సంగారెడ్డి రూరల్: హోలీ వేడుకల్లో స్నేహితులతో ఆడిపాడి ఇంటికి తిరుగుముఖం పట్టిన ఐదుగురు యువకులను రోడ్డు ప్రమాదం కబలించింది. సంగారెడ్డి సమీపంలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ వద్ద జాతీయ రహదారి 65పై శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కేతకి డిజిటల్స్ నిర్వాహకుడు బాశెట్టి మహేశ్వర్ గుప్తా(28) తన స్నేహితులు వెంకట్‌రాంరెడ్డి (23), వెంకట్‌రెడ్డి (23), నాగరాజు (23), నరేందర్‌చారి (30)తో కలసి పటాన్‌చెరు మండలం రుద్రారం సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ ప్రైవేటు హోటల్‌లో హోలీ వేడుకలకు హాజరయ్యారు. వేడుకలు ముగిసిన అనంతరం మహేశ్వర్ గుప్తా తన కారులో స్నేహితులతో కలసి సంగారెడ్డికి తిరుగు పయనమయ్యారు.
కంది మండల కేంద్రం ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ సమీపంలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న కారు వెనుక టైరు పేలి అదుపు తప్పింది. డివైడర్‌ను దాటుకుని అవతలి వరుసలో జహీరాబాద్ నుంచి పటాన్‌చెరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును (ఏపీ 23 ఎక్స్ 3328) ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న మహేశ్వర్ గుప్తాతో పాటు నాగరాజు, నరేందర్‌చారి అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన వెంకట్‌రాంరెడ్డి, వెంకట్‌రెడ్డిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించిన కొద్ది నిమిషాలకే ఇద్దరూ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మృతులంతా సంగారెడ్డికి చెందినవారే. ప్రమాద వార్త తెలిసి మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి ఆస్పత్రికి చేరుకుని మృతుల కుటుంబాలను ఓదార్చారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఒకరు మృతి
ఆదిలాబాద్‌రూరల్: ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన పవర్ శ్రీనివాస్(17) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నాడు. శుక్రవారం హోలీ వేడుకల అనంతరం స్నేహితులతో కలసి సమీపంలోని సాత్నాల వాగులో స్నానానికి వెళ్లాడు. ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment