Sardar Patel birth anniversary
-
పటేల్ కృషివల్లే హైదరాబాద్ భారత్‌లో విలీనం
హైదరాబాద్ : సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో జాతీయ సమైక్యతా పరుగును ప్రారంభించారు. అంతకు ముందు ఆయన అసెంబ్లీ ముందున్న పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ఐకమత్య సూత్రానికి కట్టుబడి ఉంటామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి చేత తెలుగులో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ వల్లభాయ్ పటేల్ జయంతి హైదరాబాద్‌లో జరుపుకోవటం సంతోషకరంగా ఉందన్నారు. పటేల్ కృషివల్లే హైదరాబాద్ భారతదేశంలో విలీనమైందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ విభజన సమయంలో పటేల్ కీలక పాత్ర వహించారని కొనియాడారు. మోదీ సంకల్పించిన జాతీయ ఐక్యతా పరుగును విజయవంతం చేయాలని రాజ్‌నాథ్ కోరారు. ఐక్యతా రన్ పటేల్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ వరకు కొనసాగుతుంది. పటేల్ జయంతిని జాతీయ ఏక్తా దివస్‌గా నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ప్రజల్లో సమైక్యతా భావాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులతో పాటు నగరానికి చెందిన బీజేపీ నేతలు పాల్గొన్నారు. అనంతరం రాజ్‌నాథ్ సింగ్ రాజేంద్ర నగర్ లోని సర్దార్ పటేల్ పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్నారు. 66వ బ్యాచ్ ఐపీఎస్ లు శిక్షణ పూర్తి చేసుకోగా,ఈ ముగింపు కార్యక్రమంలో రాజ్ నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
'కుట్రలను ఉక్కుపాదంతో అణిచిన సర్దార్ పటేల్'
న్యూఢిల్లీ: భారతదేశాన్ని ఏకీకృతం చేయడానికే ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్‌పటేల్ జీవితం అంకితం చేశారని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పటేల్ జీవితం ఎందరికో స్పూర్తిదాయకమని చెప్పారు. సర్దార్ వల్లభాయ్‌పటేల్ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని విజయ్‌చౌక్ వద్ద నిర్వహించిన జాతీయ ఏక్ తా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన పటేల్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ... దేశాన్ని ఐక్యంగా ఉంచే క్రమంలో సర్దార్ పటేల్ చేసిన సేవలను ఆయన కొనియాడారు. స్వాతంత్య్ర అనంతరం దేశంలోని సంస్థానాల వీలినమే పటేల్‌లో ఉన్న దేశ ఐక్యతకు నిదర్శనమని చెప్పారు. భారతదేశ స్వాతంత్ర కాంక్ష, శక్తిని చాటిన యాత్ర దండియాత్ర. ఆ యాత్రలో మహాత్మునితో కలసి అడుగులోఅడుగు వేసి నడిచిన వ్యక్తి పటేల్ అని మోదీ ఈ సందర్బంగా గుర్తు చేశారు. అలాగే స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో దేశంలోని రైతులందరిని ఏకతాటిపై నడిపి వ్యక్తి పటేల్ అని అన్నారు. కొత్త ఉత్సాహం, లక్ష్యంతో అడుగులు వేయాలని యువతకు మోదీ పిలుపు నిచ్చారు. దేశంలో జరిగిన అనేక కుట్రను ఉక్కుపాదంతో అణిచిన వ్యక్తి పటేల్ అని తెలిపారు. అనంతరం ఐక్యమత్య సూత్రానికి కట్టుబడి ఉంటామని మోదీ ఈ సందర్భంగా విజయ్‌చౌక్ వద్ద పాల్గొన వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఆ తర్వాత ఐక్యత పరుగును జెండా ఊపి మోదీ ప్రారంభించారు. ఈ పరుగులో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.