చేశానని సంతోష్ రాయ్ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకు వచ్చాడు. ఈ క్రమంలో ఉన్నత ధర్మాసనం సంతోష్ రాయ్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. సంతోష్ రాయ్‌కు క్షమాపణలు చెప్పాలంటూ గోవిందాకు ఆదేశాలు జారీ చేసింది.