ప్రభుత్వానికి తక్కువ పట్టే వాళ్లూ అసలు పట్టని వాళ్లూ ఉంటారు. అసలు పట్టని వాళ్లలో సెక్స్‌వర్కర్స్ ఉంటారు. దేశంలో అధికారికంగా 7 లక్షల మంది సెక్స్ వర్కర్స్ ఉన్నారు. మెట్రో నగరాలలో రెడ్‌లైట్ ఏరియాలున్నాయి. ఈ లాక్‌డౌన్‌లో వీరికి అన్నం ఎవరు పెడుతున్నారు? రుచిరా గుప్తా ఒక జవాబు. సెక్స్ వర్కర్స్ కోసం ఈమె మొదలుపెట్టిన ‘వన్ మిలియన్ మీల్స్’ పిలుపు వీరి వాకిట కంచంలా మారింది.
రుచిరా గుప్తా ఒక సీనియర్ జర్నలిస్ట్. ‘టెలిగ్రాఫ్’ (కోల్‌కటా)కు పని చేసేది. కాని వార్తలు రాయడం కంటే క్షేత్రంలో ఉండి పని చేయడమే ముఖ్యం అని భావించింది. తన వృత్తిలో భాగంగా ఆమె ముంబై, ఢిల్లీ, కోల్‌కటా వంటి మహా నగరాల్లో రెడ్‌లైట్ ఏరియాల్లో ఉన్న వేశ్యలను గమనించాక ఇంత వేదనాపూరిత జీవితాలలో ఉన్న స్త్రీల గురించి పని చేయకపోతే ఎలా అనుకుంది. ఉద్యోగం మానేసింది. ‘ఐక్యరాజ్యసమితి’లో చేరి నేపాల్, కంబోడియా, వియత్నాం వంటి దేశాలలో హ్యూమన్ ట్రాఫికింగ్ నిరోధానికి అవసరమైన చట్టాల రూపకల్పనలో ముఖ్యపాత్ర పోషించింది. ఇండియా తిరిగి వచ్చి 2002లో ‘అప్‌నే ఆప్ ఉమెన్ వరల్డ్ వైడ్’ సంస్థను స్థాపించి సెక్స్‌వర్కర్స్ కోసం పని చేయడం మొదలుపెట్టింది.
భారతదేశంలో హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఆమె తీసిన డాక్యుమెంటరీ ‘సెల్లింగ్ ఇన్నోసెంట్స్’ విశేషమైన గుర్తింపును పొందింది. ఆమె అనుభవాలను హ్యూమన్ ట్రాఫికింగ్ పట్ల అవగాహన కోసం ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీ, న్యూయార్క్ యూనివర్సిటీ పాఠాలుగా పెట్టాయి. రుచిరా చేస్తున్న కృషికి గాను ‘క్లింటన్ గ్లోబల్ సిటిజన్ అవార్డ్’ వంటి సర్వోన్నత పురస్కారాలు దక్కాయి. ఆమె ఎడిట్ చేసిన ‘రివర్ ఆఫ్ ఫ్లెష్’ అనే సెక్స్‌వర్కర్ల కథల సంకలనం తప్పక పరిశీలించదగ్గది.
ఒక్క ఫోన్ కాల్
కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించాక రుచిరా గుప్తాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ చేసింది ఢిల్లీ రెడ్‌లైట్ ఏరియాలోని ఒక పన్నెండేళ్ల అమ్మాయి. ‘అమ్మా... ఏదైనా చేయి. ఆకలితో అలమటిస్తున్నాం’ అని ఆ పాప ఏడ్చింది. ఆ పాపను రుచిరా గుప్తా సంస్థ ఢిల్లీలోని ఒక బోర్డింగ్ స్కూల్‌లో చేర్పించింది. లాక్‌డౌన్ కారణాన స్కూల్ మూసేయడంతో తిరిగి వేశ్యావాటిక చేరింది. ఆ పాప ఫోన్ ద్వారా వేశ్యావాటికలోకి ఆకలి కేకలు రుచిరాకు అర్థమయ్యాయి. కరోనా వ్యాప్తి భయంతో రెడ్‌లైట్ ఏరియాలు మూతబడ్డాయి. విటుల రాక బొత్తిగా లేదు. వీరికి మరో ఉపాధి కల్పించాలనే ఆలోచన ప్రభుత్వాలకు లేదు. అందుకని రుచిరా రంగంలోకి దిగింది.
