Saidapet Court
-
నేరాన్ని అంగీకరించిన యువ నటుడు
సాక్షి, చెన్నై: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో తమిళ యువ నటుడు జై నేరాన్ని అంగీకరించాడు. అతడు నేరాన్ని అంగీకరించినందుకుగానూ సైదాపేట కోర్టు శనివారం రూ.5,200 జరిమానా విధించింది. అంతేకాకుండా జై ఆరు నెలల పాటు వాహనం నడపరాదని న్యాయస్థానం ఆదేశించింది. కాగా జై గత నెల 21న మద్యం తాగి కారు నడుపుతూ స్థానిక అడయారు బ్రిడ్జి సమీపంలోని గోడను ఢీకొన్నాడు. దీనిపై ఆ ప్రాంత ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి సైదాపేట మేజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో గురువారం విచారణకు రాగా, అతడు కోర్టుకు హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ నిన్న కోర్టుకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. -
శింబు, అనిరుద్‌లపై చర్యలు తీసుకోండి
చెన్నై: నటుడు శింబు, అనిరుద్‌లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ పాట్టాలీ మక్కల్ కచ్చి చెన్నై సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మహిళలను అవమానించే విధంగా పాటను రాసి, పాడారంటూ నటుడు శింబు,సంగీత దర్శకుడు అనిరుద్‌లపై విమర్శలు, పిర్యాదు,కేసులు పెరిగిపోతున్నాయి. మరో పక్క రాష్ట్ర నలు మూలల నుంచి మహిళా సంఘాల ఆందోళనలు అధికం అవుతున్నాయి. శింబు, అనిరుధ్‌లపై ఇప్పటికే కోవై రేస్ కోర్స్ పోలీసులు వీరిపై నాలుగు విభాగాల్లో కేసులు నమోదు చేసి అరెస్ట్‌కు రంగం సిద్ధం చేస్తున్నారు. శనివారం పోలీస్‌స్టేషన్‌లో నేరుగా హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. లేని పక్షంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా పీఎంకే చెన్నై చిల్లా కార్యదర్శి వెంకటేశన్ స్థానిక సైదాపేట కోర్టులో శింబు,అనిరుద్‌లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును ఈ నెల 28న విచారించనున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. -
నటి అంజలి అరెస్ట్ అవుతుందా?
చెన్నై : నటి అంజలిని పోలీసులు అరెస్ట్ చేస్తారా అనే ప్రశ్న కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. దర్శకుడు కలైంజయం ....ఆమెపై దాఖలు చేసిన పిటిషన్‌పై చెన్నైలోని సైదాపేట కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసు పలుమారు్లు విచారణకొచ్చినా అంజలి కోర్టుకు హాజరు కాలేదు. దీంతో గత నెల 29న సైదాపేట కోర్టు నాన్‌బెయిల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం అంజలి తూర్పు గోదావరి జిల్లా రాజోలులో ఉన్నట్లు సమాచారం. దాంతో చెన్నై పోలీసులు కోర్టు అరెస్ట్ వారెంట్‌ను రాజోలు పోలీసులకు గురువారం పంపించినట్లు దర్శకుడు కలైంజయం న్యాయవాది జయప్రకాష్ తెలిపారు. దీంతో అంజలి అరెస్ట్ అవుతుందా లేక అంతకు ముందే కోర్టుకు హాజరు అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై కోలీవుడ్, టాలీవుడ్లో చర్చ సాగుతోంది. -
నటి అంజలి వ్యవహార శైలిపై కోర్టు సీరియస్
చెన్నై: సినీ నటి అంజలి వ్యవహార శైలిపై కోర్టు సీరియస్ అయ్యింది. ఆమె మరోమారు కోర్టుకు డుమ్మా కొట్టింది. కేసు విచారణ నిమిత్తం గురువారం అంజలి కోర్టుకు హాజరు కాకపోవటంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 29న తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. తమిళ దర్శకుడు కళంజియం దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆమె కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే, ఆమె ఎలాంటి కారణాలు చెప్పకుండానే ఇప్పటికే పలుసార్లు కోర్టుకు గైర్హాజరు అయ్యింది. గతంలో కోర్టు పలు మార్లు హెచ్చరికలు చేసినా ఆమె తన తీరు మార్చుకోలేదు.