ముర్రే జోరు
♦ మూడోరౌండ్లోకి ప్రవేశం
♦ వావ్రింకా, ఫెరర్, ఇస్నేర్ కూడా
♦ ఆస్ట్రేలియన్ ఓపెన్
మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ అయిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నాలుగో రోజు ఎలాంటి సంచలనాలు చోటు చేసుకోలేదు. బరిలోకి దిగిన సీడెడ్లలో ఒకరిద్దరు మినహా మిగతా వారందరూ సాఫీగా గట్టెక్కారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండోరౌండ్లో రెండోసీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) 6-0, 6-4, 6-1తో సామ్ గ్రోత్ (ఆస్ట్రేలియా)పై నెగ్గి మూడోరౌండ్లోకి ప్రవేశించాడు. 91 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బ్రిటన్ ప్లేయర్ అద్భుతమైన రిటర్న్ షాట్లతో ఆకట్టుకున్నాడు.
ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ సర్వీస్ చేసే గ్రోత్‌ను నేర్పుగా కట్టిపడేశాడు. ఇతర మ్యాచ్‌ల్లో... 4వ సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-2, 6-3, 6-4తో రాడెక్ స్టెఫానిక్ (చెక్)పై; 8వ సీడ్ ఫెరర్ (స్పెయిన్) 6-2, 6-4, 6-4తో లీటన్ హెవిట్ (ఆస్ట్రేలియా)పై; 10వ సీడ్ జాన్ ఇస్నేర్ (అమెరికా) 6-3, 7-6 (6), 7-6 (2)తో మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్)పై; 13వ సీడ్ రావోనిక్ (కెనడా) 7-6 (6), 7-6 (5), 7-5తో టోమి రోబెర్డో (స్పెయిన్)పై; 16వ సీడ్ బెర్నార్డ్ టోమిక్ (ఆస్ట్రేలియా) 6-4, 6-2, 6-7 (5), 7-5తో సైమన్ బొలెల్లీ (ఇటలీ)పై; 18వ సీడ్ లోపెజ్ (స్పెయిన్) 7-6 (2), 6-7 (4), 7-6 (3), 6-7 (8), 6-4తో గుయిడో పెల్లా (అర్జెంటీనా)పై గెలిచి మూడోరౌండ్లోకి అడుగుపెట్టారు.
మహిళల రెండోరౌండ్లో మూడోసీడ్ ముగురుజా (స్పెయిన్) 6-4, 6-2తో క్రిస్టెన్ ఫ్లిప్కెన్స్ (బెల్జియం)పై; 7వ సీడ్ కెర్బర్ (జర్మనీ) 6-2, 6-4తో అలెగ్జాండ్రా డుల్గెర్ (రొమేనియా)పై; 9వ సీడ్ ప్లిస్కోవా (చెక్) 7-6 (5), 6-1తో జూలియా జార్జెస్ (జర్మనీ)పై; అన్నికా బెక్ (జర్మనీ) 6-2, 6-3తో 11వ సీడ్ టిమియా బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్)పై; 14వ సీడ్ అజరెంకా (బెలారస్) 6-1, 6-2తో డంకా కొవిన్చ్ (మాంటెగ్రో)పై; 15వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6-7 (4), 6-3, 6-3తో ష్వెదోవా (కజకిస్తాన్)పై; 20వ సీడ్ ఇవనోవిచ్ (సెర్బియా) 6-3, 6-3తో సెవస్తోవా (లాత్వేనియా)పై; నవోమి ఒసాకా (జపాన్) 6-4, 6-4తో 18వ సీడ్ ఎలినా స్వితోలినా (ఉక్రెయిన్)పై; లౌరా సెగుమండ్ (జర్మనీ) 3-6, 7-6 (5), 6-4తో 19వ సీడ్ జలెనా జంకోవిచ్ (సెర్బియా)పై నెగ్గారు.