ఆ క్షణంలోనే ఐదు వందల ఆహార పొట్లాలు పురమాయించి ఢిల్లీ రెడ్‌లైట్ ఏరియాకు చేర్చింది. ఆ వార్త దావానలంలా దేశంలోని అన్ని రెడ్‌లైట్ ఏరియాలకు చేరాయి. అన్నింటి నుంచి రుచిరాకు ఫోన్లే ఫోన్లు. ‘అందరికీ అన్నం పెట్టాలని నిర్ణయించుకున్నాను. ప్రభుత్వం సాయం చేస్తోంది కాని అది సరిగ్గా అందడం లేదు’ అని అంది రుచిలా. వేశ్యలకు ఆహారం కోసం ఆమె ‘వన్ మిలియన్ మీల్స్’ పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న వేశ్యావాటికల్లో రోజుకు పదిలక్షల ఆహారపొట్లాలు అందించడం లక్ష్యం.
స్పందించిన గుండెలు
రుచిరా గుప్తా పిలుపుకు అందరూ స్పందించారు. ఆమెకు సాయం చేసే చేతులు ముందుకు వచ్చాయి. బాస్మతి బియ్యం అమ్మకందారైన ‘ఇండియా గేట్’ సంస్థ ఒక లారీ బియ్యం పంపింది. మరెవరో డబ్బులు ఇచ్చారు. ఇంకొకరు సెక్స్ వర్కర్లకు అవసరమైన 50 వేల శానిటరీ ప్యాడ్స్‌ను పంపారు. ‘క్రమంగా మేము అన్నం పంచే బదులు డ్రై రేషన్ పంచడానికి షిఫ్ట్ అయ్యాం. ప్రతి సెక్స్ వర్కర్ కుటుంబానికి ముఖ్యమైన ఆహార వస్తువులు ఉన్న బ్యాగ్‌ను అందజేస్తున్నాం’ అంది రుచిరా.
దీనమైన బతుకులు
‘లాక్‌డౌన్ తర్వాత దేశంలోని సెక్స్ వర్కర్లు ఎలా ఉన్నారో ఎవరికీ పట్టడం లేదు. వారు తమ దగ్గర ఉన్న ప్రతి ఒక్క వస్తువునూ అమ్మి నాలుగు మెతుకులు తింటున్నారు. వారి ఇరుకు చిన్న గదుల్లో దాదాపు 10 మంది నివసిస్తుంటారు. ఇలాంటి పరిస్థితిలో కరోనా వ్యాప్తి సులభం. వీరి పిల్లల గురించి పట్టించుకునేవారే లేరు. తల్లులు కనుక ఈ బాధలు పడలేక ఆత్మహత్యలు చేసుకుంటే వీరు అనాథలు అవుతారు. కరోనా వల్ల దేశంలో మరో సంవత్సరం వరకూ పరిస్థితులు చక్కబడేలా లేవు. అంతవరకూ ఎలా సాయం చేయాలో కూడా అర్థం కావడం లేదు. మా వాలెంటీర్లు యాభై కుటుంబాలకు రేషన్ తీసుకెళితే 200 మంది లైన్లలో నిలబడుతున్నారు. అయినప్పటికీ మేం చేయవలసిందంతా చేస్తున్నాం’ అంటుంది రుచిరా. ఆమె సంస్థ తాలూకు వెబ్‌సైట్ ‘అప్‌నే ఆప్ ఉమన్ వరల్డ్‌వైడ్’ (https://apneaap.org/) ని సంప్రదించి విరాళాలు ఇవ్వొచ్చు. మీరూ ఒక దీనురాలి ఆకలి తీర్చినవారవుతారు. – సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment