సాక్షి, సంగారెడ్డి: అక్రమార్జనే లక్ష్యంగా కొందరు అగ్ర వ్యాపారవేత్తలు అమాయక ప్రజలను ఆసరాగా చేసుకొని వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు. ఇటీవల సన్ పరివార్ పేరుతో సంగారెడ్డితో పాటు అన్ని జిల్లాల్లో భారీ మోసాలు జరిగిన విషయం తెలిసిందే. మరికొన్ని కంపెనీలు సైతం ఇదే బాటలో పయనిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా జిల్లా కేంద్రం సంగారెడ్డిలో టాయినెక్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ బ్యాంకు మాదిరిగా బ్రాంచ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ యజమానులు ఏజెంట్ల ద్వారా ప్రజల వద్ద నుంచి లక్షకు 10 వేల వడ్డీ చెల్లిస్తామని నమ్మించి లక్షల రూపాయలను జమ చేసుకున్నారు. ఇలా దాదాపు 500 మంది దగ్గర లక్ష చొప్పున 50 కోట్ల వరకు జమ చేసుకున్నారు. అయితే జమ అయిన డబ్బులను నెలనెల కొందరికి వడ్డీ రూపంలో ఇస్తూ వచ్చారు.
మరి కొందరికి వాయిదాల పర్వం పెట్టడంతో చివరకు వారి సంస్థ డొంక కదిలింది. దీంతో బయటికి వచ్చిన సమాచారం జిల్లా కలెక్టర్ వరకు చేరింది. స్పందించిన కలెక్టర్ హనుమంతరావు సంగారెడ్డి ఆర్డీఓకు టాయినెక్స్‌లో జరుగుతున్న వ్యవహరం, వారు చేపట్టిన కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరపాలని సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ శ్రీను సంస్థకు సంబంధించిన డాక్యుమెంట్లను సేకరించారు. అయినప్పటికీ ఇంకా కొన్ని డాక్యుమెంట్లు రావాల్సి ఉండగా సంగారెడ్డి తహసీల్దార్ పరమేశ్వర్‌ను ఆదేశించారు. సంస్థ పనితీరును నివేదికల అనంతరం సంస్థపై కలెక్టర్ నేతృత్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment