ruchira gupta
-
Ruchira Gupta: చీకటి కూపం నుంచి వెన్నెల దారుల్లోకి..
సెక్స్–ట్రాఫికింగ్ సర్వైవర్స్‌కు అండగా నిలబడి వారికి ఒక దారి చూపుతోంది రుచిర గుప్తా. యాంటీ–ట్రాఫికింగ్ యాక్టివిస్ట్, యూఎన్ అడ్వైజర్, విజిటింగ్ ప్రొఫెసర్, ‘అప్నే ఆప్’ కో–ఫౌండర్, రైటర్ రుచిర ఎందరో బాధితులకు అక్కగా, అండగా నిలబడింది. యువ జర్నలిస్ట్‌గా రుచిర గుప్తా నేపాల్‌కు వెళ్లింది. ‘సహజ వనరులను గ్రామాలు ఏ రకంగా ఉపయోగించుకుంటున్నాయి’ అనే అంశంపై కథనాలు రాయడానికి ఎన్నో గ్రామాలకు వెళ్లింది. సహజవనరులకు సంబంధించిన సమాచారం మాట ఎలా ఉన్నా చాలా గ్రామాల్లో వినిపించిన మాట.. ‘మా ఊళ్లో కొందరు అమ్మాయిలు కనిపించడంలేదు. వారి ఆచూకి తెలియడం లేదు’ మారుమూల హిమాలయ కుగ్రామం అయిన సిందుపాల్చౌక్లో పేకాట ఆడుతున్న వారిని అమ్మాయిల అదృశ్యం గురించి అడిగింది రుచిర. ‘వాళ్లు ముంబైలో ఉన్నారు’ అని అసలు విషయం చెప్పారు వాళ్లు. నేపాల్ నుంచి మన దేశానికి వచ్చిన తరువాత ముంబైలోని రెడ్‌లైట్ ఏరియా కామాటిపురాకు వెళ్లింది రుచిర. అక్కడ చిన్న చిన్న గదుల్లో అమ్మాయిలు బంధించి ఉండటాన్ని గమనించింది. బాధగా అనిపించింది. అయితే ఆమె బాధ దగ్గరే ఆగిపోలేదు. ‘ వారికోసం ఏదైనా చేయాలి’ అని మనసులో గట్టిగా అనుకుంది. నేపాల్ గ్రామాల నుండి ముంబైలోని వ్యభిచార గృహలకు యువతులు, బాలికల అక్రమ రవాణాను బహిర్గతం చేయడానికి కెనడియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ కోసం ‘ది సెల్లింగ్ ఆఫ్ ఇన్నోసెంట్స్’ అనే డాక్యుమెంటరీ తీసింది. ఈ డాక్యుమెంటరీ కోసం ఎంతోమంది అమ్మాయిలతో మాట్లాడింది. వారు చీకటికూపాల్లో చిక్కుకుపోవడానికి ప్రధాన కారణం.. కటిక పేదరికం. ఈ డాక్యుమెంటరీ చేస్తున్నప్పుడు ఆమైపై హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయి. ఒకడు కత్తితో పొడవడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న మహిళలు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఆమెను రక్షించారు. అవుట్ స్టాండింగ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కోసం ఇచ్చే ఎమ్మీ అవార్డ్‌ను ‘ది సెల్లింగ్ ఆఫ్ ఇన్నోసెంట్స్’ గెలుచుకుంది. అవార్డ్ అందుకుంటున్నప్పుడు చప్పట్ల మధ్య, ప్రకాశవంతమైన దీపాల మధ్య ఆమెకు కనిపించిందల్లా చీకటి కొట్టాలలోని బాధితుల కళ్లు మాత్రమే. ‘జర్నలిజంలో నేను మరో మెట్టు పైకి చేరడానికి కాకుండా మార్పుకోసం ఈ డాక్యుమెంటరీ ఉపయోగపడాలని కోరుకున్నాను’ అంటుంది