sangareddy crime
-
టాయినెక్స్ పరిస్థితి ఏమిటి?
సాక్షి, సంగారెడ్డి: అక్రమార్జనే లక్ష్యంగా కొందరు అగ్ర వ్యాపారవేత్తలు అమాయక ప్రజలను ఆసరాగా చేసుకొని వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు. ఇటీవల సన్ పరివార్ పేరుతో సంగారెడ్డితో పాటు అన్ని జిల్లాల్లో భారీ మోసాలు జరిగిన విషయం తెలిసిందే. మరికొన్ని కంపెనీలు సైతం ఇదే బాటలో పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా జిల్లా కేంద్రం సంగారెడ్డిలో టాయినెక్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ బ్యాంకు మాదిరిగా బ్రాంచ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ యజమానులు ఏజెంట్ల ద్వారా ప్రజల వద్ద నుంచి లక్షకు 10 వేల వడ్డీ చెల్లిస్తామని నమ్మించి లక్షల రూపాయలను జమ చేసుకున్నారు. ఇలా దాదాపు 500 మంది దగ్గర లక్ష చొప్పున 50 కోట్ల వరకు జమ చేసుకున్నారు. అయితే జమ అయిన డబ్బులను నెలనెల కొందరికి వడ్డీ రూపంలో ఇస్తూ వచ్చారు. మరి కొందరికి వాయిదాల పర్వం పెట్టడంతో చివరకు వారి సంస్థ డొంక కదిలింది. దీంతో బయటికి వచ్చిన సమాచారం జిల్లా కలెక్టర్ వరకు చేరింది. స్పందించిన కలెక్టర్ హనుమంతరావు సంగారెడ్డి ఆర్డీఓకు టాయినెక్స్లో జరుగుతున్న వ్యవహరం, వారు చేపట్టిన కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరపాలని సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ శ్రీను సంస్థకు సంబంధించిన డాక్యుమెంట్లను సేకరించారు. అయినప్పటికీ ఇంకా కొన్ని డాక్యుమెంట్లు రావాల్సి ఉండగా సంగారెడ్డి తహసీల్దార్ పరమేశ్వర్‌ను ఆదేశించారు. సంస్థ పనితీరును నివేదికల అనంతరం సంస్థపై కలెక్టర్ నేతృత్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. -
గుర్రంపై స్వారీ.. అంతలోనే షాక్..!
సాక్షి, నారాయణఖేడ్: చిగురు పండుగ విందులో పాల్గొనేందుకు గుర్రంపై స్వారీ చేస్తూ వెళ్తున్న రౌతు మార్గమధ్యంలో విద్యుత్ షాక్ తగిలి మరణించాడు. సోదరి ఇంట విందు కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. షాక్ కొట్టడంతో యజమాని(రౌతు) సహా గుర్రం మృతి చెందింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీంరా శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. మండలంలోని ఎక్కువ శాతం తండాల్లో ప్రతి ఏటా జూలైలో గిరిజనులు చిగురు పండుగ నిర్వహిస్తారు. భీంరా పార్తు తండాకు చెందిన రాథోడ్ వెంకట్(45) చింతమణి తండాలో తన సోదరి ఇంట ఏర్పాటు చేసిన చిగురు పండుగ విందు కోసం గుర్రంపై బయల్దేరాడు. భీంరా శివారులోకి చేరుకోగానే గుర్రం కాళ్ల చప్పుడుకు పంటల రక్షణ కోసం అడవి పందుల బెడదను కాపాడేందుకు ఉంచిన కుక్కలు అరిచాయి. కుక్కల అరుపులకు గుర్రం బెదిరిపోయింది. పక్కనే ఉన్న పంట చేలోకి పరుగులు పెట్టింది. ఈ క్రమంలో పొలంలో వేళాడుతున్న త్రీఫేజ్ విద్యుత్ తీగలు గుర్రం మెడకు తగిలాయి. క్షణంలో విద్యుత్ షాక్ తగలడంతో వెంకట్, అతను స్వారీ చేస్తున్న గుర్రం అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. పొలం యజమాని పంట కాపలా కోసం వెళ్లి చూసి వెంకట్ మృతి చెందిన విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతుడు వెంకట్ భార్య వాలబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మండలంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడ శుభకార్యాలు ఉన్నా, ప్రముఖ రాజకీయ నాయకుల సమావేశాలు ఉన్నా గుర్రంతో మృతుడు వెంకట్‌నాయక్ అందరిని ఉత్సాహపరిచేవాడు. అదే గుర్రంపై స్వారీ చేస్తూ విద్యుత్ షాక్ తగిలి మరణించడంతో పార్తు తండాలో విషాదం నెలకొంది. మృతుడు వెంకట్‌కు భార్య, పిల్లలు ఉన్నారు. -
