SARS
-
40 ఏళ్ల పైబడిన వారికి బూస్టర్ ఇవ్వొచ్చు!
న్యూఢిల్లీ: దేశంలో 40 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోసు ఇవ్వొచ్చా అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సార్స్–కోవ్–2 జినోమిక్స్ సీక్వెన్సింగ్ కన్సోర్టియమ్ (ఇన్సాకాగ్) చెందిన శాస్త్రవేత్తల బృందం సిఫారసు చేసింది. కరోనా ముప్పు అధికంగా ఉండే ఆరోగ్య, పారిశుద్ధ్య, పోలీసు రంగాల్లో వ్యక్తులకు తొలుత బూస్టర్ డోసు ఇచ్చే అంశంపై ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోని వారందరికీ త్వరితగతిన వ్యాక్సినేషన్ ఇవ్వాలని ఇన్సాకాగ్ తన వారాంతపు నివేదికలో చెప్పింది. లోక్‌సభ ఎంపీలు బూస్టర్ డోసు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇన్సాకాగ్ ఈ సిఫారసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కరోనా వైరస్‌లోని జన్యుక్రమాలను పరీక్షించడానికి ఇన్సాకాగ్‌ను ఏర్పాటు చేశారు. కరోనా వేరియెంట్ కేసులు దేశంలోకి ప్రవేశించాయన్న విషయాన్ని త్వరితగతిన తెలుసుకోవడం కష్టసాధ్యమని, అందుకే కరోనా నిబంధనలన్నీ కచ్చితంగా పాటించాలని చెప్పింది. -
వందేళ్లుగా వణికిస్తున్నాయి.. నిలబడుతూనే ఉన్నాం
కొవిడ్-19 మహమ్మారితో మానవాళి సహజీవనం ఏడాదిన్నర పూర్తి చేసుకుంది. వైరస్ తీరు తెన్నులు గందరగోళంగా ఉండడంతో సరైన మందు కనిపెట్టడం పరిశోధకులకు కష్టంగా మారుతోంది. అయితే శాస్త్ర విజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందని రోజుల్లో ప్రమాదకరమైన అంటువ్యాధుల్ని, మహమ్మారుల్ని ఎదుర్కొన్నాం. తట్టుకుని నిలబడగలిగాం. స్పానిష్ ఫ్లూ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్‌గా స్పానిష్ ఫ్లూ చెప్తుంటారు. 19వ శతాబ్దం ప్రారంభంలో విజృంభించిన ఈ వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా యాభై కోట్ల మందికి సోకినట్లు ఒక అంచనా. అదే విధంగా కోట్ల సంఖ్యలో మనుషులు స్పానిష్ ఫ్లూకి బలయ్యారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మనిషి అపరిశుభ్రమైన అలవాట్ల నుంచి పుట్టిన ఈ వైరస్.. చాలా వేగంగా ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. భారత సైనికుల ద్వారా 1918లో బాంబే(ఇప్పుడు ముంబై) నుంచి తొలి కేసు మొదలై.. రైల్వే ప్రయాణాల వల్ల మన దేశంలో వేగంగా విస్తరించింది(బాంబే ఫీవర్‌గా పిలిచారు). బ్రిటిష్ ప్రభుత్వ నిర్లక్క్ష్యంతో కోట్ల మందికి ఈ వైరస్ సోకింది. చివరికి.. విమర్శలతో మెరుగైన మందులు తీసుకొచ్చి వైద్యం అందించడం మొదలుపెట్టాక పరిస్థితి రెండేళ్లకు అదుపులోకి వచ్చింది. కలరా కలరా మహమ్మారి తొలిసారి 1817లో విజృంభించింది. రష్యాలో మొదలైన ఈ మహమ్మారి శరవేగంగా ప్రపంచమంతటా విస్తరించింది. దాదాపు 150 ఏళ్ల వ్యవధిలో ఏడుసార్లు కలరా మహమ్మారి మానవాళిపై పంజా విసిరింది. 1961 టైంలో ఇండోనేషియా నుంచి ఎల్ టొర్ స్ట్రెయిన్ మొదలై.. మూడేళ్ల తర్వాత మన దేశం మీద తీవ్ర ప్రభావం చూపెట్టింది. గంగా పరివాహక ప్రాంతంలో అపరిశుభ్రత, కలకత్తా(కొల్కట్టా) వాతావరణం ఈ కలరా విజృంభణకు దారితీసింది. మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ.. దీని కట్టడికి ఏడాదిపైనే సమయం పట్టింది. ఇక కలరా నివారణకు వ్యాక్సిన్‌ను 1885లోనే తయారు చేసినా.. ఈ మహమ్మారి విజృంభణ ఆగకపోవడం విశేషం. కలరా కారణంగా 1817-1923 మధ్య కాలంలో దాదాపు 3.5 కోట్ల మంది మరణించారు. ఇప్పటికీ కలరా ఉనికి ఉన్నప్పటికీ.. వైద్య రంగం అభివృద్ధితో తారా స్థాయిలో అది వ్యాపించడం లేదు. స్మాల్ఫాక్స్ అంటువ్యాధి మశూచి. ఈజిప్ట్‌ల కాలం నుంచే ఉందని భావిస్తున్న ఈ వ్యాధిని..1520లో అధికారికంగా గుర్తించారు. 1980లో నిర్మూలించబడిన వ్యాధుల జాబితాలో ప్రపంచ ఆరోగసంస్థ చేర్చింది. ఇక మన దేశంలో 1974 జనవరి నుంచి మే మధ్య ఐదు నెలలపాటు స్మాల్ఫాక్స్తో 15,000 మంది చనిపోయారు. తట్టుకోగలిగిన వాళ్లలో చాలా మంది చూపు పొగొట్టుకున్నారు. కకావికలం చేసిన ఈ అంటువ్యాధి.. చివరికి డబ్ల్యూహెచ్‌వో చొరవతో అదుపులోకి తేగలిగారు. 1977లో మన దేశంలో మశూచిని అదుపులోకి తేగలిగారు. అయితే మశూచికి 1796లోనే వ్యాక్సిన్(ఎడ్వర్డ్ జెన్నర్ కనిపెట్టాడు) తయారుచేసినప్పటికీ.. పూర్తిగా నిర్మూలించడానికి రెండు వందల సంవత్సరాలకు పైనే పట్టడం విశేషం. సూరత్ ప్లేగు భయంకరమైన అంటువ్యాధి. బ్యాక్టీరియా ద్వారా ఎలుకలు వాహకంగా ఈ అంటువ్యాధి వ్యాపిస్తుంది. 1994లో గుజరాత్ సూరత్‌లో ప్లేగు కేసులు మొదలయ్యాయి. తెరిచి ఉన్న నాలలు, చెత్త కుప్పలు, చచ్చిన ఎలుకల ద్వారా ఇది మొదలైంది. దీంతో లక్షల మంది పట్టణం వదిలి వెళ్లిపోయారు. ఇది వ్యాధి మరింత వ్యాపించడానికి కారణమైంది. ఆగష్టు నుంచి అక్టోబర్ మధ్యే దీని విజృంభణ కొనసాగింది. అయితే ఇది ఎక్కువగా విస్తరించకపోవడంతో 52 మంది మాత్రమే చనిపోయినట్లు లెక్కలు చెప్తున్నాయి. ఇది ఇతర దేశాలకు వ్యాపించినట్లు కూడా ఎక్కడా ఆధారాలు లేవు. పైగా దీని వ్యాప్తి విషయంలో నెలకొన్న గందరగోళం నడుమే.. ఈ వ్యాధి కనుమరుగుకావడం విశేషం. డెంగ్యూ, చికున్‌గున్యా 1635లో వెస్టిండీస్‌లో మొదటిసారిగా డెంగ్యూను అంటువ్యాధిగా గుర్తించారు. చికున్‌గున్యా కేసుల్ని 1952లో టాంజానియాలో గుర్తించారు. ఇక 2006లో ఒకేసారి డెంగ్యూ, చికున్‌గున్యా వ్యాధులు రాష్ష్ర్టాలను అతలాకుతలం చేశాయి. దోమల ద్వారా సంక్రమించే ఈ వ్యాధులు.. ఢిల్లీతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్(ఉమ్మడి) ఎక్కువ ప్రభావం చూపెట్టాయి. 2006లో భారత్‌లో అధికారికంగా డెబ్భై వేలకుపైగా డెంగ్యూ కేసులు నమోదు కాగా, 50 మరణాలు సంభవించాయి. దేశంలో పదకొండు లక్షల చికున్‌గున్యా కేసులు నమోదుకాగా.. ప్రభుత్వం మాత్రం మరణాల లెక్క సున్నా అని చెప్పడం విమర్శలకు దారితీసింది. ఎన్సెఫలిటిస్(మెదడువాపు) జపనీస్ ఎలిటిస్(జేఈ) 1871లో జపాన్‌లో మొదటి కేసును గుర్తించారు. ఎక్యుట్ ఎస్పెఫలిటిస్ సిండ్రోమ్(ఎఈఎస్) కేసును 1955లో మద్రాస్ రీజియన్‌లో గుర్తించారు. 1978 నుంచి పాతిక వేలమంది పిల్లల ప్రాణాల్ని బలిగొన్న వ్యాధి ఇది. 2017లో గోరఖ్‌పూర్(యూపీ) నుంచి వీటి విజృంభణ ఎక్కువైంది. దోమల వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ సోకి.. మెదడుపై తీవ్ర ప్రభావం చూపెడుతుంది.ఆ ఏడాదిలో మొత్తం 4,759 ఎఈఎస్ కేసులు నమోదు కాగా, 595 మరణాలునమోదు అయ్యాయి. జేఈ కేసుల సంఖ్య 677 కాగా, 81 మరణాలు సంభవించాయి. చికిత్స ద్వారానే ఈ వ్యాధిని అదుపు చేయడం విశేషం. నిఫా వైరస్ జునోటిక్(జంతువుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతుంది) వైరస్. మనుషులతో పాటు పందులపైనా ఈ వైరస్ ప్రభావం ఉంటుంది. నిఫా వైరస్ గబ్బిలాల(ఫ్రూట్ బ్యాట్స్) ద్వారా వ్యాప్తి చెందుతుంది. 