'పని చేయలేకపోతే వెళ్లిపోండి'
ఎస్ఎంఐ పనులపై పీవో అసంతృప్తి
ప్రొగ్రస్ లేకుంటే చర్యలు తప్పవంటూ హెచ్చరిక
సీతంపేట : ఉద్యోగులు తమ విధులు సక్రమంగా చేయకపోతే సెలవుపై వెళ్లిపోవాలని ఎస్ఎంఐ అధికారులపై విజయనగరం జిల్లా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి జల్లేపల్లి వెంకటరావు మండిపడ్డారు. సీతంపేటలోని ఐటీడీఏలో చిన్నతరహా నీటి వనరుల విభాగం పనులపై ఆయన శుక్రవారం సమీక్షించారు. నాలుగు నెలల క్రితం రివ్యూ చేశానని అప్పటికీ, ఇప్పటికీ అసలు ప్రొగ్రస్ ఏమి మార్పులేదని తెలిపారు. మీ అందరి జీతాలు నెలకు రూ.10 లక్షలు డ్రా చేస్తున్నారని, ఈ నాలుగు నెలల్లో రూ.40 లక్షలు జీతాలు తీసుకున్నారని రూ.40 లక్షల విలువ చేసే పనులు కూడా పూర్తి చేయలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇలాగైతే మీరు అక్కర్లేదని మీ శాఖ పనులన్నీ ట్రైబుల్వెల్ఫేర్ ఇంజినీరింగ్ శాఖకు బదలాయించేస్తానని హెచ్చరించారు. మిమ్మల్ని సరండర్ చేస్తానని తెలిపారు. ఎన్ని సార్లు సమావేశాలు పెట్టినా మార్పు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. వేసవిలోనే పనులు చేయాలని, మరో 20 రోజుల్లో వర్షాకాలం వస్తుందని అప్పుడు వర్షాలు పడుతున్నాయని మరేపని చేయరని తెలిపారు. 2014-15 పనులు ఇంకా నాలుగు పెండింగ్ ఉన్నాయన్నారు. 2015-16కు సంబంధించి 40 పనులకు 28 మాత్రమే పూర్తి చేశారని తెలిపారు. ఎక్కడైనా ఎవరైనా పనులకు సంబంధించి అడ్డంకులు పెడితే తాను స్వయంగా మాట్లాడతానని చెప్పారు. అనంతరం ఒక్కో జేఈ ప్రోగ్రెస్ను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఈఈ రమణ, డీఈ పైల ఉషారాణి, జేఈలు పాల్గొన్నారు.