చిన్నపాటి అలక్ష్యం...ప్రాణాలు ఫణం
ప్రమాదం అంచున ప్రయాణాలు
నిత్యం రక్తమోడుతున్న రోడ్లు
మొక్కుబడిగా రహదారి భద్రతా వారోత్సవాలు
ప్రయాణికులను వదిలి పాఠశాల్లో అవగాహనా!
చిన్నపాటి అజాగ్రత్త పెను ప్రమాదానికి దారితీస్తోంది.. ఏమవుతుందిలే అనే అలక్ష్యం నిండు ప్రాణాలను కబళిస్తోంది.. తొందరగా గమ్యానికి చేరాలన్న ఆతృత కాటికి తీసుకుపోతోంది.. అన్నీ తెలిసినా నిత్యం ప్రమాదం అంచునే మనిషి ప్రయాణం సాగుతోంది.. తెలిసి చేసినా తెలియక చేసినా ఒక పొరపాటు నిండు జీవితానికి గ్రహపాటుగా మారుతున్న వైనంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సి ఉంది.. ఈ దిశగా ఇటీవల చేపట్టిన రోడ్డు భద్రతా వారోత్సవాలు దోహదం చేస్తాయా అంటే అవీ మొక్కుబడి తంతుగానే సాగుతున్నాయి.
సాక్షి, మచిలీపట్నం/ నందిగామ రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఈ నెల 20 నుంచి 26 వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్న రవాణా శాఖ అధికారులు మొక్కుబడిగా ఈ తంతు నిర్వహిస్తున్నారు. ప్రమాదాలకు కారణమైన కీలక విషయాలపై వారు దృష్టి సారించటం లేదు. ప్రమాదాల నివారణ కోసం వాహనచోదకులు, ప్రయాణికుల్లో చైతన్యం నింపాల్సి ఉండగా, పాఠశాల విద్యార్థులతో ర్యాలీలు, ప్రమాదానికి గురైన ఒక కారును నమూనాగా ఊరేగించడం, ప్రమాదాల కారణాలను విద్యార్థులకు వివరించడంతో సరిపెడుతున్నారు. విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన మంచిదే అయినా కీలకమైన ప్రాంతాల్లో ప్రమాద కారణాలు గుర్తించి వాటిపై అవగాహన పెంచే ప్రయత్నం మాత్రం జరగడంలేదు.
ప్రమాదం అంచున ప్రయాణాలు...
గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చే ద్విచక్ర వాహన చోదకులు, ఆటోలపై ప్రయాణం చేసేవారు నిత్యం ప్రమాదం అంచునే ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ద్విచక్ర వాహనంపై నలుగురు ప్రయాణించటం, బైక్‌లపైనా అధిక బరువు (లగేజీ)తో ప్రయాణాలు కొనసాగించడం తరచూ కనిపిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకపోవడం నిత్యకృత్యమైంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు నిత్యం ఆటోలు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఆటోవాలాలు ఆదాయం కోసం పరిమితి కంటే ఎక్కువ మందిని ఎక్కిస్తున్నారు. నలుగురు ఎక్కి ప్రయాణం చేయాల్సిన ఆటోలో ఏకంగా 30 మందిని కూడా ఎక్కిస్తున్నారంటే ఎంత ప్రమాదకర స్థితిలో ప్రయాణాలు సాగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
సమయానికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండకపోవడం వల్లే ఆటోల్లో కిక్కిరిసిన ప్రయాణం చేస్తున్నామనేది పలువురి వాదన. ఇటువంటి వారికి రవాణా శాఖాధికారులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాల్సి ఉంది. చివరకు వారోత్సవాల్లో కూడా మొక్కుబడిగా ట్రాఫిక్ నిబంధనలపై ప్రచారం నిర్వహిస్తూ రవాణా శాఖాధికారులు చేతులు దులుపుకుంటున్నారు. గతంలో జరిగిన పలు పెద్ద ప్రమాదాలను వీడియోల రూపంలో చిత్రీకరించి వాటిని గ్రామీణ ప్రాంతాల్లో తరచూ ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తే కొంతమేర ప్రమాదాలను అదుపుచేయవచ్చని పలువురు పేర్కొంటున్నారు.
నెత్తురోడుతున్న రోడ్లు..
జిల్లాలో గత ఏడాది కాలంలో పరిశీలిస్తే రోడ్లు నెత్తురోడాయి.
గత ఏడాది ఆరంభం రోజునే గుడివాడ, మక్కపేట, కేసరపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు.
2013 జనవరి 8న నూజివీడు, జి.కొండూరు, కలిదిండి ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు.
భోగి రోజైన జనవరి 13న వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు చనిపోయారు.
జనవరి 15న వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఉయ్యూరు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, ఆగిరిపల్లి ప్రాంతాల్లో ఐదుగురు మృతి చెందారు.
జనవరి 25న విజయవాడ, కంభంపాడు, భీమవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు.
మార్చి 3న తోట్లవల్లూరు, ఎ.కొండూరు, కంకిపాడు మండలాల్లో రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు.
మార్చి 26న విస్సన్నపేట, కలిదిండిలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతన పడ్డారు.
మే 21న ఉంగుటూరు, కంచికచర్ల, జగ్గయ్యపేట, మచిలీపట్నం రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు.
జూలై 6న ఉంగుటూరు, ముదినేపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారు.
జూలై 7న మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుడివాడకు చెందిన లారీ డ్రైవర్, క్లీనర్ బత్తుల లక్ష్మణరావు, గుమ్మిడి ప్రతాప్‌లు ఇద్దరు మృతి చెందారు.
జూలై 15న గుడివాడ, కంచికచర్ల, హనుమాన్‌జంక్షన్ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు.
జూలై 20న పామర్రు మండలం కనుమూరు చెక్‌పోస్టు వద్ద లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో ఏఎస్సై ఎంవీవీ ప్రసాద్ (54) దుర్మరణం చెందారు.
సెప్టెంబర్ 8న కలిదిండి, కంచికచర్ల, జగ్గయ్యపేట ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు.
సెప్టెంబర్ 22న పెనమలూరు, కైకలూరు ప్రాంతాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు.
నవంబర్ 9న కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, నూజివీడు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాతపడ్డారు.
ఇలా చెప్పుకుంటూ పోతే తొందరగా గమ్యం చేరాలనే ఆతృత, నిర్లక్ష్యపు డ్రైవింగ్, అలక్ష్యం తదితర కారణాలతో ఎన్నో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇటువంటి ప్రమాదాలను నిలువరించేందుకు ప్రజల్లో మరింత ఆవగాహన అవసరం.