1998లో మలేషియాలో నిఫామొదటి కేసును గుర్తించారు. అక్కడి సుంగై నిఫా అనే ఊరి పేరు మీదుగా దీనికి ఆ పేరు పెట్టారు. 2018 మే నెలలో కేరళలో నిఫా కేసులు మొదలయ్యాయి. రెండు నెలల వ్యవధిలో 18 మంది చనిపోగా.. కేవలం నెలలోనే పరిస్థితిని పూర్తిగా అదుపు చేసుకోగలిగింది కేరళ. దీనికి వ్యాక్సిన్ లేదు. అప్రమత్తంగా ఉండడమే మార్గం. సార్స్ సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. కరోనా వైరస్ రకాల్లో ఒకటి సార్స్. 21వ శతాబ్దంలో వేగంగా వ్యాపించే జబ్బుగా గుర్తింపు దక్కించుకుంది. 2002లో చైనా ఫొషన్ నుంచి మొదలైంది. తుంపర్ల ద్వారా ఈ వైరస్ ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 2003లో సార్స్(సార్స్ కోవ్) మన దేశంలో మొదటి కేసు నమోదు అయ్యింది. మొత్తం మూడుకేసులు నమోదుకాగా.. అంతా కోలుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 30 దేశాల్లో దాదాపు ఎనిమిది వేల మంది సార్స్ బారినపడగా.. 774 మంది మృతిచెందారు. దీని కొత్త స్ట్రెయినే ఇప్పడు కరోనా వైరస్(సార్స్ కోవ్ 2)గా విజృంభిస్తోంది. -
చైనా కుతంత్రం: జీవాయుధంగా కరోనా
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌ను చైనా లాబరేటరీలో తయారు చేసిందని.. కావాలనే భూమ్మీదకు వదిలిందని అమెరికా సహా పలు దేశాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బహిర్గతమైన ఓ డాక్యుమెంట్ డ్రాగన్ కుతంత్రాలను మరోసారి వెల్లడించింది. ఐదేళ్ల క్రితం నాటి ఈ డాక్యుమెంట్లో చైనా మిలిటరీ శాస్త్రవేత్త ఒకరు మూడో ప్రపంచం యుద్ధం గురించి చర్చించారు. సార్స్ వైరస్ జాతి నుంచి తయారు చేసిన జీవాయుధంతో యుద్ధం జరుగుతుందని చైనా ప్రభుత్వ ఆరోగ్య అధికారితో చర్చించినట్లు ఈ డాక్యుమెంట్ వెల్లడించింది. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ దీనిని స్వాధీనం చేసుకుంది చైనా శాస్త్రవేత్తలు, ప్రజారోగ్య అధికారులు సార్స్ కరోనావైరస్ ఆయుధీకరణ గురించి మాట్లాడినట్లు పరిశోధనా పత్రం వెల్లడించింది. ఆస్ట్రేలియన్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్ న్యూస్.కామ్ ప్రకారం, "ది అన్‌నాచుర్ ఆరిజిన్ ఆఫ్ సార్స్ అండ్ న్యూ స్పీసిస్ ఆఫ్ మ్యాన్-మేడ్ వైరసెస్ యాజ్ జెనెటిక్ బయోవెపన్స్" డాక్యుమెంట్లో చైనా మిలటరీ శాస్త్రవత్త తదుపరి ప్రపంచ యుద్ధం సార్స్ జాతికి చెందిన జీవ ఆయుధాలతో జరుగుతుందని అంచనా వేశారు. కరోనావైరస్లను "జన్యు ఆయుధాల కొత్త శకం"గా, "కృత్రిమంగా అభివృద్ధి చెందుతున్న హ్యూమండైజ్ వైరస్‌గా మార్చవచ్చని.. తరువాత తరంలో వాడే ఆయుధాలు మునుపెన్నడూ చూడని విధంగా ఉంటాయని" ఈ డాక్యుమెంట్లో వెల్లడించారు. చైనీస్ నేత్ర వైద్య నిపుణురాలు, వైరాలజిస్ట్ లి-మెంగ్ యాన్ చైనా ప్రభుత్వ ప్రయోగశాలలో సార్స్-కోవ్-2 వైరస్ తయారైనట్లు ఆరోపించిన డాక్యుమెంట్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. The mentioned breaking document to “predict World War III as biological war” is the PLA’s novel bioweapon textbook (by General Dezhong Xi, 2015) I’m translating into English with our Chinese volunteers! The brief introduction is in the 3rd Yan Report👇🏻 https://t.co/BxE22sQOuN pic.twitter.com/qkx7cLKclt — Dr. Li-Meng YAN (@DrLiMengYAN1) May 7, 2021 చదవండి: తండాలో నో కరోనా..! -
