పా‘పాలు’
చిన్నారి ఏడిస్తే.. తల్లిని పాలుపట్టమంటారు..తల్లి అందుబాటులో లేకపోతే డబ్బాలో పోసిన పాలు తాగిస్తారు. దాదాపు ప్రతి ఇంట్లో కనిపించే దృశ్యమిది. అయితే ఈ పాలను కూడా కల్తీ చేస్తున్నారు కొందరు పాపాత్ములు. ఇది చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిసీ ఈ దారుణానికి తెగబడుతున్నారు. తూప్రాన్ కేంద్రంగా వరుసగా బయటపడుతున్న ఈ కల్తీ పాల కేసులు ప్రజలను భయపెడుతున్నాయి. దీంతో ఏవి స్వచ్ఛమైన పాలో.. ఏవి కల్తీవో తెలియక జనం తల్లడిల్లిపోతున్నారు.
సంగారెడ్డి క్రైం: తెల్లనివన్నీ పాలు కావు....నల్లనివన్నీ నీళ్లు కావు....అన్నట్లుగానే...ప్రస్తుతం మనం చూసే పాలన్నీ స్వచ్ఛమైనవి కావు. ప్రతిరోజు పాలు తాగితే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నది ఇపుడు పాత మాటగా మారిపోయింది. ఎందుకంటే పసిపాపలకు తాగించే పాలను సైతం కొందరు కల్తీ చేస్తున్నారు. ఈ వ్యాపారం జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది.
కంప్యూటర్ యుగంలో కాసిన్ని పాలిచ్చే గేదెలు కరువయ్యాయి. కానీ క్షీరానికి మాత్రం రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఇన్నాళ్లూ పాలలో నీళ్లు కలిపి సొమ్ము చేసుకునే వ్యాపారులు రూటు మార్చేశారు. డిమాండ్ మేరకు పాలు లభించకపోవడంతో ఏకంగా పాలనే కృత్రిమంగా తయారు చేసి ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు. దీంతో వీటిని తాగుతున్న చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యం లభించకపోగా రోగాలు వస్తున్నాయి.
తూప్రాన్ కేంద్రంగా...
జిల్లాలోని ప్రధాన పట్టణాలు, జిల్లాకు ఆనుకుని ఉన్న రాజధానికి కూడా మన గ్రామాల నుంచే పాలు సరఫరా అవుతాయి. కానీ కాలానుగుణంగా వచ్చిన మార్పులతో గ్రామాల్లో పాడిపరిశ్రమకు ముందుకు వచ్చేవారే కరువయ్యారు. మరోవైపు పాలకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. దీంతో కొందరు వ్యాపారులు కాసిన్ని సొమ్ములకు ఆశపడి కృత్రిమంగా పాలు తయారు చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. డబ్బులు తీసుకుని మరీ ఇంటింటికీ రోగాలను అంటగడుతున్నారు.
యూరియాతో కృత్రిమ పాలు!
లీటరు గేదె పాలుంటే చాలు 40 లీటర్ల పాలను కృత్రిమంగా తయారు చేయవచ్చు. లీటరు పాలు, అరలీటరు మంచినూనెను మిక్సీలో కలిపి 40 లీటర్ల నీటిలో కలుపుతారు. దీనికి చక్కెరతో పాటు యూరియాను కలిపితే ఈ ద్రావణం స్వచ్ఛమైన పాలుగా కనిపిస్తుంది. చూడడానికి పాలలానే కనిపించే ఈ ద్రావణం తాగినా కూడా ఎలాంటి తేడా కనిపించదు. దీంతో జనం ఏ మాత్రం ఆలోచించకుండా ఈ పాలు తాగేస్తున్నారు.
నమోదైన కేసులివే...
కొన్నిరోజులుగా జిల్లా గుట్టుగా సాగుతున్న కల్తీపాల వ్యాపారంపై ఇప్పుడిప్పుడే పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే మే నెల 14న తూప్రాన్ పట్టణ ంలోని అభ్యాస స్కూల్ సమీపంలో ఉంటున్న పాల వ్యాపారి శ్రీశైలం ఇంటిపై దాడి చేసి కల్తీపాలను, కల్తీపాలు తయారు చేసేందుకు ఉపయోగించే ముడిపదార్థాలు పాల పౌడర్, సోయానూనె, యూరియాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శ్రీశైలంను విచారించగా, కేవలం లీటర్ పాలతో యూరియా ఉపయోగించి 10 లీటర్ల పాలు తయారు చేస్తున్నట్లు అతను చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు. అలాగే తూప్రాన్ మండలం రావెల్లి గ్రామంలో బొల్లబోయిన మహేష్ కృత్రిమ పాలను తయారు చేసి పోతరాజుపల్లిలోని డెయిరీలో విక్రయించేందుకు తరలిస్తుండగా అక్కడి పోలీసులు బుధవారం దాడి చేసి కేసు నమోదు చేశారు. ఇవి కేవలం బయటకు తెలిసిన రెండు కేసులు మాత్రమే..పాల వ్యాపారంపై పెద్దగా నిఘా లేకపోవడంతో జిల్లాలో కృత్రిమ పాల దందా బాగానే సాగుతున్నట్లు తెలుస్తోంది.
పిల్లల్లో ఎదుగుదల ఆగిపోతుంది
కల్తీ పాలు తాగడం వల్ల పిల్లలో ఎదుగుదల ఆగిపోతుంది. అలాగే పెద్దలకు కూడా అనేక వ్యాధులు వచ్చే ప్రమాదముంది. ముఖ్యంగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో పాటు కీళ్ల నొప్పులు వస్తాయి. ఎముకలు కూడా దెబ్బతిని ఆరోగ్యం క్షీణిస్తుంది. కల్తీ పాలు సేవించడం వల్ల వాంతులు, విరేచనాలవుతాయి. కల్తీ పాలు ఏవో, స్వచ్ఛమైన పాలు ఏవో గుర్తించి తీసుకోవడం మంచిది.
- డాక్టర్ జి.శ్రీహరి, సంగారెడ్డి