10 యాప్ సంస్థలపై గూగుల్ చర్యలు
న్యూఢిల్లీ: సర్వీస్ ఫీజు చెల్లింపుల వివా దం కారణంగా టెక్ దిగ్గజం గూగుల్ పలు యాప్ సంస్థలపై చర్యలకు ఉపక్రమించింది. వాటిని తమ ప్లేస్టోర్ నుంచి తొలగించే ప్రక్రియ ప్రారంభించింది. అనేక అవకాశాలు ఇచి్చనప్పటికీ, తమ ప్లాట్‌ఫామ్‌తో ప్రయోజనం పొందుతున్న ‘పేరొందిన’ పది సంస్థలు ఫీజులు చెల్లించడం లేదని సంస్థ పేర్కొంది. అయితే, గూగుల్ సదరు సంస్థల పేర్లను నిర్దిష్టంగా వెల్లడించలేదు.
కానీ, షాదీ, మ్యాట్రిమోనీడాట్కా మ్, భారత్ మ్యాట్రిమోనీ వంటి యాప్స్ కోసం ఆండ్రాయిడ్ ఫోన్లపై సెర్చి చేస్తే వాటి పేర్లు కనిపించకపోవడంతో జాబితాలో అవి ఉన్నట్లుగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే బాలాజీ టెలీఫిలిమ్స్కి చెందిన ఆల్ట్ (గతంలో ఆల్ట్‌బాలాజీ), ఆడియో ప్లాట్‌ఫాం కుకు ఎఫ్ఎం, డేటింగ్ సర్వీస్ యాప్ క్వాక్‌క్వాక్, ట్రూలీ మ్యాడ్లీ కూడా ప్లేస్టోర్ నుంచి మాయమయ్యాయి.
ఇన్–యాప్ పేమెంట్స్‌పై గూగుల్ 11 నుంచి 26 శాతం ఫీజులను విధిస్తుండటంపై నెలకొన్న వివాదం ఈ పరిణామానికి దారి తీసింది. ప్లాట్‌ఫాం ఫీజుపై పోరాడుతున్న కంపెనీలకు అనుకూలంగా సుప్రీం కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో నిబంధనలను పాటించని యాప్‌లను గూగుల్ తొలగించడం ప్రారంభించింది. ఉచిత డిజిటల్ మార్కెట్‌ప్లేస్‌ను ఆఫర్ చేస్తూ ఇండస్ యాప్ స్టోర్‌ను ఫోన్‌పే ప్రవేశపెట్టిన తరుణంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇది గుత్తాధిపత్య ధోరణి..: కుకు ఎఫ్ఎం
కాగా, గూగుల్ గుత్తాధిపత్య ధోరణితో వ్యవహరిస్తోందని కుకు ఎఫ్ఎం సహ–వ్యవస్థాపకుడు వినోద్ కుమార్ వ్యాఖ్యానించగా, ఇది భారత్‌లో ఇంటర్నెట్కు దుర్దినంగా భారత్ మ్యాట్రిమోనీ వ్యవస్థాపకుడు మురుగవేల్ జానకిరామన్ అభివరి్ణంచారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ పెండింగ్‌లో ఉన్నందున ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, ఏ యాప్‌ను డీలిస్ట్ చేయొద్దని గూగుల్‌కి ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ (ఏఐఎంఏఐ) సూచించింది.