RTC bus - car accident
-
కారు, లారీని ఢీ కొట్టిన బస్సు
కొణిజర్ల ఖమ్మం: ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం తెల్లవారుజామున ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడులో జరిగింది. ఎస్ఐ వడ్లకొండ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలో మాగ్మా ఫైనాన్స్ కార్పొరేషన్ బ్రాంచ్ హెడ్‌గా పని చేస్తున్న నకిరికంటి వెంకటజాన్‌రెడ్డి (36) కారులో కొత్తగూడెం వెళ్లి తిరిగి ఖమ్మం వస్తుండగా తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి మధిర వెళుతున్న ఆర్టీసీ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. బస్సు అదే వేగంతో కారు వెనుక వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవింగ్ సీట్లో ఉన్న జాన్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్ భూక్యా నాగేశ్వరరావు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు లారీని ఢీకొని రోడ్డుకు అడ్డంగా నిలిచి పోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఎస్ఐ సురేష్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో బస్సు, లారీ, కారును రోడ్డు పక్కకు తీయించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. గాయపడ్డ బస్సు డ్రైవర్ నాగేశ్వరరావును 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం తరలించారు. మృతుడు జాన్‌రెడ్డిది కృష్ణా జిల్లా షేర్‌మహ్మద్‌పేట, ఖమ్మంలోని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో 6 నెలల క్రితమే బ్రాంచ్ హెడ్‌గా చేరాడు. మృతుడికి భార్య శృతి, కుమారుడు, కూతురు ఉన్నారు. బంధువులు ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదం మిగిల్చిన హోలీ
సంగారెడ్డి రూరల్: హోలీ వేడుకల్లో స్నేహితులతో ఆడిపాడి ఇంటికి తిరుగుముఖం పట్టిన ఐదుగురు యువకులను రోడ్డు ప్రమాదం కబలించింది. సంగారెడ్డి సమీపంలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ వద్ద జాతీయ రహదారి 65పై శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కేతకి డిజిటల్స్ నిర్వాహకుడు బాశెట్టి మహేశ్వర్ గుప్తా(28) తన స్నేహితులు వెంకట్రాంరెడ్డి (23), వెంకట్‌రెడ్డి (23), నాగరాజు (23), నరేందర్‌చారి (30)తో కలసి పటాన్చెరు మండలం రుద్రారం సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ ప్రైవేటు హోటల్లో హోలీ వేడుకలకు హాజరయ్యారు. వేడుకలు ముగిసిన అనంతరం మహేశ్వర్ గుప్తా తన కారులో స్నేహితులతో కలసి సంగారెడ్డికి తిరుగు పయనమయ్యారు. కంది మండల కేంద్రం ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ సమీపంలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న కారు వెనుక టైరు పేలి అదుపు తప్పింది. డివైడర్‌ను దాటుకుని అవతలి వరుసలో జహీరాబాద్ నుంచి పటాన్‌చెరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును (ఏపీ 23 ఎక్స్ 3328) ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న మహేశ్వర్ గుప్తాతో పాటు నాగరాజు, నరేందర్‌చారి అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన వెంకట్రాంరెడ్డి, వెంకట్‌రెడ్డిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించిన కొద్ది నిమిషాలకే ఇద్దరూ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మృతులంతా సంగారెడ్డికి చెందినవారే. ప్రమాద వార్త తెలిసి మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి ఆస్పత్రికి చేరుకుని మృతుల కుటుంబాలను ఓదార్చారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒకరు మృతి ఆదిలాబాద్‌రూరల్: ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన పవర్ శ్రీనివాస్(17) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నాడు. శుక్రవారం హోలీ వేడుకల అనంతరం స్నేహితులతో కలసి సమీపంలోని సాత్నాల వాగులో స్నానానికి వెళ్లాడు. ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందాడు. -
కంది సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
-
ఆర్టీసీ బస్సు - కారు ఢీ: 20 మందికి గాయాలు
చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం బసవరాజ కండ్రిగలో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు - కారు ఢీ కొన్నాయి. ఆ ఘటనలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రులలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దాంతో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వ అసుపత్రికి తరలించారు.