ఆల్‌టైమ్ క్యూ1 గరిష్టానికి సెక్యూరిటైజేషన్
ముంబై: బ్యాంక్‌యేతర ఆర్థిక సంస్థల రుణాల మంజూరీ, వసూళ్ల వృద్ధి భారీ స్థాయిలో ఉంటుండటంతో సెక్యూరిటైజేషన్ పరిమాణం గణనీయంగా పెరిగింది. తొలి త్రైమాసికంలో 60 శాతం ఎగిసి రూ. 55,000 కోట్లకు చేరింది. ఒక ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే ప్రథమం.
రుణాలకు డిమాండ్ పెరగడంతో సెక్యూరిటైజేషన్ ద్వారా నిధులను సమకూర్చుకునేందుకు బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ప్రయత్నిస్తుండటమే ఇందుకు కారణం. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
తన ప్రస్తుత అవసరాల కోసం నిధులను సమకూర్చుకునేందుకు ఏదైనా ఆర్థిక సంస్థ తాను ఇచ్చిన రుణాలపై రాబడులను మరో ఫైనాన్షియర్‌కు బదలాయించడాన్ని సెక్యూరిటైజేషన్‌గా వ్యవహరిస్తారు. తొలి త్రైమాసికంలో ఈ తరహా లావాదేవీలు గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 160 నుంచి 250కి పెరిగాయి. వాహన రుణాల సెక్యూరిటైజేషన్ 9 పర్సంటేజి పాయింట్లు పెరిగి 37 శాతానికి చేరింది.
సెక్యూరిటైజేషన్ లావాదేవీలు ఇదే తరహాలో కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిమాణం 2019 ఆర్థిక సంవత్సరం నాటి రూ. 1.9 లక్షల కోట్ల గరిష్ట స్థాయిని దాటేయవచ్చని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు.