Sandeep Tomar
-
ఫైనల్లో హరియాణా హ్యామర్స్
న్యూఢిల్లీ: సందీప్ తోమర్, రజనీష్ విశేషంగా రాణించి కీలక విజయాలు అందించడంతో హరియాణా హ్యామర్స్ జట్టు ప్రొ రెజ్లింగ్ లీగ్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం ఉత్కంఠభరితంగా జరిగిన సెమీఫైనల్లో హరియాణా 6–3తో జైపూర్ నింజాస్పై గెలిచింది. పంజాబ్ రాయల్స్, ముంబై మహారథి జట్ల మధ్య బుధవారం జరిగే రెండో సెమీస్ విజేతతో గురువారం జరిగే ఫైనల్లో హరియాణా తలపడుతుంది. మ్యాచ్ తొలి బౌట్ (74 కేజీలు)లో జాకబ్ మకరషివిలి 10–0తో సుమీత్ (హరియాణా)పై గెలిచాడు. మహిళల 48 కేజీల బౌట్లో రీతూ ఫోగట్ 8–0తో ఇందుపై నెగ్గి జైపూర్ ఆధిక్యాన్ని 2–0కి పెంచింది. అయితే హరియాణాకు చెందిన విదేశీ రెజ్లర్లు మగోమెడ్ (70 కేజీలు), మర్వా అమ్రి (58 కేజీలు) తమ బౌట్లలో నెగ్గి స్కోరును 2–2తో సమం చేశారు. 65 కేజీల విభాగంలో రజనీష్ 8–6తో రాహుల్ మన్పై నెగ్గి హరియాణాకు 3–2తో ఆధిక్యాన్ని అందించాడు. ఈ దశలో జైపూర్ రెజ్లర్ జెన్నీ ఫ్రాన్సన్ (75 కేజీలు) 8–0తో కిరణ్‌పై గెలిచి 3–3తో స్కోరును సమం చేసింది. ఇక అద్భుత ఫామ్‌లో ఉన్న సందీప్ తోమర్ (57 కేజీలు) 5–4తో ఉత్కర్‡్షపై నెగ్గి హరియాణాకు 4–3 ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం వరుసగా సోఫియా మాట్సన్ (53 కేజీలు) 8–0తో బెట్జబెత్ (జైపూర్)పై, అబ్దుసలామ్ గడిసోవ్ (97 కేజీలు) 5–4తో ఎలిజబార్ (జైపూర్)పై గెలిచి హరియాణా విజయాన్ని సులువు చేశారు. -
సందీప్ తోమర్ సంచలనం
ఒలింపిక్ చాంపియన్‌పై గెలుపు హరియాణాకు అగ్రస్థానం న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో హరియాణా హ్యామర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత రెజ్లర్ సందీప్ తోమర్ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రియో ఒలింపిక్స్ చాంపియన్ వ్లాదిమిర్ ఖించెగష్విలికి (పంజాబ్ రాయల్స్) షాకిచ్చాడు. దీంతో హరియాణా హ్యామర్స్ 5–2తో పంజాబ్ రాయల్స్‌పై ఘనవిజయం సాధించి 10 పాయింట్లతో లీగ్ దశలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్లో జైపూర్ నింజాస్‌తో హరియాణా హ్యామర్స్... బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో ముంబై మహారథితో పంజాబ్ రాయల్స్ తలపడతాయి. 57 కేజీ కేటగిరీలో తలపడిన సందీప్ (హరియాణా) 3–1తో వ్లాదిమిర్ (పంజాబ్)ను కంగుతినిపించాడు. 97 కేజీల విబాగంలో గడిసోవ్ (హరియాణా) 5–0తో కృషన్ కుమార్ (పంజాబ్)పై, ఇందు చౌదరి (హరియాణా, 48 కేజీలు) 2–1తో నిర్మలాదేవి (పంజాబ్)పై గెలుపొందారు. బెబెలకోవ్ (పంజాబ్, 65 కేజీలు) 11–1తో రజనీశ్ (హరియాణా)పై, కుర్బానలీవ్ (హరియాణా, 70 కేజీలు) 16–0తో పంకజ్ రాణా (పంజాబ్)పై, మర్వా అమ్రి (హరియాణా, 58 కేజీలు) 16–0తో మంజు కుమారి (పంజాబ్)పై, ఒడునయో (పంజాబ్, 53 కేజీలు) 6–1తో సోఫియా మట్సన్ (హరియాణా)పై విజయం సాధించారు. -
కామన్వెల్త్ రెజ్లింగ్‌లో భారత్ స్వర్ణాల జోరు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు స్వర్ణాలతో అదరగొట్టారు. సింగపూర్‌లో జరుగుతున్న ఈ పోటీల పురుషుల ఫ్రీస్టరుుల్ విభాగంలో శనివారం సందీప్ తోమర్ (57కేజీ), అమిత్ ధన్కర్ (70కేజీ), సత్యవర్త్ కడియన్ (97కేజీ)లకు స్వర్ణాలు దక్కగా వినోద్(70కేజీ), రౌబల్జీత్ (97)లకు రజతాలు దక్కారుు. గ్రీకో రోమన్లో మనీష్ (66కేజీ), గుర్ప్రీత్ (75కేజీ), హర్‌ప్రీత్ సింగ్ (80కేజీ), ప్రభ్‌పాల్ (85కేజీ), నవీన్ (130కేజీ) తొలిస్థానంలో నిలిచారు. అలాగే మహిళల విభాగంలో రితూ ఫోగట్ (48కేజీ), రేష్మ మనే (63కేజీ), లలితా (55కేజీ), పింకీ, మను (58కేజీ) కూడా స్వర్ణాలు సాధించారు. జ్యోతి (75కేజీ), ని క్కీ, సోమాలి (75కేజీ) రజతాలు అందుకున్నారు. -
సందీప్ తోమర్ అవుట్
రియో డి జనీరో: పురుషుల 57కేజీ ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్ సందీప్ తోమర్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో తను రష్యాకు చెందిన విక్టర్ లెబెడేవ్ చేతిలో 3-7 తేడాతో ఓడాడు. ఆరు నిమిషాల ఈ బౌట్లో సందీప్ ఏ దశలోనూ ప్రత్యర్థిపై పట్టు సాధించలేకపోయాడు. ఆదిలోనే 5-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన విక్టర్ పైచేయి సాధించాడు. అయితే ఆ తర్వాత విక్టర్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిపోవడంతో సందీప్‌కు రెప్‌చేజ్ అవకాశం కూడా లేకుండాపోయింది. దీంతో తను రియో నుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది. 34వ స్థానంలో సందీప్ కుమార్ 50 కి.మీ రేసు నడక ఫైనల్లో సందీప్ కుమార్ 4:07:55 టైమింగ్‌తో 34వ స్థానంలో నిలిచాడు. విజేతగా నిలిచిన మటెజ్ టోత్కన్నా తను 26 నిమిషాల 57 సెకన్ల ఆలస్యంగా లక్ష్యాన్ని చేరుకున్నాడు. 80 మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ రేసును 48 మంది మాత్రమే పూర్తి చేయగలిగారు. -
రియో రెజ్లర్ల బృందంతో సచిన్
న్యూఢిల్లీ: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన రెజ్లర్ల బృందంలో కొత్త ఉత్సాహాన్ని నింపాడు. సోమవారం ఇక్కడి సిటీ హోటల్లో రెజ్లర్లతో సమావేశమయ్యాడు. రెండు గంటల పాటు ఆటగాళ్లతో ముచ్చటించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. ఒత్తిడిని సమర్థంగా ఎలా జయించాలి అనే అంశంపై ఆటగాళ్లకు అవగాహన కల్పించాడు. సచిన్‌తో జరిగిన భేటీలో యోగేశ్వర్ దత్, సందీప్ తోమర్ మినహా మిగతా రెజ్లర్లు, కోచ్‌లు పాల్గొన్నారు. నర్సింగ్ యాదవ్ (74 కేజీ), వినేశ్ (48 కేజీ), బబితా (53 కేజీ), సాక్షి (58 కేజీ), రవీంద ర్ ఖత్రి (85 కేజీ), హర్దీప్ (98 కేజీ)లతో సచిన్ తీసుకున్న ఫోటోలను ట్వీటర్లో పోస్ట్ చేశాడు. రియో బృందానికి మాస్టర్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. -
రియోకు మరో రెజ్లర్ అర్హత
ఉలాన్ బాతర్(మంగోలియా):ఈ ఏడాది ఆగస్టులో జరుగనున్న రియో ఒలింపిక్స్‌కు మరో భారత రెజ్లర్ సందీప్ తోమర్ అర్హత సాధించాడు. వరల్డ్ రెజ్లింగ్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం జరిగిన 57 కేజీల ఫ్రీ స్టయిల్ కేటగిరిలో సందీప్ 11-0 తేడాతో ఆండ్రీ యాట్ సెన్కో(ఉక్రెయిన్)పై విజయం సాధించి రియోకు అర్హత సాధించాడు. దీంతో పాటు కాంస్య పతకాన్ని కూడా సందీప్ తన ఖాతాలో వేసుకున్నాడు. రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన నాల్గో భారత రెజ్లర్ సందీప్ కావడం విశేషం. అంతకుముందు యోగేశ్వర్ దత్(65 కేజీల ఫ్రీ స్టయిల్), నర్సింగ్ యాదవ్(74 కేజీల ఫ్రీ స్టయిల్), హర్దీప్ సింగ్( గ్రీకో-రోమన్ 98 కేజీలు)లు ఒలింపిక్స్ కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. -
భారత రెజ్లర్లకు 9 పతకాలు
న్యూఢిల్లీ: ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత కుస్తీ వీరులు తొమ్మిది పతకాలు సాధించారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ముగిసిన ఈ ఈవెంట్లో పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో సందీప్ తోమర్ (57 కేజీలు) స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... ఓంప్రకాశ్ వినోద్ కుమార్ (70 కేజీలు) రజత పతకాన్ని దక్కించుకున్నాడు. మహిళల విభాగంలో ప్రియాంక ఫోగట్ (55 కేజీలు) రజతం నెగ్గగా... వినేశ్ ఫోగట్ (53 కేజీలు), అనితా తోమర్ (63 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో హర్దీప్ సింగ్ (98 కేజీలు), గౌరవ్ శర్మ (59 కేజీలు), హర్‌ప్రీత్ సింగ్ (80 కేజీలు), నవీన్ (130 కేజీలు) కాంస్య పతకాలు సంపాదించారు. ఓవరాల్‌గా ఈ పోటీల్లో భారత్ ఏడో స్థానంలో నిలిచింది.