రుచిర. అక్రమ రవాణాపై కఠిన చట్టాలు తీసుకురావడానికి సహాయపడాల్సిందిగా అప్పటి యూఎస్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ డోనా షలాలాతో మాట్లాడింది రుచిర. డోనా ద్వారా ఐక్యరాజ్య సమితి సమావేశంలో తన డాక్యుమెంటరీని ప్రదర్శించడమే కాదు వివిధ దేశాలకు చెందిన 180 మంది ప్రతినిధులతో మాట్లాడింది. ఇరవై రెండు మంది మహిళలతో కలిసి ‘అప్నే ఆప్–ఉమెన్ వరల్డ్ వైడ్’ అనే స్వచ్ఛంద సంస్థను ్రపారంభించింది రుచిర గుప్తా. అక్రమ రవాణ నిరోధించడానికి, బాధితులకు అన్ని రకాలుగా సహాయం అందించడానికి ఈ సంస్థ అలుపెరుగని కృషి చేస్తోంది. వ్యభిచారాన్ని‘కమర్షియల్ రేప్’గా పిలుస్తున్న ‘అప్నే ఆప్’ బాధితులకు సంబంధించి విద్య, ఆరోగ్య సంరక్షణ, లైఫ్ స్కిల్స్, చట్టపరమైన రక్షణ, ప్రభుత్వ పథకాలు... మొదలైన వాటిపై దృష్టి పెట్టింది. ఇప్పటివరకు ఇరవై రెండు వేలమందికి పైగా మహిళలు, బాలికలను వ్యభిచార కూపాల నుంచి బయటికి తీసుకురావడంలో సహాయపడిన రుచిర ఎంతోమంది అమ్మాయిలు చదువుకునేలా చూసింది. సొంత కాళ్ల మీద నిలబడేలా చేసింది. దేశ, విదేశాలకు చెందిన ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డ్లు అందుకుంది రుచిరా గుప్తా. అయితే వాటి కంటే కూడా చీకటి కూపం నుంచి బయటికి వచ్చిన బాధితుల కంట్లో కనిపించే వెలుగే తనకు అతి పెద్ద అవార్డ్‌గా భావిస్తానంటుంది రుచిర. ఇవి చదవండి: Thodu Needa Founder Rajeswari: సీనియర్ సిటిజన్స్‌కు భరోసా ఏది? -
వేశ్యావాటికలో అన్నం ముద్ద ..
ప్రభుత్వానికి తక్కువ పట్టే వాళ్లూ అసలు పట్టని వాళ్లూ ఉంటారు. అసలు పట్టని వాళ్లలో సెక్స్వర్కర్స్ ఉంటారు. దేశంలో అధికారికంగా 7 లక్షల మంది సెక్స్ వర్కర్స్ ఉన్నారు. మెట్రో నగరాలలో రెడ్‌లైట్ ఏరియాలున్నాయి. ఈ లాక్డౌన్లో వీరికి అన్నం ఎవరు పెడుతున్నారు? రుచిరా గుప్తా ఒక జవాబు. సెక్స్ వర్కర్స్ కోసం ఈమె మొదలుపెట్టిన ‘వన్ మిలియన్ మీల్స్’ పిలుపు వీరి వాకిట కంచంలా మారింది. రుచిరా గుప్తా ఒక సీనియర్ జర్నలిస్ట్. ‘టెలిగ్రాఫ్’ (కోల్కటా)కు పని చేసేది. కాని వార్తలు రాయడం కంటే క్షేత్రంలో ఉండి పని చేయడమే ముఖ్యం అని భావించింది. తన వృత్తిలో భాగంగా ఆమె ముంబై, ఢిల్లీ, కోల్కటా వంటి మహా నగరాల్లో రెడ్‌లైట్ ఏరియాల్లో ఉన్న వేశ్యలను గమనించాక ఇంత వేదనాపూరిత జీవితాలలో ఉన్న స్త్రీల గురించి పని చేయకపోతే ఎలా అనుకుంది. ఉద్యోగం మానేసింది. ‘ఐక్యరాజ్యసమితి’లో చేరి నేపాల్, కంబోడియా, వియత్నాం వంటి