ఉత్తరాదిలో యూకే వేరియంట్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. రికార్డు స్థాయిలో కొత్త పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కోవిడ్‌కు కారణమయ్యే సార్స్–కోవ్–2 వైరస్‌లో కొత్త రకాలు వెలుగులోకి వస్తున్నాయి. యునైటెడ్ కింగ్డమ్లో పుట్టిన కొత్త రకం(యూకే వేరియెంట్) ప్రస్తుతం ఉత్తర భారతదేశంపై పంజా విసురుతోందని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్సీడీసీ) డైరెక్టర్ సుజిత్ చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్లో డబుల్ మ్యుటెంట్ వ్యాప్తి అధికంగా ఉందన్నారు. దేశంలో ఉత్తరాది మినహా ఇతర ప్రాంతాల్లో యూకే వేరియంట్ (బీ1.1.7) ప్రభావం గత నెలన్నర రోజుల్లో గణనీయంగా పడిపోయిందన్నారు. యూకే వేరియంట్ కరోనా పాజిటివ్ కేసులు పంజాబ్‌లో 482, ఢిల్లీలో 516, మహారాష్ట్రలో 83, కర్ణాటకలో 82, తెలంగాణలో 192 బయటపడ్టాయని వెల్లడించారు. కేవలం మహారాష్ట్రలో బ్రెజిల్ రకం వైరస్ డబుల్ మ్యుటెంట్ వేరియంట్ (బి.1.617) కేసులు మహారాష్ట్రలో 761, పశ్చిమ బెంగాల్లో 124, ఢిల్లీలో 107, గుజరాత్లో 102 నమోదయ్యాయని సుజిత్ సింగ్ గుర్తుచేశారు. ఇక దక్షిణాఫ్రికా వేరియంట్ (బి.1.315) తెలంగాణ, ఢిల్లీలోనే అధికంగా కనిపిస్తోందని తెలిపారు. బ్రెజిలియన్ వేరియంట్(పీ1) మహారాష్ట్రలోనే స్వల్పంగా ఉందన్నారు. ఇతర రాష్ట్రాల్లో దాని ఉనికి కనిపించలేదన్నారు. కొత్త వేరియంట్లు బయటపడే జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, వైరస్ నియంత్రణ చర్యలను పటిష్టం చేయాలని అన్ని రాష్ట్రాలకు సుజిత్ సింగ్ సూచించారు. కాంట్రాక్టు ట్రేసింగ్ చాలా ముఖ్యమంత్రి చెప్పారు. -
సెకండ్ వేవ్ టెన్షన్.. 200 రోజులుగా ఒక్క కేసు లేదు
తైపీ: ప్రపంచవవ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా ఉధృతి ఇంకా అదుపులోకి రాలేదు. వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియదు. ఈ సమస్యలు ఇలా ఉండగనే కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలైంది. ఇక ప్రారంభంలో కంటే కూడా సెకండ్ వేవ్‌లో భయంకరంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ చిన్న దేశం ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. మొత్తం 23 మిలియన్ల జనాభాలో కేవలం 553 మందికే వైరస్ సోకడం.. ఏడుగురు మాత్రమే చనిపోవడం వంటి విషయాలు అగ్రదేశాలను సైతం ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఎంటంటే గత 200 రోజులుగా అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం. ఏప్రిల్ 12న చివరి కోవిడ్ కేసు నమోదు అయ్యింది. శుక్రవారం వరకు స్థానికంగా (201 రోజులు) ఒక్క కేసు కూడా నమోదు లేదు. ఇంతకు ఆ దేశం పేరు చెప్పలేదు కదా.. అదే తైవాన్. వైరస్ వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచే తైవాన్ కఠిన చర్యలు తీసుకుంది. విదేశీ ప్రయాణాలు బంద్ చేసింది. చాలా పక్కగా కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడమే కాక మాస్క్ ధరించడం విషయంలో కూడా ప్రభుత్వం కఠినంగా ఉంది. గతంలో సార్స్‌తో పోరాడిన అనుభవం కూడా బాగా ఉపయోగపడింది. ప్రస్తుతం తైవాన్‌లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అసలే లేదని అంటు వ్యాధి వైద్యుడు మరియు ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ పీటర్ కొల్లిగ్నాన్ తెలిపారు. కరోనా కట్టడి విషయంలో ప్రపంచంలోనే తైవాన్ ఉత్తమంగా నిలిచిందని అన్నారు. ఆస్ట్రేలియాతో సమానమైన జనాభా కలిగిన ఆర్థిక వ్యవస్థకు "ఇది మరింత ఆకట్టుకుంటుంది" అన్నారు ఇక్కడ చాలా మంది అపార్ట్మెంట్లలలో ఒకరితో ఒకరు కలిసి చాలా దగ్గర దగ్గరగా ఉంటారు. (చదండి:ఒకప్పుడు ఆ మసాజ్ పార్లర్‌కు 600 మంది..) మరింత తీవ్రంగా సెకండ్ వేవ్ కరోనా వైరస్ సెకండ్ వేవ్ మరితం ప్రమాదకరంగా ఉంటుందని ఇప్పటికే రుజువు అవుతోంది. అమెరికాలో గురువారం నమోదయిన కేసులతో కొత్త రోజువారీ రికార్డును నెలకొల్పింది. ఒక్క రోజులో 86,000 కేసులతో అగ్రస్థానంలో ఉంది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి మిన్నెసోటాలో కేసులు చాలా పెరిగాయి, టెక్సాస్‌లో వ్యాప్తి వేగవంతమైంది. శుక్రవారం నుంచి తిరిగి లాక్డౌన్లోకి వెళ్లేందుకు ఫ్రాన్స్ సిద్ధమయయ్యింది. ఆర్థిక కార్యకలాపాలను 15 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆర్థిక మంత్రి బ్రూనో లే మైర్ తెలిపారు. జర్మనీలో కొత్త నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయి. ఇక ఆర్థికంగా కూడా ఈ ఏడాది అన్ని దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా తైవాన్ మాత్రం ఆర్థికంగా ఎంతో మెరుగ్గా ఉంది. ఇక 2020 లో స్థూల జాతీయోత్పత్తిలో 1.56 శాతం పెరుగుదల ఉండనున్నట్లు ఆగస్టులో ప్రభుత్వం అంచనా వేసింది. దాంతో తైవాన్ ఈ ఏడాది పురోగతి సాధించిన అతి కొద్ది ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉండనుంది. (చదవండి: చైనా లేఖ; గెట్ లాస్ట్ అన్న తైవాన్!) బయట నుంచి వచ్చిన వారిలోనే కరోనా స్థానికంగా ఒక్క కేసు కూడా నమోదు కానప్పటికి బయటి దేశాల నుంచి వస్తున్న వారిలో కోవిడ్ బాధితులు ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం ఫిలిప్పీన్స్, అమెరికా, ఇండోనేషియా నుంచి వచ్చిన వారిలో మూడు కేసులను గుర్తించింది. గత రెండు వారాల్లో ఇలాంటి కేసులు 20 కి పైగా నమోదు అయ్యాయి. ఈ క్రమంలో తైవాన్ మాజీ వైస్ పప్రెసిడెంట్, ఎపిడెమియాలజిస్ట్ చెన్ చియెన్-జెన్ ఒక ఇంటర్వ్యూలో ‘పాజిటివ్ వచ్చిన న వ్యక్తులను గుర్తించకుండా.. వారిని నిర్బంధించకుండా ఈ విజయాన్ని సాధించలేము’ అన్నారు. అలాగే ప్రజలను క్వారంటైన్లో ఉంచడం అంత సులభం కానందున భోజనం, కిరాణా సరుకులు డెలివరీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. క్వారంటైన్ నియమాలను ఉల్లంఘించిన వారికి గరిష్టంగా 35 వేల అమెరికన్ డాలర్లను జరిమానాగా విధించింది. ఈ క్రమంలో అమెరికా సెనేటర్ బెర్నీ సాండర్స్ ఒక ట్వీట్లో తైవాన్ విజయాన్ని ప్రస్తావిస్తూ "వారు దీన్ని ఎలా సాధించారు.. వారు సైన్స్‌ను నమ్ముతారు" అంటూ ట్వీట్ చేశారు. ఇక తైవాన్ ఈ విజయంలో సాధించడంలో కీలక పాత్ర పోయించిన అంశాలు ఏంటంటే.. సరిహద్దు నియంత్రణ జనవరిలో మహమ్మారి వ్యాప్తి మొదలైన ప్రారంభంలోనే కొద్దిసేపటికే తైవాన్ సరిహద్దులను మూసివేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి దాని సరిహద్దులపై గట్టి నియంత్రణను కలిగి ఉంది. బార్డర్ కంట్రోల్‌ని కఠినంగా అమలు చేయడం వల్ల తైవాన్ నిరంతరం విజయం సాధిస్తుందని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ పాలసీ, ఔట్‌కమ్స్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ జాసన్ వాంగ్ తెలిపారు. ప్రయాణికులు విమానాలు ఎక్కడానికి ముందు టెస్ట్ చేస్తారు. తేడా వస్తే వారిని క్వారంటైన్లో ఉంచుతారు. సెల్యులార్ సిగ్నల్స్ ద్వారా డిజిటల్ ట్రాకింగ్ చేస్తూ 14 రోజుల నిర్బంధాన్ని పూర్తి చేయాలి. (చదవండి: 9 లక్షల వైరస్లు మానవులపై దాడి!) మాస్క్‌ల పంపిణీ ఫేస్ మాస్క్‌ల నిల్వ, విస్తృత పంపిణీని కలిగి ఉండాలనే నిర్ణయం తైవాన్ విజయంలో కీలక పాత్ర పోషించింది. మహమ్మారి ప్రారంభంలో ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తి చేసిన ఫేస్ మాస్క్‌లన్నింటినీ నిల్వ చేసి, ఎగుమతిని నిషేధించింది. నాలుగు నెలల్లో, కంపెనీలు రోజుకు 2 మిలియన్ల నుండి 20 మిలియన్ యూనిట్లకు ఉత్పత్తిని పెంచాయి. ఇక ఇక్కడ జనాలకు రేషన్‌లో మాస్క్‌లు సరఫరా చేస్తారు. కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్ తైవాన్ ప్రపంచ స్థాయి కాంటాక్ట్ ట్రేసింగ్ను కలిగి ఉంది - సగటున, ధృవీకరించబడిన ప్రతి కేసుకు 20 నుంచి 30 మందిని పరీక్షించింది. వైరస్ బారిన పడిన తైపీ సిటీ హోస్టెస్ క్లబ్‌లోని కార్మికుడి వంటి తీవ్రమైన కేసులల్లో, ప్రభుత్వం 150 మందికి టెస్ట్‌లు చేసింది. వారందరికి నెగిటివ్ వచ్చినప్పటికి కూడా వారిని రోజుల పాటు హోం క్వారంటైన్‌లోనే ఉంచింది. ఇప్పటివరకు, సుమారు 340,000 మంది గృహ నిర్బంధంలో ఉన్నారు. క్వారంటైన్ నియమాలు ఉల్లఘించిన వారి సంఖ్య కేవలం 1000 మాత్రమే. అంటే 99.7శాతం మంది ప్రభుత్వానికి సహకరిస్తున్నారని చెన్ తెలిపారు. "23 మిలియన్ల మందిసాధారణ జీవితాలకు బదులుగా 3, 40,000 మంది జీవితాల్లోని ఓ 14 రోజులు త్యాగం చేశాము" అన్నారు చెన్. (చదవండి: కరోనా రోగులకు మరో షాక్?!) సార్స్ అనుభవం గత అంటువ్యాధులు మిగిల్చిన అనుభవాలు కోవిడ్‌పై పోరాడడంలో తైవాన్ విజయానికి మార్గం సుగమం చేశాయి.2003 లో సార్స్ విజృంభణతో వందలాది మంది అనారోగ్యానికి గురై, కనీసం 73 మంది మరణించారు. ఈ క్రమంలో సార్స్ సంక్రమణ రేటులో ప్రపంచంలో తైవాన్ మూడో స్థానంలో నిలిచింది. ఆ అనుభవం తరువాత, అంటు వ్యాధులు ప్రబలినప్పుడు అత్యవసర-ప్రతిస్పందన నెట్‌వర్క్‌ను నిర్మించడం ప్రారంభించింది. ఆ తరువాత బర్డ్ ఫ్లూ, ఇన్‌ఫ్లూయెంజా హెచ్ 1 ఎన్ 1 వంటి మహమ్మారిని ఎదుర్కొంది. దాంతో ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత, తరచుగా చేతులు కడుక్కొవడం వంటి వాటిని తప్పక పాటిస్తారు. -
జంతువుల నుంచే 75 శాతం ఇన్ఫెక్షన్లు
సాక్షి, హైదరాబాద్: ఈ శతాబ్దంలో వచ్చిన సార్స్, మెర్స్, ఇన్ఫ్లుయెంజా వంటి వ్యాధులు జంతువుల నుంచే వ్యాప్తి చెందినట్లు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, నిపుణులు నిర్ధారించారు. పలురకాల జూనోటిక్ వ్యాధులు జంతువులు లేదా సూక్ష్మక్రిముల నుంచి మనుషులకు రోగాలను వ్యాపింపజేస్తాయని గుర్తించారు. ఈ రోగాల్లో కొన్నిజంతువులను అనారోగ్యానికి గురిచేయకపోయినా, వీటి వల్ల మనుషులు మాత్రం అనారోగ్యానికి గురవుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం 1,200 ఇన్ఫెక్షన్లు సోకేందుకు కారణమైన వ్యాధులు, రోగాల్లో 816 జూనోటిక్ డిసీజెస్ జంతువుల నుంచి (75 శాతం వరకు) వచ్చినట్లు ప్రపంచవ్యాప్తంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. (ఇంకొంత కాలం ఇంటినుంచే) స్వల్ప అస్వస్థత నుంచి తీవ్ర అనారోగ్యం దాకా.. ఈ వ్యాధులు స్వల్ప అస్వస్థత నుంచి తీవ్ర అనారోగ్యానికి కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా కారణమవుతాయి. భవిష్యత్‌లో ఇలాంటి వ్యాధులు సోకినప్పుడు అనుసరించాల్సిన వ్యూ హంపై ‘నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఇన్ వన్ హెల్త్’పేరిట ఐఐఎస్సీ బెంగళూరు ప్రొఫెసర్ జి.