Selective sound sensitivity syndrome
-
కొన్ని చప్పుళ్లు వింటే కొందరు పళ్లు నూరుతారు!
మెడిక్షనరీ చప్పరించే శబ్దం వింటే చాలు కొందరికి ఒళ్లు మండిపోతుంది. వారు పళ్లు పరపరా నూరుతుంటారు. కేవలం చప్పరింపులే కాకుండా పెదవులు నాక్కోవడం, గొంతు సవరించుకోవడం, టూత్‌బ్రష్ చప్పుడు చేస్తూ ఉపయోగించడం, విజిల్ వేయడం వంటి కాసేపు పదేపదే కొనసాగే ఈ శబ్దాలు వచ్చినప్పుడల్లా వారిలో కోపం నషాళానికి అంటుతుంటుంది. కొందరికి టైపింగ్ శబ్దాలతోనూ, హమ్ చేస్తున్న చప్పుళ్లతోనూ ఈ కోపం తారస్థాయికి చేరుతుంటుంది. ఇక చెప్పులతో చప్పుడు చేస్తున్నట్లు నడిస్తే... ఆ శబ్దం విన్న కొందరికి తీవ్రమైన అసౌకర్యం కలుగుతుంటుంది. దీన్నే సెలక్టివ్ సౌండ్ సెన్సిటివిటీ సిండ్రోమ్ అని వ్యవహరిస్తుంటారు. వైద్యపరిభాషలో ‘మిసోఫోనియా’ అంటారు. ఇలాంటి ఫీలింగ్ కలగడం దాదాపు సహజమే అయినా శబ్దాల పట్ల తీవ్రమైన కోపానికి గురయ్యేవారిలో కొందరికి చెమటలు పట్టడం, కండరాలు టెన్షన్‌కు గురికావడం, గుండెదడ రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వారికి కొద్దిపాటి శబ్దం వచ్చే ఫ్యాన్ సౌండ్‌ను అలవాటు చేయడం దగ్గర్నుంచి క్రమంగా శబ్దాలను అలవరుస్తారు. ‘సెలక్టివ్ సౌండ్ సెన్సిటివిటీ సిండ్రోమ్’కు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ మంచి ఫలితాలను ఇస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. -
శబ్దంతో ఇబ్బంది పెట్టే జబ్బు!
మెడిక్షనరీ చెవిలో జోరీగ చేసే శబ్దం ఎంత చిరాగ్గా అనిపిస్తుంది! అకస్మాత్తుగా ఎవరైనా ఈల వేసినా, టీ వంటి ద్రవపదార్థాలను జుర్రుకునే శబ్దాలు చేసినా, గట్టిగా బ్రేవుమంటూ తేన్చినా, కాళ్లు టపటపా కొడుతూ నడిచినా, ఎవరైనా గురకపెడుతున్నా ... ఆ చప్పుళ్లు చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇది అందరికీ ఉండే చాలా సాధారణమైన సహజాతం (ఇన్స్టింక్ట్). కానీ కొందరికి చిన్న చిన్న చప్పుళ్లే ఎంతో ఇబ్బందిగా అనిపిస్తాయి. దాన్నే వైద్య పరిభాషలో ‘సెలక్టివ్ సౌండ్ సెన్సిటివిటీ సిండ్రోమ్’ అంటారు. అమెరికాకు చెందిన నరాలపై అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు (న్యూరోసైంటిస్టులు) పావెల్ జెస్టర్ఫాబ్, మార్గరెట్ జస్టర్ఫాబ్ ఆ జబ్బుకు ఈ పేరు పెట్టారు. దీన్నే సాధారణంగా ‘మీసోఫోనియా’ అంటారు. అంటే శబ్దాలను అసహ్యించుకోవడం అని అర్థం. ఇలాంటి జబ్బు ఉన్నవాళ్లు టూత్ బ్రష్ చేసే చప్పుళ్లనూ, తుమ్ములనూ, దగ్గునూ, టైపింగ్ శబ్దాలనూ, ఆవలింతలనూ, పెద్దగా నవ్వడాన్ని, చివరకు మింగుతున్నప్పుడు వచ్చే శబ్దాలనూ తట్టుకోలేరు. ఈ జబ్బు ఉన్నవాళ్లకు శబ్దాలు వినగానే ఒళ్లంతా చెమటలు పెట్టడం, గుండెవేగం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటివాళ్లకు ముందుగా ఫ్యాన్ శబ్దంతో మొదలుపెట్టి నెమ్మదిగా నెమ్మదిగా శబ్దాలను తట్టుకునేలా వారికి రకరకాల శబ్దాలు అలవాటు చేస్తారు. కొందరికి 6-12 వారాల పాటు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ) చేస్తారు.