దేశాలలో హ్యూమన్ ట్రాఫికింగ్ నిరోధానికి అవసరమైన చట్టాల రూపకల్పనలో ముఖ్యపాత్ర పోషించింది. ఇండియా తిరిగి వచ్చి 2002లో ‘అప్నే ఆప్ ఉమెన్ వరల్డ్ వైడ్’ సంస్థను స్థాపించి సెక్స్వర్కర్స్ కోసం పని చేయడం మొదలుపెట్టింది. భారతదేశంలో హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఆమె తీసిన డాక్యుమెంటరీ ‘సెల్లింగ్ ఇన్నోసెంట్స్’ విశేషమైన గుర్తింపును పొందింది. ఆమె అనుభవాలను హ్యూమన్ ట్రాఫికింగ్ పట్ల అవగాహన కోసం ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీ, న్యూయార్క్ యూనివర్సిటీ పాఠాలుగా పెట్టాయి. రుచిరా చేస్తున్న కృషికి గాను ‘క్లింటన్ గ్లోబల్ సిటిజన్ అవార్డ్’ వంటి సర్వోన్నత పురస్కారాలు దక్కాయి. ఆమె ఎడిట్ చేసిన ‘రివర్ ఆఫ్ ఫ్లెష్’ అనే సెక్స్‌వర్కర్ల కథల సంకలనం తప్పక పరిశీలించదగ్గది. ఒక్క ఫోన్ కాల్ కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించాక రుచిరా గుప్తాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ చేసింది ఢిల్లీ రెడ్‌లైట్ ఏరియాలోని ఒక పన్నెండేళ్ల అమ్మాయి. ‘అమ్మా... ఏదైనా చేయి. ఆకలితో అలమటిస్తున్నాం’ అని ఆ పాప ఏడ్చింది. ఆ పాపను రుచిరా గుప్తా సంస్థ ఢిల్లీలోని ఒక బోర్డింగ్ స్కూల్లో చేర్పించింది. లాక్డౌన్ కారణాన స్కూల్ మూసేయడంతో తిరిగి వేశ్యావాటిక చేరింది. ఆ పాప ఫోన్ ద్వారా వేశ్యావాటికలోకి ఆకలి కేకలు రుచిరాకు అర్థమయ్యాయి. కరోనా వ్యాప్తి భయంతో రెడ్‌లైట్ ఏరియాలు మూతబడ్డాయి. విటుల రాక బొత్తిగా లేదు. వీరికి మరో ఉపాధి కల్పించాలనే ఆలోచన ప్రభుత్వాలకు లేదు. అందుకని రుచిరా రంగంలోకి దిగింది. ఆ క్షణంలోనే ఐదు వందల ఆహార పొట్లాలు పురమాయించి ఢిల్లీ రెడ్‌లైట్ ఏరియాకు చేర్చింది. ఆ వార్త దావానలంలా దేశంలోని అన్ని రెడ్‌లైట్ ఏరియాలకు చేరాయి. అన్నింటి నుంచి రుచిరాకు ఫోన్లే ఫోన్లు. ‘అందరికీ అన్నం పెట్టాలని నిర్ణయించుకున్నాను. ప్రభుత్వం సాయం చేస్తోంది కాని అది సరిగ్గా అందడం లేదు’ అని అంది రుచిలా. వేశ్యలకు ఆహారం కోసం ఆమె ‘వన్ మిలియన్ మీల్స్’ పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న వేశ్యావాటికల్లో రోజుకు పదిలక్షల ఆహారపొట్లాలు అందించడం లక్ష్యం. స్పందించిన గుండెలు రుచిరా గుప్తా పిలుపుకు అందరూ స్పందించారు. ఆమెకు సాయం చేసే చేతులు ముందుకు వచ్చాయి. బాస్మతి బియ్యం అమ్మకందారైన ‘ఇండియా గేట్’ సంస్థ ఒక లారీ బియ్యం పంపింది. మరెవరో డబ్బులు ఇచ్చారు. ఇంకొకరు సెక్స్ వర్కర్లకు అవసరమైన 50 వేల శానిటరీ ప్యాడ్స్‌ను పంపారు. ‘క్రమంగా మేము అన్నం పంచే బదులు డ్రై రేషన్ పంచడానికి షిఫ్ట్ అయ్యాం. ప్రతి సెక్స్ వర్కర్ కుటుంబానికి ముఖ్యమైన ఆహార వస్తువులు ఉన్న బ్యాగ్‌ను అందజేస్తున్నాం’ అంది రుచిరా. దీనమైన బతుకులు ‘లాక్డౌన్ తర్వాత దేశంలోని సెక్స్ వర్కర్లు ఎలా ఉన్నారో ఎవరికీ పట్టడం లేదు. వారు తమ దగ్గర ఉన్న ప్రతి ఒక్క వస్తువునూ అమ్మి నాలుగు మెతుకులు తింటున్నారు. వారి ఇరుకు చిన్న గదుల్లో దాదాపు 10 మంది నివసిస్తుంటారు. ఇలాంటి పరిస్థితిలో కరోనా వ్యాప్తి సులభం. వీరి పిల్లల గురించి పట్టించుకునేవారే లేరు. తల్లులు కనుక ఈ బాధలు పడలేక ఆత్మహత్యలు చేసుకుంటే వీరు అనాథలు అవుతారు. కరోనా వల్ల దేశంలో మరో సంవత్సరం వరకూ పరిస్థితులు చక్కబడేలా లేవు. అంతవరకూ ఎలా సాయం చేయాలో కూడా అర్థం కావడం లేదు. మా వాలెంటీర్లు యాభై కుటుంబాలకు రేషన్ తీసుకెళితే 200 మంది లైన్లలో నిలబడుతున్నారు. అయినప్పటికీ మేం చేయవలసిందంతా చేస్తున్నాం’ అంటుంది రుచిరా. ఆమె సంస్థ తాలూకు వెబ్సైట్ ‘అప్నే ఆప్ ఉమన్ వరల్డ్‌వైడ్’ (https://apneaap.org/) ని సంప్రదించి విరాళాలు ఇవ్వొచ్చు. మీరూ ఒక దీనురాలి ఆకలి తీర్చినవారవుతారు. – సాక్షి ఫ్యామిలీ -
వ్యభిచార కూపంలోనుంచి..
న్యూఢిల్లీ: భారత, నేపాల్ సరిహద్దు కొండప్రాంతాలు చూడటానికి ఎంతో ఆహ్లాదంగా ఉన్నా వాటిని ఆనుకొని ఉన్న గ్రామాల్లో మాత్రం ఎప్పుడూ విషాధ ఛాయలే అలుముకుని ఉండేవి. బతుకుతెరువు మాత్రం వారికి తెలిసేకాదు. ఒళ్లొచ్చి పనిచేసేందుకు వారు సిద్ధంగా ఉన్నా పని దొరికే అవకాశాలే లేకుండేవి. గుక్కెడు గంజీనేళ్లు కూడా కరువే. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో, ఎలా బతకాలో తెలియని స్థితిలో కొన్ని ముఠాలు వారిని ప్రలోభ పెట్టాయి. ఆ కుటుంబాల్లోని ముక్కుపచ్చలు ఆరని పిళ్లల్ని కొనుక్కొపోయి వృభిచార గృహాల్లో విక్రయించేవి. కొందరు ఆడపిల్లలను నయాపైసా ఇవ్వకుండానే ఎత్తుకుపోయేవి. తమ పిల్లలను తీసుకెళ్లిన వారు, వారిని ఏం చేస్తారో కూడా అక్కడి కుటుంబాలకు తెలుసు. కనీసం పిల్లల పొట్టగడుస్తుందనుకొని అలా వదిలేసేవారు. అలా వ్యభిచార గృహాలకు చేరిన ఆడపిల్లలు. అంగడి బొమ్మలయ్యేవారు. మృగాళ్ల చేతుల్లో బలయ్యేవారు. అలా ఐదారేళ్లు గడిచేసరికి వారి ఒళ్లంత గుల్లయ్యేది. ఇక లాభసాటి వ్యాపారానికి వారు ఎంతమాత్రం పనికి రారని గ్రహించిన మరుక్షణం వారిని రోడ్డున పడేసేవారు. బయట ప్రపంచంలో ఎలా బతకాలో తెలియని అయోమయ జీవితంలోకి వారిని నెట్టివేసేవారు. అక్రమంగా కలిగిన సంతానాన్ని వారు మళ్లీ వ్యభిచార గృహాలకే అమ్మేసేవారు. కొన్నేళ్లుగా ఈ సైకిల్ ఇలా కొనసాగుతూ వచ్చింది. రుచిరా గుప్తా అనే ఓ జర్నలిస్ట్ ఓసారి నేపాల్ కొండ ప్రాంతాల గుండా వెళుతున్నప్పుడు ఛిద్రమైన ఇలాంటి జీవిత కథనాలు ఆమెకు తెలిశాయి. 22 మంది సెక్స్ బానిసలను ఆమె కలసుకున్నారు. వారి కన్నీటి గాథలకు కరిగిపోయిన గుప్తా ఆ 22 మందిని ఇంటర్వ్యూ చేసి ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. దానికోసం అనేక వ్యభిచార గృహాలను సందర్శించారు. వాటి యజమానులను, తార్పుడు గాళ్లను కూడా కలసుకుని అక్కడి పరిస్థితులను అవగాహన చేసుకున్నారు. 13 ఏళ్ల బాలికపై రోజుకు పదిమంది విటులుచేసే అఘాయిత్యాల గురించి విని కన్నీళ్లు కార్చారు. వారి జీవితాలపై తీసిన డాక్యుమెంటరీకి రుచిరా గుప్తాకు అవార్డు కూడా లభించింది. దాంతో ఆమె సంతృప్తి పడలేదు. ఎలాగైనా వ్యభిచార కూపంలో కూరుకుపోతున్న అక్కడి అమ్మాయిలను, కుటుంబాలను రక్షించాలనుకున్నారు. దానికోసం తాను చేస్తున్న జర్నలిస్ట్ ఉద్యోగాన్ని వదిలేశారు. సామాజిక కార్యకర్త అవతారమెత్తారు. బాధితులతోని ‘అప్నే ఆప్’ అనే స్వయం పోషక బృందాన్ని ఏర్పాటు చేశారు. నేతలో వచ్చే లొసుగుల కారణంగా తిరస్కరించే చీరలతోని గాజులు, కంకణాలు, చెవి రింగులు, నెక్లెస్‌లను అందంగా తయారు చేయడం ఎలాగో బాధిత మహిళలకు అమె శిక్షణ ఇప్పించారు. ఆ శిక్షణే వారి జీవితాల్లో వెలుగుబాటలు వేసింది. అలా చీరలు ఉపయోగించి అందంగా తయారుచేసిన ఆభరణాలను మార్కెటింగ్‌కు గల అవకాశాలను వెతికారు. ఇలాంటి అలంకార ఆభరణాలను పాశ్చాత్య దేశాల్లో విక్రయించే రెసెనా సమ్మీ గురించి ఆమెకు తెల్సింది. న్యూజిలాండ్‌లో పుట్టి,పెరిగి న్యూయార్క్‌లో నివసిస్తున్న సమ్మీ ఓనగల దుకాణాన్ని, ఓ బొటిక్‌ను నిర్వహిస్తున్నారు. గుప్తా ఆమె సహాయం తీసుకున్నారు. సెక్స్ బాధితులు తయారు చేస్తున్న గాజులు, నగలతోపాటు చేతి సంచులను ఆమెకు విక్రయిస్తూ వస్తున్నారు. ఇప్పుడు సమ్మీయే 30 మంది సెక్స్ బానిసలను తన ఉద్యోగులుగా చేర్చుకుంది. ఈ ఇద్దరు మహిళల స్ఫూర్తితో ఆ గ్రామాల ప్రజల జీవనచిత్రమే మారిపోయింది. వారంతా వీరి చూపిన మార్గంలో అంకిత భావంతో పనిచేస్తూ ఆనందంగా బతుకుతున్నారు. పిల్లలను బడికి పంపిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. దుర్భర పరిస్థితుల్లో పుట్టిన ‘అప్నే ఆప్’ సంస్థ గత 20 ఏళ్లు దేదీప్యమానంగా పనిచేస్తోంది.