ఆర్టీపీపీకి బొగ్గు గండం..
ఎర్రగుంట్ల,న్యూస్‌లైన్ : ఎర్రగుంట్ల మండలంలో ఉన్న రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)కు బొగ్గు గండం ఏర్పడింది. ఏరోజు బొగ్గు రేక్స్ వ్యాగన్లు రాకపోయినా విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడనుంది. మూడు నెలలుగా ఆర్టీపీపీలో బొగ్గు సమస్య ఉంది. ఏ రోజుకు ఆరోజు సరిపడు బొగ్గు వస్తోంది. ప్రస్తుతం ఆర్టీపీపీలో 5వేల టన్నుల బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి.
ఆర్టీపీపీలోని 1,2,3,4,5 యూనిట్లలో పూర్తి సామర్థ్యం తీయడానికి రోజుకు సుమారు 15వేల టన్నుల నుంచి 16500 టన్నుల బొగ్గు అవసరం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం బొగ్గు కొరతగా ఉన్నా వస్తున్న బొగ్గును నిలువచేయకుండానే వాడుకుంటూ 1050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని తీస్తున్నారు. ఈ విషయంపై ఆర్టీపీపీ సీఈ కుమార్‌బాబును న్యూస్‌లైన్ వివరణ కోరగా ప్రస్తుతం ఆర్టీపీపీలో 5వేల టన్నుల బొగ్గుల నిల్వలు మాత్రమే ఉన్నాయని అన్నారు. రోజూ బొగ్గు వ్యాగన్లు వస్తున్నాయని అన్నారు. సోమవారం ఐదు రేక్స్‌ల బొగ్గు వచ్చిందన్నారు. ఒక వేళ బొగ్గు రాక పోతే యూనిట్లను నడపలేమని ఆయన స్పష్టం చేశారు.