దారి దోపిడీ కేసులో ఇద్దరి అరెస్టు
సంగారెడ్డి క్రైం : దాడి చేసి టవేరా వాహనాన్ని అపహరించిన ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిం చినటు డీఎస్పీ తిరుపతన్న తెలిపా రు. ఈ కేసుకు సంబంధించి వివరాలను సంగారెడ్డి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు.
హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌కు చెందిన ఏనుగు నర్సిరెడ్డి వ్యాపారం నిమిత్తం ఈ నెల 19న మహారాష్ట్రలోని డెగ్లూర్‌కు అతడి మేనల్లుడు, డ్రైవర్ రాములు, ఉద్యోగులు సత్యనారాయణ, చెన్నయ్యలతో పాటు మరో వ్యక్తి కలిసి టవేరా వాహనంలో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ నెల 21న సంగారెడ్డి శివారులోని కుల్పగూర్ గ్రామం వద్దకు రాగానే ఇద్దరు గుర్తుతెలియని నిందితులు మోటార్ బైక్‌పై వచ్చి వాహనాన్ని అడ్డుకుని డ్రైవర్ రాములుపై దాడి చేశారు. అనంతరం మిగిలిన వారందరినీ దింపి వారి వద్ద ఉన్న రూ. 2 వేల నగదుతో పాటు టవేరా వాహనాన్ని అపహరించుకెళ్లారు. దీంతో బాధితుడు నర్సిరెడ్డి ఫిర్యాదు మేరకు సంగారెడ్డి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 25న సంగారెడ్డి మండలం జుల్కల్ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. శంకర్‌పల్లి నుంచి వాహనంలో అనుమానాస్పదంగా వస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా టవేరా వాహనాన్ని అపహరించింది తామేనని ఒప్పుకున్నారు.
నిందితులు సంగారెడ్డి పట్టణంలోని నేతాజీ నగర్‌కు చెందిన కంది శివకుమార్(21), భవానీనగర్‌కు చెందిన దండే విశ్వనాథ్(23)లుగా గుర్తించినట్లు డీఎస్పీ వివరించారు. నిందితుల నుంచి టవేరా వాహనంతో పాటు బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని వారికి రిమాండ్‌కు తరలించామన్నారు. కేసును ఛేదించిన సంగారెడ్డి రూరల్ సీఐ శ్యామల వెంకటేష్, ఎస్‌ఐ రాజశేఖర్, ఐడీ పార్టీ పోలీసులను ఆయన అభినందించారు. విలేకరుల సమావేశంలో సీఐలు వెంకటేష్, కె.శ్రీనివాస్, ఎస్‌ఐ రాజశేఖర్ పాల్గొన్నారు.