రహస్య ప్రేమికుడు
డిసెంబర్, 1948... గ్రీస్...
సమయం సాయంత్రం ఆరున్నర కావస్తోంది. శీతాకాలం కావడంతో అప్ప టికే బాగా చీకట్లు ముసురుకున్నాయి. చలి ఎముకల్ని కొరకడం మొదలుపెట్టింది.
‘‘ఈ యేడు చలి చంపేసేలా ఉంది. పగలూ లేదు, రాత్రీ లేదు. ఒకటే వణుకు’’... వేడి వేడి కాఫీని చప్పరిస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్ బఖోస్.
‘‘అవున్సార్... రక్తం గడ్డ కట్టేసేలా ఉంది’’... వంతపాడాడు అసిస్టెంట్ ఫోటిస్.
ఇద్దరూ శీతాకాలపు చలి గురించి చర్చలు జరుపుతుంటే స్టేషన్లోకి దూసుకొచ్చిందో యువతి. ఆమెను చూడగానే ఇద్దరూ మాటలు ఆపారు.
‘‘సర్... నాకు మీ సాయం కావాలి’’... పరుగు పరుగున వచ్చిందేమో, ఆయాసంతో మాటమాటకీ మధ్య ఒగర్పు వినిపించింది.
‘‘తప్పకుండా... ముందు మీరిలా వచ్చి కూర్చోండి’’ అన్నాడు బఖోస్.
ఆమె వచ్చి కూచుంది. మంచినీళ్లు ఇవ్వమని లేడీ పోలీసుకు సైగ చేశాడు బఖోస్. ఆమె గ్లాసుతో నీళ్లు తెచ్చి ఆ యువతికి అందించింది. ఆమె కాదనకుండా అందుకుని గటగటా తాగేసింది. కాస్త మామూలయ్యాక అడిగాడు బఖోస్... ‘‘చెప్పండి. ఎవరు మీరు? ఏంటి సమస్య?’’
‘‘నా పేరు అలాలా సర్. మీరు... మీరు ఒక వ్యక్తిని కనిపెట్టాలి.’’
‘‘ఎవరతను?’’
‘‘నాకు కాబోయే భర్త.’’
‘‘ఏమయ్యాడు? కనిపించడం లేదా?’’
‘‘అవును సర్. రోజూ ఇంటికి వచ్చేవాడు. కానీ వారం రోజులుగా పత్తా లేకుండా పోయాడు. ఏమయ్యాడో తెలియడం లేదు. త్వరలో మేం పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. ఇంతలో ఇలా అయ్యింది. నాకు చాలా భయంగా ఉంది సర్.’’
‘‘అతగాడు మిమ్మల్ని మోసం చేసి పోలేదు కదా?’’
ఫోటిస్ అన్న మాటకి అలాలాతో పాటు ఇన్స్పెక్టర్ బఖోస్ కూడా చివ్వున తల తిప్పి చూశాడు. తను నోరు జారానన్న విషయం అర్థమై తలదించుకున్నాడు ఫోటిస్.
‘‘సారీ... మీరు చెప్పండి’’ అన్నాడు బఖోస్.
‘‘తనకేమయ్యిందో తెలియడం లేదు సర్. ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని భయంగా ఉంది. తనకేదైనా అయితే నేను, నా కడుపులో బిడ్డ ఏమైపోవాలి!’’... కన్నీళ్లు ఉబికి వచ్చాయి అలాలా కళ్లలో.
నిట్టూర్చాడు బఖోస్. ‘ప్రేమ చాలా దూరం తీసుకెళ్లిందన్నమాట. ఇప్పుడు అతడికేదైనా అయినా, అతడు మోసం చేసి వెళ్లిపోయివున్నా ఈమె పరిస్థితి ఏమిటి’ అనుకున్నాడు మనసులో. పైకి మాత్రం... ‘‘కంగారు పడకండి. నేను కనిపెడతాను అతడెక్కడున్నాడో. నాకు తన ఫొటో, వివరాలు ఇవ్వండి’’ అన్నాడు.
‘‘తన పేరు గాబ్రియెల్ సర్. సైనికుడు. వయసు ముప్ఫైకీ ముప్ఫై అయిదుకీ మధ్య ఉంటుంది. ఆరడుగులు ఉంటాడు. అందంగా కూడా ఉంటాడు. మంచివాడు’’... చివరి మాటను ఒత్తి పలికింది.
నవ్వుకున్నాడు బఖోస్. ఆ నవ్వుకి అర్థం తెలియలేదు అలాలాకి. అయినా అడిగే ధైర్యం చేయలేకపోయింది.
‘‘అతడి ఫొటో ఇవ్వండి’’ అన్నాడు బఖోస్.
‘‘లేదు సర్’’ అంది దిగులుగా.
‘‘ఒక్కటి కూడా లేదా? అతడి బిడ్డకు తల్లి కూడా కాబోతున్నారు. కనీసం ఫొటో అయినా లేకపోవడం...’’
తల దించుకుందామె. ‘‘ఏం చెప్పమంటారు సర్! తన ఫొటోలు నా దగ్గర ఉన్నాయి. తను నా దగ్గర లేనప్పుడు వాటిని చూసుకునేదాన్ని. అతడు కనిపించకుండా పోయిన తర్వాత వాటిని తీసి చూస్తే...’’
సగంలో ఆగిపోవడం చూసి... ‘‘ఏమయ్యింది?’’... అడిగాడు బఖోస్. ‘‘మీరే చూడండి’’ అంటూ ఫొటోలు అందించింది అలాలా.
వాటిని చూసిన బఖోస్ అదిరిపడ్డాడు. తన కళ్లను తనే నమ్మలేకపోయాడు. ఫొటోల్లో మనిషి ఆకారం ఉంది. కానీ మనిషి లేడు. అలాలాతో కలిసి తీయించుకున్న ఫొటోలో అలాలా ఉంది, పక్కన మాత్రం అతడి నీడ తప్ప రూపం లేదు. ‘‘ఏంటిది?’’ అన్నాడు షాక్ తిన్నట్టుగా.
‘‘అదే నాకూ అర్థం కావడం లేదు సర్’’ అంది అమాయకంగా.
ఏం మాట్లాడాలో తెలియలేదు బఖోస్కి. ఆలోచిస్తూ ఉండిపోయాడు. తర్వాత అన్నాడు... ‘‘ఫొటో లేకుండా కనిపెట్టడం కష్టం. కనీసం అతడి అడ్రస్ అయినా చెప్పండి.’’
తెలియదన్నట్టు పెదవి విరిచింది అలాలా. ఏం చేయాలో తోచలేదు బఖోస్కి. ‘‘మీకు మళ్లీ కబురు చేస్తాను. ప్రస్తుతానికి వెళ్లి రండి’’ అంటూ ఆమెని పంపేశాడు. తర్వాత చాలాసేపు ఆ ఫొటోలనే చూస్తూండిపోయాడు. కెమెరాలో లోపం ఉంటే ఇద్దరూ పడకూడదు. ఒకరు పడి, ఇంకొకరు పడకపోవడమేంటి? పోనీ నిజంగా కెమెరా లోపమే అనుకుందామన్నా... అవన్నీ ఒక్కసారి తీసిన ఫొటోలు కావు. మరి ప్రతిసారీ ఒకే సమస్య ఎలా వస్తుంది?
ఆలోచించీ ఆలోచించీ బుర్ర వేడెక్కిపోయింది బఖోస్కి. చివరికి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే సైనికాధికారి ఆఫీసులో గాబ్రియెల్ అన్న సైనికుడి గురించి వాకబు చేశాడు. అలాంటివాళ్లెవరూ ఆ దేశ సైన్యంలో లేరని తెలిసింది. దాంతో ఆ వ్యక్తెవరన్నది మిస్టరీగానే మిగిలిపోయింది.
‘‘ఏమిటిది మేడమ్?’’... అవాక్కయ్యి అడిగాడు బఖోస్.
‘‘ఫొటోలు సర్’’... అందామె మెల్లగా.
‘‘ఫొటోలు సరే. వీటిలో మనిషేడి?’’... అన్నాడు అయోమయంగా.
‘‘అదే నాకూ అర్థం కావడం లేదు సర్. మొదట ఉండేవాడు. ఇప్పుడు నా జీవితంలోంచే కాదు, ఫొటోల్లోంచి కూడా మాయమైపోయాడు. ఇదెలా జరిగిందో తెలియడం లేదు సర్.’’
ఏం మాట్లాడాలో, ఎలా స్పందించాలో అర్థం కాక తల పట్టుకున్నాడు బఖోస్. సరిగ్గా తొమ్మిది నెలల క్రితం అలాలా కూడా ఇలాంటి ఫొటోలే తెచ్చింది. ఇప్పుడీమె కూడా అలాంటివే తెచ్చి చూపిస్తోంది. ఏమిటీ వింత?
‘‘చూడండి మిసెస్ కొరినా... కొద్ది నెలల క్రితం ఇలానే ఓ యువతి వచ్చింది. తన ప్రియుణ్ని కనిపెట్టమంది. మనిషే లేని ఫొటోలు ఇచ్చింది. ఇప్పటి వరకూ ఆ మిస్టరీ వీడలేదు. ఇప్పుడు మళ్లీ మీరొచ్చారు. ఏం జరుగుతోందో నాకేమీ అర్థం కావడం లేదు.’’
బఖోస్ అలా అనగానే ఏడుపందుకుందామె. ‘‘నేనొక విధవను సర్. భర్త పోయాక ఒంటరిగా బతుకుతున్నప్పుడు హెబర్ నాకు పరిచయమయ్యాడు. తనో సైనికుడు. మనసున్నవాడు. నన్ను పెళ్లి చేసుకుని నాకో జీవితాన్ని ఇచ్చాడు. సంతోషంగా ఉన్న సమయంలో కనిపించకుండా పోయాడు. తనెక్కడున్నా తీసుకురండి సర్.’’
ఆమె కన్నీళ్లు చూసి జాలి వేసినా ఏమీ చెప్పగలిగే స్థితిలో లేడు బఖోస్. అందుకే కాసేపు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత ఏదో చెప్పి ఆమెను పంపేశాడు. అతడికి తెలుసు... ఈ కేసు తాను ఛేదించలేనని. అనుకున్నట్టుగానే ఛేదించలేకపోయాడు. ఎందుకంటే... అసలలాంటి వ్యక్తే లేడు కాబట్టి! అవును. అతడు లేడు. రాడు. ఎందుకంటే అతడు మనిషి కాదు... ఓ ఆత్మ!
రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత గ్రీసు దేశంలో ఒక సైనికుడి ఆత్మ సంచలనం సృష్టించింది. వరుసగా కొందరు యువతులు ప్రేమించినవాడు కనిపించడం లేదనో, భర్త మాయమయ్యాడనో ఆవేదన చెందసాగారు. కొన్ని కేసులు పోలీసుల దృష్టికి కూడా వెళ్లాయి. అందరూ చెప్పింది ఒకటే కథ. ఓ సైనికుడు తమకు అనుకోకుండా పరిచయమయ్యాడు. తమ మనసుకు దగ్గరయ్యాడు. కొందరినైతే పెళ్లాడాడు. కొందరిని పెళ్లాడకుండానే ప్రేమబంధంతో ముడివేసుకున్నాడు.
కొన్నాళ్లు వారితో గడిపిన తర్వాత ఉన్నట్టుండి కనిపించకుండా పోయేవాడు. అతడేమైపోయాడో తెలియక ఆ యువతులు అల్లాడిపోయేవారు. అతడి కోసం ఎక్కడెక్కడో వెతికేవారు. కానీ ఎవరికీ అతడి జాడ తెలిసేది కాదు. అతడితో పాటే అతడి గురుతులూ చెరిగిపోయేవి. చిత్రాల్లో అతడి రూపం పోయి నీడ మిగిలేది. దాంతో అతడు ఎవరు అనేది ఎవరికీ తెలియకుండా పోయింది. అయితే చివరకు చిత్రకళ తెలిసిన ఒక యువతి అతడి రూపాన్ని చిత్రించడంతో... ఆ రొమాంటిక్ సైనికుడు ఎవరో తెలిసివచ్చింది. కానీ అతడి వివరాలు అందరినీ వణికించాయి. ఎందుకంటే... ఆ యువతులందరికీ పరిచయమ్యేనాటికే ఆ వ్యక్తి ప్రాణాలతో లేడు కాబట్టి!
అతడు గ్రీసు దేశపు సైనికుల్లో ఒకడు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. యుద్ధం ముగిసిన తర్వాత తన ప్రియురాలి దగ్గరకు పయనమయ్యాడు. త్వరలో జరగబోయే తమ పెళ్లి కోసం కొన్న దుస్తులు తీసుకుని సంతోషంగా బయలుదేరాడు. కానీ దారిలో శత్రువుల చేతికి చిక్కాడు. వాళ్లు అతణ్ని బంధించారు. వారం రోజులపాటు చిత్రహింసలు పెట్టారు. కాబోయే భార్య తనకోసం ఎదురుచూస్తూ ఉంటుందని, తనను విడిచిపెట్టమని బతిమాలినా వాళ్లు వినలేదు. కర్కశంగా అతడి ప్రాణాలు తీసేశారు. అతడే దెయ్యమయ్యాడని, ప్రియురాలికి దూరమైన బాధతో విధవలైన ఒంటరి మహిళలు, ఒంటరిగా ఉండే యువతులకు దగ్గరయ్యేవాడనే కథనాలు అప్పట్లో వినిపించాయి.
అయితే ఇది ఎంతవరకూ నిజమో ఎవరూ నిర్ధారించి చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే... ఒక ఆత్మ మనిషితో ఎలా కాపురం చేస్తుంది, ఎలా గర్భవతుల్ని చేస్తుంది అన్నది అందరిలోనూ తలెత్తిన పెద్ద సందేహం. పోనీ ఇదంతా భ్రమ అని కొట్టి పారేద్దాము అంటే... మరి ఆ యువతుల్ని మోసం చేసిన సైనికుడు ఎవరు అన్నది ఇంకో పెద్ద సందేహం. నివృత్తి చేసేవాళ్లెవరూ లేక, ఈ సందేహాలు నేటికీ సందేహాలుగానే మిగిలిపోయాయి. ఆ గ్రీకు సైనికుడి కథ... చరిత్రలో ఓ పెద్ద మిస్టరీగా నిలిచిపోయింది!
- సమీర నేలపూడి
ఓ యువతి వేసిన చిత్రం ఆధారంగా గ్రీకు సైనికుడి కథ బయటకు వచ్చింది. దాన్ని బట్టి వెతికితే ఈ చిత్రం వెలికి వచ్చింది. ఇతడే దెయ్యమైన ఆ సైనికుడు అని చాలామంది అన్నారు. అయితే అది చనిపోయిన సైనికుడి ఫొటోనే అని చెప్పగలం కానీ, అతడు దెయ్యమై అమ్మాయిలను మోసగించాడా లేదా అన్నది తాము చెప్పలేమని ఆర్మీ అధికారులు అన్నారు. దాంతో ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి, ఆ దెయ్యం ఒక్కరేనా అన్న విషయం ఎప్పటికీ నిర్ధారణ కాలేదు!