పద్మనాభన్ నేతృత్వంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. జంతువుల, సూక్ష్మక్రిముల నుంచి సోకే వైరస్లు, వాటి విస్తృతి, వ్యాప్తికి సంబంధించిన వివిధ అంశాలను మెరుగైన పద్ధ తుల్లో అర్థం చేసుకునేందుకు ఇది కృషి చేయనుంది. మూడేళ్ల కాలపరిమితిలో ఈ రోగాలు, వ్యాధులకు సంబంధించి ప్రాధాన్యాంశాలను గుర్తించడం తో పాటు, ఈ వైరస్లు మళ్లీ రాకుండా, ఇన్ఫెక్షన్లు మళ్లీ సోకకుండా, బయో సేఫ్టీ, బయో సెక్యురిటీకి సంబంధించిన సవాళ్లను పరిశీలించి వెంటనే చేపట్టాల్సిన చర్యలను సూచించనుంది. వాతావరణ మార్పులు, అడవులు తగ్గిపోవడం, జంతువులతో వ్యవహరించే తీరు, వలసలు, టూరిజం, పట్టణీకరణ, మనుషుల ప్రవర్తనలో మార్పులు, మారుతున్న ఆహారపు అలవాట్లు, జనాభా పెరుగుదల, సాంస్కృతిక పరమైన అంశాలు, తదితరాలు జూనోటిక్ వ్యాధులు రావడానికి కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏయే రకాలు.. వైరస్, బ్యాక్లీరియా, శిలీంద్రాలు తదితర పరాన్న జీవులు.. వీటిలో కొన్ని దోమలు, పేలు వంటివి వ్యాప్తి చేస్తాయి. వ్యాప్తి ఎలా.. ⇒ గాలి ద్వారా, కలుషితమైన మాంసం తినడం ⇒ వ్యాధి సోకిన జంతువులకు సన్నిహితంగా మెలగడం ∙ వ్యాధి సోకిన జంతువు తాకిన ఉపరితలాన్ని/ప్రాంతాన్ని ముట్టుకోవడం ⇒ దోమలు, పేలు వంటివి కుట్టినప్పుడు ఇవే జూనోటిక్ వ్యాధులు.. ⇒ ఆంథ్రాక్స్, బర్డ్ ఫ్లూ, బొవైన్ ట్యూబర్క్యులోసిస్, క్యాట్ స్క్రాచ్ ఫీవర్, డెంగీ ఫీవర్, ఎబోలా, ఎన్సెఫలైటిస్, ఫిష్ ట్యాంక్ గ్రాన్యులోమా, గ్లాండర్స్, హెపటైటిస్–ఈ, లెప్టోస్పైరోసిస్, లైమ్ డిసీజ్, మలేరియా, ప్యారట్ ఫీవర్, ప్లేగు, క్యూ ఫీవర్, రేబీస్, ర్యాట్ బైట్ ఫీవర్, రింగ్వార్మ్, స్వైన్ ఫ్లూ, డిప్తీరియా తదితరాలు. -
‘సార్స్’లాగా ‘కరోనా’ కూడా అదృశ్యం...?
సాక్షి, న్యూఢిల్లీ : ‘సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్)’ కూడా కరోనా వైరస్ లాగా ప్రాణాంతకమైనదే. అప్పట్లో ఇంత భయం లేదు, ఇంతటి ప్రజా ప్రతిష్టంభన లేదు. ఇప్పుడు కరోనా వైరస్‌కు లేనట్లే సార్స్ కూడా వ్యాక్సిన్ లేదు. వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు పెద్దగా ప్రయత్నాలు కూడా జరగలేదు. మరి అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు? సార్స్ కూడా కరోనా జాతికి చెందినదే. అందుకే సార్స్‌ను ‘సార్స్– కోవిడ్–1’ గాను, కరోనాను ‘సార్స్ కోవిడ్–2’ లేదా కోవిడ్–19’ గాను వ్యవహరిస్తున్నారు. సార్స్ కూడా చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లో 2002, నవంబర్‌లో బయట పడింది. అప్పుడు కూడా సార్స్ గురించి వెంటనే ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియజేయలేదు. చైనా తర్వాత 2003, ఫిబ్రవరి నెలలో వియత్నాంలోని హనాయ్‌లో సార్స్ విస్తరించింది. అక్కడ సార్స్ కేసును ప్రత్యక్షంగా పరీక్షించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి ఒకరు, మార్చి 10వ తేదీ, 2003లో తన సంస్థకు తెలియజేశారు. అదే సమయంలో చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన డాక్టర్ ఒకరు హాంకాంగ్ వెళ్లి అక్కడి మెట్రోపాల్ హోటల్లో బస చేశారు. ఆయన ద్వారా ఆయనతో పాటు ఆ హోటల్లో బస చేసిన 12 మందికి సార్స్ సోకింది.(నిబంధనల సడలింపు: మరణాలు రెట్టింపయ్యే అవకాశం!) వారిలో ముగ్గురు సింగపూర్‌కు, ఇద్దరు కెనడాకు, ఒకరు ఐర్లాండ్‌కు, ఒకరు అమెరికాకు, ఒకరు వియత్నాంకు వెళ్లారు. వారితోని ఆ దేశాల్లో సార్స్ విస్తరించింది. మరో నలుగురు హాంకాంగ్‌లో ఉండడంతో వారి ద్వారా అక్కడ కూడా వైరస్ విస్తరించింది. రోగుల్లో సార్స్ లక్షణాలు రెండు, మూడు రోజుల్లోనే బయటపడేవి. సార్స్, కరోనా రెండు వైరస్లు కూడా గబ్బిళాల నుంచే మానవ జాతికి సంక్రమించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రెండింటి ఆర్ఎన్ఏ జన్యువుల మధ్య 80 శాతం పోలికలు ఉన్నాయట. మనుషులకు, చింపాజీల ఆర్ఎన్ఏ జన్యువుల మధ్య 98 శాతం పోలికలు ఉంటాయి. అయితే మనుషులకు, చింపాజీలకు మధ్య పోలికలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే వైరస్ విషయంలో ఇది వేరుగా ఉంటాయట. జన్యువుల మధ్య పోలికలు 70 శాతం దాటితేనే సామీప్యం ఎక్కువగా ఉంటుందట. అటువంటిది సార్స్, కరోనా వైరస్ల ఆర్ఎన్ఏ జన్యువుల మధ్య 80 శాతం పోలికలు ఉన్నాయి. వాటి పైభాగంలో ఉండే ప్రాటీన్ల మధ్య కూడా తేడాలు లేవట.(లాక్డౌన్ : 55 రోజుల పాటు ఎయిర్‌పోర్ట్‌లోనే) సార్స్ కేవలం మానవుల ఊపిరితిత్తులపైనే దాడి చేసి నిమోనియా జబ్బును కలుగ చేస్తుండగా, కరోనా ఊపిరితిత్తులతోపాటు ఇతర జన్యువులపై దాడి చేస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. సార్స్‌కు, కరోనాకు మధ్య మరో ప్రధానమైన తేడా ఉంది. సార్స్ నెమ్మదిగా ఒకరి నుంచి ఒకరి విస్తరించడంతోపాటు వాటి లక్షణాలు రోగిలో రెండు, మూడు రోజుల్లోనే బయటపడ్డాయి. కరోనా వైరస్ వేగంగా విస్తరించడంతోపాటు వాటి లక్షణాలు రోగిలో బయట పడటానికి ఐదారు రోజుల నుంచి 20 రోజుల వరకు పడుతోంది. సార్స్‌కు వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే అవి ఎలుకలు, ఇతర జంతువుల వరకే పరిమితం అయ్యాయి. వ్యాక్సిన్ల వల్ల జంతువుల్లో రోగ నిరోధక శక్తికి సంబంధించిన సమస్యలు వచ్చాయి. ఇంతలో వైరస్ దానంతట అదే కనిపించకుండా అదృశ్యమవడంతో వ్యాక్సిన్ ప్రయోగాలను నిలిపివేశారు. అప్పటికే ఎండలు తీవ్రమవడం వల్ల, రోగులను కచ్చితంగా క్వారెంటైన్లో ఉంచడం వల్ల సార్స్ జాడ లేకుండా పోయిందని వైద్య నిపుణులు భావించారు. వైరస్ల విషయంలో కచ్చితమైన కారణాలు చెప్పలేమని వారే అంటున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు అభివృద్ధి చెందిన దేశాలతోపాటు వర్ధమాన దేశాలన్నీ కృషి చేస్తున్నాయి. అవి సత్ఫలితాలు ఇవ్వకముందే సార్స్ లాగా కరోనా కూడా అంతరించి పోయే అవకాశాలు ఉన్నాయని కొంత మంది వైద్య నిపుణులు భావిస్తున్నారు. రానున్న వర్షాకాలంలో కరోనా రెండోసారి విజృంభించే అవకాశాలు ఉన్నాయంటూ వైద్యులు చేస్తున్న హెచ్చరికలను వారు ఖండిస్తున్నారు. వైరస్‌లకు భయపడి దూరంగా దాక్కునే బదులు, ఎదురొడ్డి పోరాడడమే (కలిసి సహజీవనం) నిజమైన పరిష్కారమని ఆ కొంత మంది వైద్యులు ప్రత్యేక వాదనను వినిపిస్తున్నారు. లాక్‌డౌన్‌ను విడతల వారిగా సడలించేందుకు ప్రయత్నాలు జరగుతున్న నేపథ్యంలో సార్స్‌లాగా, కరోనా కూడా దానంతట అదే అదృశ్యమైతే అంతకన్నా అదృష్టం ఏముంటుంది? (చదవండి : వూహాన్ వాసులందరికీ కరోనా పరీక్షలు)