దారి దోపిడీ కేసులో ఇద్దరి అరెస్టు
సంగారెడ్డి క్రైం : దాడి చేసి టవేరా వాహనాన్ని అపహరించిన ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిం చినటు డీఎస్పీ తిరుపతన్న తెలిపా రు. ఈ కేసుకు సంబంధించి వివరాలను సంగారెడ్డి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌కు చెందిన ఏనుగు నర్సిరెడ్డి వ్యాపారం నిమిత్తం ఈ నెల 19న మహారాష్ట్రలోని డెగ్లూర్కు అతడి మేనల్లుడు, డ్రైవర్ రాములు, ఉద్యోగులు సత్యనారాయణ, చెన్నయ్యలతో పాటు మరో వ్యక్తి కలిసి టవేరా వాహనంలో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ నెల 21న సంగారెడ్డి శివారులోని కుల్పగూర్ గ్రామం వద్దకు రాగానే ఇద్దరు గుర్తుతెలియని నిందితులు మోటార్ బైక్‌పై వచ్చి వాహనాన్ని అడ్డుకుని డ్రైవర్ రాములుపై దాడి చేశారు. అనంతరం మిగిలిన వారందరినీ దింపి వారి వద్ద ఉన్న రూ. 2 వేల నగదుతో పాటు టవేరా వాహనాన్ని అపహరించుకెళ్లారు. దీంతో బాధితుడు నర్సిరెడ్డి ఫిర్యాదు మేరకు సంగారెడ్డి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25న సంగారెడ్డి మండలం జుల్కల్ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. శంకర్పల్లి నుంచి వాహనంలో అనుమానాస్పదంగా వస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా టవేరా వాహనాన్ని అపహరించింది తామేనని ఒప్పుకున్నారు. నిందితులు సంగారెడ్డి పట్టణంలోని నేతాజీ నగర్‌కు చెందిన కంది శివకుమార్(21), భవానీనగర్‌కు చెందిన దండే విశ్వనాథ్(23)లుగా గుర్తించినట్లు డీఎస్పీ వివరించారు. నిందితుల నుంచి టవేరా వాహనంతో పాటు బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని వారికి రిమాండ్‌కు తరలించామన్నారు. కేసును ఛేదించిన సంగారెడ్డి రూరల్ సీఐ శ్యామల వెంకటేష్, ఎస్ఐ రాజశేఖర్, ఐడీ పార్టీ పోలీసులను ఆయన అభినందించారు. విలేకరుల సమావేశంలో సీఐలు వెంకటేష్, కె.శ్రీనివాస్, ఎస్ఐ రాజశేఖర్ పాల్గొన్నారు. -
పా‘పాలు’
చిన్నారి ఏడిస్తే.. తల్లిని పాలుపట్టమంటారు..తల్లి అందుబాటులో లేకపోతే డబ్బాలో పోసిన పాలు తాగిస్తారు. దాదాపు ప్రతి ఇంట్లో కనిపించే దృశ్యమిది. అయితే ఈ పాలను కూడా కల్తీ చేస్తున్నారు కొందరు పాపాత్ములు. ఇది చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిసీ ఈ దారుణానికి తెగబడుతున్నారు. తూప్రాన్ కేంద్రంగా వరుసగా బయటపడుతున్న ఈ కల్తీ పాల కేసులు ప్రజలను భయపెడుతున్నాయి. దీంతో ఏవి స్వచ్ఛమైన పాలో.. ఏవి కల్తీవో తెలియక జనం తల్లడిల్లిపోతున్నారు. సంగారెడ్డి క్రైం: తెల్లనివన్నీ పాలు కావు....నల్లనివన్నీ నీళ్లు కావు....అన్నట్లుగానే...ప్రస్తుతం మనం చూసే పాలన్నీ స్వచ్ఛమైనవి కావు. ప్రతిరోజు పాలు తాగితే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నది ఇపుడు పాత మాటగా మారిపోయింది. ఎందుకంటే పసిపాపలకు తాగించే పాలను సైతం కొందరు కల్తీ చేస్తున్నారు. ఈ వ్యాపారం జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. కంప్యూటర్ యుగంలో కాసిన్ని పాలిచ్చే గేదెలు కరువయ్యాయి. కానీ క్షీరానికి మాత్రం రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఇన్నాళ్లూ పాలలో నీళ్లు కలిపి సొమ్ము చేసుకునే వ్యాపారులు రూటు మార్చేశారు. డిమాండ్ మేరకు పాలు లభించకపోవడంతో ఏకంగా పాలనే కృత్రిమంగా తయారు చేసి ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు. దీంతో వీటిని తాగుతున్న చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యం లభించకపోగా రోగాలు వస్తున్నాయి. తూప్రాన్ కేంద్రంగా... జిల్లాలోని ప్రధాన పట్టణాలు, జిల్లాకు ఆనుకుని ఉన్న రాజధానికి కూడా మన గ్రామాల నుంచే పాలు సరఫరా అవుతాయి. కానీ కాలానుగుణంగా వచ్చిన మార్పులతో గ్రామాల్లో పాడిపరిశ్రమకు ముందుకు వచ్చేవారే కరువయ్యారు. మరోవైపు పాలకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. దీంతో కొందరు వ్యాపారులు కాసిన్ని సొమ్ములకు ఆశపడి కృత్రిమంగా పాలు తయారు చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. డబ్బులు తీసుకుని మరీ ఇంటింటికీ రోగాలను అంటగడుతున్నారు. యూరియాతో కృత్రిమ పాలు! లీటరు గేదె పాలుంటే చాలు 40 లీటర్ల పాలను కృత్రిమంగా తయారు చేయవచ్చు. లీటరు పాలు, అరలీటరు మంచినూనెను మిక్సీలో కలిపి 40 లీటర్ల నీటిలో కలుపుతారు. దీనికి చక్కెరతో పాటు యూరియాను కలిపితే ఈ ద్రావణం స్వచ్ఛమైన పాలుగా కనిపిస్తుంది. చూడడానికి పాలలానే కనిపించే ఈ ద్రావణం తాగినా కూడా ఎలాంటి తేడా కనిపించదు. దీంతో జనం ఏ మాత్రం ఆలోచించకుండా ఈ పాలు తాగేస్తున్నారు. నమోదైన కేసులివే... కొన్నిరోజులుగా జిల్లా గుట్టుగా సాగుతున్న కల్తీపాల వ్యాపారంపై ఇప్పుడిప్పుడే పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే మే నెల 14న తూప్రాన్ పట్టణ ంలోని అభ్యాస స్కూల్ సమీపంలో ఉంటున్న పాల వ్యాపారి శ్రీశైలం ఇంటిపై దాడి చేసి కల్తీపాలను, కల్తీపాలు తయారు చేసేందుకు ఉపయోగించే ముడిపదార్థాలు పాల పౌడర్, సోయానూనె, యూరియాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శ్రీశైలంను విచారించగా, కేవలం లీటర్ పాలతో యూరియా ఉపయోగించి 10 లీటర్ల పాలు తయారు చేస్తున్నట్లు అతను చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు. అలాగే తూప్రాన్ మండలం రావెల్లి గ్రామంలో బొల్లబోయిన మహేష్ కృత్రిమ పాలను తయారు చేసి పోతరాజుపల్లిలోని డెయిరీలో విక్రయించేందుకు తరలిస్తుండగా అక్కడి పోలీసులు బుధవారం దాడి చేసి కేసు నమోదు చేశారు. ఇవి కేవలం బయటకు తెలిసిన రెండు కేసులు మాత్రమే..పాల వ్యాపారంపై పెద్దగా నిఘా లేకపోవడంతో జిల్లాలో కృత్రిమ పాల దందా బాగానే సాగుతున్నట్లు తెలుస్తోంది. పిల్లల్లో ఎదుగుదల ఆగిపోతుంది కల్తీ పాలు తాగడం వల్ల పిల్లలో ఎదుగుదల ఆగిపోతుంది. అలాగే పెద్దలకు కూడా అనేక వ్యాధులు వచ్చే ప్రమాదముంది. ముఖ్యంగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో పాటు కీళ్ల నొప్పులు వస్తాయి. ఎముకలు కూడా దెబ్బతిని ఆరోగ్యం క్షీణిస్తుంది. కల్తీ పాలు సేవించడం వల్ల వాంతులు, విరేచనాలవుతాయి. కల్తీ పాలు ఏవో, స్వచ్ఛమైన పాలు ఏవో గుర్తించి తీసుకోవడం మంచిది. - డాక్టర్ జి.శ్రీహరి, సంగారెడ్డి