అపోలో సారథ్యంలో ‘బయోబ్యాంక్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చౌక ఔషధాల తయారీతోపాటు ‘పర్సన లైజ్డ్’ వైద్య సేవలకూ ఉపయోగపడే బయోబ్యాంక్ ‘సేపియన్ బయోసెన్సైస్’ సంస్థను అపోలో హాస్పిటల్స్ ప్రారంభించింది. సారమ్ ఇన్నోవేషన్స్ సంస్థతో కలిసి దీన్ని ఏర్పాటు చేసింది. కంపెనీ ప్రారంభం సందర్భంగా సోమవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ శోభన కామినేని ఈ విషయాలు తెలిపారు. ఆస్పత్రికి వచ్చే పేషెంట్ల దగ్గర్నుంచి సేకరించే కణాలను.. ఇతర సమాచారాన్ని భద్రపర్చి, వివిధ వ్యాధులపై పరిశోధనలకు ఉపయోగించ నున్నట్లు ఆమె వివరించారు. దీనివల్ల ఆయా వ్యాధులకు తగిన ఔషధాలను రూపొందించేందుకు పట్టే సమయం, వ్యయాలు కూడా గణనీయంగా తగ్గగలవని పేర్కొన్నారు.
ఫలితంగా ఔషధాల ధర సైతం తగ్గగలదన్నారు. నమూనాల సేకరణ పూర్తిగా దాతల అంగీకారానికి లోబడే జరుగుతుందని శోభన పేర్కొన్నారు. మరోవైపు, ఒకే రకమైన ఔషధానికి వేర్వేరు వ్యక్తులు వివిధ రకాలుగా స్పందిస్తుంటారని, ఈ నేపథ్యంలో ఆయా వ్యక్తుల తత్వానికి అనుగుణమైన ఔషధాలను, పాటించాల్సిన చికిత్స రీతులను (పర్సనలైజ్డ్) తెలియజేసే పరీక్షలను కూడా సేపియన్ బయోసెన్సైస్ రూపొందించిందని సంస్థ సీఈవో శ్రీవత్స నటరాజన్ తెలిపారు. పాటించాల్సిన విధానంపై వైద్యులకు మరింత స్పష్టత రావడం వల్ల పేషెంట్లకు కూడా గణనీయంగా వ్యయాలు తగ్గగలవన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 150 దాకా ఇలాంటి బయోబ్యాంకులు ఉన్నాయని నటరాజన్ వివరించారు. దేశీయంగానూ కొన్ని ఉన్నప్పటికీ.. అవి ఆస్పత్రుల్లో అంతర్భాగంగా చిన్నస్థాయిలోనే ఉంటున్నాయన్నారు.
వాణిజ్యపరంగా సేపియన్ బయోసెన్సైస్ ఈ తరహావాటిలో మొట్టమొదటిది అవుతుందని నటరాజన్ పేర్కొన్నారు. మధుమేహం వంటి వ్యాధుల రాకను ముందస్తుగానే గుర్తించేందుకు ఉపయోగపడే పరీక్షలను కూడా అందిస్తున్నట్లు అపోలో హాస్పిటల్స్ సీఈవో (సెంట్రల్ రీజియన్) కె.హరిప్రసాద్ చెప్పారు. ఈ పరీక్షలకు దాదాపు రూ. 750 వ్యయం అవుతుందన్నారు. సేపియన్ బయోసెన్సైస్లో అపోలో హాస్పిటల్స్‌కి సుమారు 70% వాటాలు ఉంటాయి. వచ్చే రెండేళ్లలో నగదు, మౌలిక సదుపాయాలు తదితర రూపంలో సుమారు 3-4 మిలియన్ డాలర్లు (దాదాపూ రూ. 25 కోట్లు) దీనిపై ఇన్వెస్ట్ చేయనున్నారు.