సమాజ సేవే నాటా బాట: సంజీవ టీ రెడ్డి
నాటా అధ్యక్షుడు సంజీవ టీ రెడ్డితో ‘సాక్షి’ ఇంటర్వ్యూ
మూడేళ్ల కిందట 50 మందితో మొదలు
ఇప్పుడు 8వేల మంది సభ్యులతో సమాజ సేవ
సొంత రాష్ట్రంలో విరివిగా సేవా కార్యక్రమాలు
సాక్షి, హైదరాబాద్: నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్.. క్లుప్తంగా ‘నాటా’.. ప్రవాసాంధ్రులందరికీ ఈ పేరు సుపరిచితం. విదేశాల్లో తెలుగువారికి అండదండగా నిలిచేందుకు మూడేళ్ల క్రితం పురుడు పోసుకున్న ‘నాటా’ ఇప్పుడు తన సేవలను విసృ్తతం చేస్తూ జన్మభూమి రుణం తీర్చుకుంటోంది. గత నెల రాష్ట్రంలోని పది జిల్లాల్లో ‘నాటా సేవా డేస్’ పేరుతో పలు సేవా కార్యక్రమాలు అమలు చేసింది. 2011లో కేవలం యాభై మంది సభ్యులతో ప్రారంభమైన నాటా ప్రస్తుతం 8 వేల మంది సభ్యులతో వికసిస్తోంది. సాంస్కృతిక వికాసమే నాటా మాట.. సమాజ సేవే నాటా బాట అని ముందుకు వెళ్తున్న నాటా అధ్యక్షుడు సంజీవ టీ రెడ్డితో ‘సాక్షి’ ఇంటర్వ్యూ..
మీరు స్వదేశంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలేంటి?
గత నెల 16 నుంచి 29 వరకు నాటా సేవా డేస్ నిర్వహించాం. మేం పర్యటించిన ప్రాంతాల్లో అనేక ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు లేవని గుర్తించాం. అందుకే 2015లో మళ్లీ సేవా డేస్ నిర్వహించినప్పుడు ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కూర్చోవడానికి బల్లలు, విద్యార్థినుల కోసం మరుగుదొడ్లు నిర్మించాలని తలపెట్టాం. అంతేకాదు విసృ్తతంగా వైద్య శిబిరాలు కూడా నిర్వహించాలని యోచిస్తున్నాం. పలుచోట్ల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా నిర్మించే యోచనలో ఉన్నాం.
సమాజ సేవకు మీరు ఎంత ఖర్చు చేస్తున్నారు?
గతనెల 15 రోజుల పాటు నిర్వహించిన నాటా సేవా డేస్ పది జిల్లాల్లో అమలు చేశాం. మొత్తం రూ.4 కోట్లు ఖర్చు చేశాం. ఇందులో నెల్లూరులో పదిచోట్ల వాటర్ ప్లాంట్లు, ఐదు శ్మశాన వాటికల్లో ‘క్లీన్ అండ్ గ్రీన్’ చేపట్టాం. ఈ ఒక్క జిల్లాలోనే రూ.రెండు కోట్లు ఖర్చు చేశాం. వైఎస్సార్ జిల్లా రాయచోటిలో రెండు చోట్ల వాటర్ ప్లాంట్లు పెట్టించాం. సుంకిశాల పక్కనే ఉన్న గ్రామంలో సోలార్ లైట్లు ఏర్పాటుచేశాం. నాటా సేవా డేస్‌లో ఎక్కువగా విద్య, వైద్యంపై దృష్టిసారించాం. గత నెల 17న వైఎస్సార్ జిల్లా పుల్లంపేటలో వైద్య శిబిరం ఏర్పాటుచేసి 700మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాం. అలాగే అనంతయ్యగారిపల్లెలో వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేశాం. కడపలో నేత్ర వైద్య శిబిరం నిర్వహించి 34 మంది విద్యార్థులకు సర్జరీలు నిర్వహించేందుకు సిఫార్సు చేశాం. అనంతపురం, నెల్లూరు, గుంటూరు, వరంగల్, కరీంనగర్ తదితర జిల్లాల్లో కూడా నేత్ర, వైద్య శిబిరాలు నిర్వహించి సుమారు పదివేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించాం.