తైపీ: ప్రపంచవవ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా ఉధృతి ఇంకా అదుపులోకి రాలేదు. వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియదు. ఈ సమస్యలు ఇలా ఉండగనే కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలైంది. ఇక ప్రారంభంలో కంటే కూడా సెకండ్ వేవ్‌లో భయంకరంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ చిన్న దేశం ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. మొత్తం 23 మిలియన్ల జనాభాలో కేవలం 553 మందికే వైరస్ సోకడం.. ఏడుగురు మాత్రమే చనిపోవడం వంటి విషయాలు అగ్రదేశాలను సైతం ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఎంటంటే గత 200 రోజులుగా అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం. ఏప్రిల్ 12న చివరి కోవిడ్ కేసు నమోదు అయ్యింది. శుక్రవారం వరకు స్థానికంగా (201 రోజులు) ఒక్క కేసు కూడా నమోదు లేదు. ఇంతకు ఆ దేశం పేరు చెప్పలేదు కదా.. అదే తైవాన్.
వైరస్ వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచే తైవాన్ కఠిన చర్యలు తీసుకుంది. విదేశీ ప్రయాణాలు బంద్ చేసింది. చాలా పక్కగా కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడమే కాక మాస్క్ ధరించడం విషయంలో కూడా ప్రభుత్వం కఠినంగా ఉంది. గతంలో సార్స్‌తో పోరాడిన అనుభవం కూడా బాగా ఉపయోగపడింది. ప్రస్తుతం తైవాన్‌లో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ అసలే లేదని అంటు వ్యాధి వైద్యుడు మరియు ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ పీటర్ కొల్లిగ్నాన్ తెలిపారు. కరోనా కట్టడి విషయంలో ప్రపంచంలోనే తైవాన్ ఉత్తమంగా నిలిచిందని అన్నారు. ఆస్ట్రేలియాతో సమానమైన జనాభా కలిగిన ఆర్థిక వ్యవస్థకు "ఇది మరింత ఆకట్టుకుంటుంది" అన్నారు ఇక్కడ చాలా మంది అపార్ట్‌మెంట్లలలో ఒకరితో ఒకరు కలిసి చాలా దగ్గర దగ్గరగా ఉంటారు. (చదండి:ఒకప్పుడు ఆ మసాజ్ పార్లర్‌కు 600 మంది..)
మరింత తీవ్రంగా సెకండ్ వేవ్
కరోనా వైరస్ సెకండ్ వేవ్ మరితం ప్రమాదకరంగా ఉంటుందని ఇప్పటికే రుజువు అవుతోంది. అమెరికాలో గురువారం నమోదయిన కేసులతో కొత్త రోజువారీ రికార్డును నెలకొల్పింది. ఒక్క రోజులో 86,000 కేసులతో అగ్రస్థానంలో ఉంది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి మిన్నెసోటాలో కేసులు చాలా పెరిగాయి, టెక్సాస్‌లో వ్యాప్తి వేగవంతమైంది. శుక్రవారం నుంచి తిరిగి లాక్‌డౌన్‌లోకి వెళ్లేందుకు ఫ్రాన్స్ సిద్ధమయయ్యింది. ఆర్థిక కార్యకలాపాలను 15 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆర్థిక మంత్రి బ్రూనో లే మైర్ తెలిపారు. జర్మనీలో కొత్త నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయి. ఇక ఆర్థికంగా కూడా ఈ ఏడాది అన్ని దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా తైవాన్ మాత్రం ఆర్థికంగా ఎంతో మెరుగ్గా ఉంది. ఇక 2020 లో స్థూల జాతీయోత్పత్తిలో 1.56 శాతం పెరుగుదల ఉండనున్నట్లు ఆగస్టులో ప్రభుత్వం అంచనా వేసింది. దాంతో తైవాన్ ఈ ఏడాది పురోగతి సాధించిన అతి కొద్ది ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉండనుంది. (చదవండి: చైనా లేఖ; గెట్ లాస్ట్ అన్న తైవాన్!)
బయట నుంచి వచ్చిన వారిలోనే కరోనా
స్థానికంగా ఒక్క కేసు కూడా నమోదు కానప్పటికి బయటి దేశాల నుంచి వస్తున్న వారిలో కోవిడ్ బాధితులు ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం ఫిలిప్పీన్స్, అమెరికా, ఇండోనేషియా నుంచి వచ్చిన వారిలో మూడు కేసులను గుర్తించింది. గత రెండు వారాల్లో ఇలాంటి కేసులు 20 కి పైగా నమోదు అయ్యాయి. ఈ క్రమంలో తైవాన్ మాజీ వైస్ పప్రెసిడెంట్, ఎపిడెమియాలజిస్ట్ చెన్ చియెన్-జెన్ ఒక ఇంటర్వ్యూలో ‘పాజిటివ్ వచ్చిన న వ్యక్తులను గుర్తించకుండా.. వారిని నిర్బంధించకుండా ఈ విజయాన్ని సాధించలేము’ అన్నారు. అలాగే ప్రజలను క్వారంటైన్‌లో ఉంచడం అంత సులభం కానందున భోజనం, కిరాణా సరుకులు డెలివరీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. క్వారంటైన్ నియమాలను ఉల్లంఘించిన వారికి గరిష్టంగా 35 వేల అమెరికన్ డాలర్లను జరిమానాగా విధించింది. ఈ క్రమంలో అమెరికా సెనేటర్ బెర్నీ సాండర్స్ ఒక ట్వీట్‌లో తైవాన్ విజయాన్ని ప్రస్తావిస్తూ "వారు దీన్ని ఎలా సాధించారు.. వారు సైన్స్‌ను నమ్ముతారు" అంటూ ట్వీట్ చేశారు.
ఇక తైవాన్ ఈ విజయంలో సాధించడంలో కీలక పాత్ర పోయించిన అంశాలు ఏంటంటే..
సరిహద్దు నియంత్రణ
జనవరిలో మహమ్మారి వ్యాప్తి మొదలైన ప్రారంభంలోనే కొద్దిసేపటికే తైవాన్ సరిహద్దులను మూసివేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి దాని సరిహద్దులపై గట్టి నియంత్రణను కలిగి ఉంది. బార్డర్ కంట్రోల్‌ని కఠినంగా అమలు చేయడం వల్ల తైవాన్ నిరంతరం విజయం సాధిస్తుందని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ పాలసీ, ఔట్‌కమ్స్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ జాసన్ వాంగ్ తెలిపారు. ప్రయాణికులు విమానాలు ఎక్కడానికి ముందు టెస్ట్ చేస్తారు. తేడా వస్తే వారిని క్వారంటైన్‌లో ఉంచుతారు. సెల్యులార్ సిగ్నల్స్ ద్వారా డిజిటల్ ట్రాకింగ్ చేస్తూ 14 రోజుల నిర్బంధాన్ని పూర్తి చేయాలి. (చదవండి: 9 లక్షల వైరస్‌లు మానవులపై దాడి!)
మాస్క్‌ల పంపిణీ
ఫేస్ మాస్క్ల నిల్వ, విస్తృత పంపిణీని కలిగి ఉండాలనే నిర్ణయం తైవాన్ విజయంలో కీలక పాత్ర పోషించింది. మహమ్మారి ప్రారంభంలో ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తి చేసిన ఫేస్ మాస్క్‌లన్నింటినీ నిల్వ చేసి, ఎగుమతిని నిషేధించింది. నాలుగు నెలల్లో, కంపెనీలు రోజుకు 2 మిలియన్ల నుండి 20 మిలియన్ యూనిట్లకు ఉత్పత్తిని పెంచాయి. ఇక ఇక్కడ జనాలకు రేషన్‌లో మాస్క్‌లు సరఫరా చేస్తారు.
కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్
తైవాన్ ప్రపంచ స్థాయి కాంటాక్ట్ ట్రేసింగ్‌ను కలిగి ఉంది - సగటున, ధృవీకరించబడిన ప్రతి కేసుకు 20 నుంచి 30 మందిని పరీక్షించింది. వైరస్ బారిన పడిన తైపీ సిటీ హోస్టెస్ క్లబ్‌లోని కార్మికుడి వంటి తీవ్రమైన కేసులల్లో, ప్రభుత్వం 150 మందికి టెస్ట్‌లు చేసింది. వారందరికి నెగిటివ్ వచ్చినప్పటికి కూడా వారిని రోజుల పాటు హోం క్వారంటైన్‌లోనే ఉంచింది. ఇప్పటివరకు, సుమారు 340,000 మంది గృహ నిర్బంధంలో ఉన్నారు. క్వారంటైన్ నియమాలు ఉల్లఘించిన వారి సంఖ్య కేవలం 1000 మాత్రమే. అంటే 99.7శాతం మంది ప్రభుత్వానికి సహకరిస్తున్నారని చెన్ తెలిపారు. "23 మిలియన్ల మందిసాధారణ జీవితాలకు బదులుగా 3, 40,000 మంది జీవితాల్లోని ఓ 14 రోజులు త్యాగం చేశాము" అన్నారు చెన్. (చదవండి: కరోనా రోగులకు మరో షాక్?!)
సార్స్ అనుభవం
గత అంటువ్యాధులు మిగిల్చిన అనుభవాలు కోవిడ్‌పై పోరాడడంలో తైవాన్ విజయానికి మార్గం సుగమం చేశాయి.2003 లో సార్స్ విజృంభణతో వందలాది మంది అనారోగ్యానికి గురై, కనీసం 73 మంది మరణించారు. ఈ క్రమంలో సార్స్ సంక్రమణ రేటులో ప్రపంచంలో తైవాన్ మూడో స్థానంలో నిలిచింది. ఆ అనుభవం తరువాత, అంటు వ్యాధులు ప్రబలినప్పుడు అత్యవసర-ప్రతిస్పందన నెట్‌వర్క్‌ను నిర్మించడం ప్రారంభించింది. ఆ తరువాత బర్డ్ ఫ్లూ, ఇన్‌ఫ్లూయెంజా హెచ్ 1 ఎన్ 1 వంటి మహమ్మారిని ఎదుర్కొంది. దాంతో ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత, తరచుగా చేతులు కడుక్కొవడం వంటి వాటిని తప్పక పాటిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment