ఆంధ్రా నయీంగా నారా లోకేశ్ : గౌతంరెడ్డి
- సంపాదనే ధ్యేయంగా టీడీపీ శిక్షణా తరగతులు
- ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు
- రాజ్యాంగేతర శక్తిగా సీఎం తనయుడు లోకేష్
- ధ్వజమెత్తిన వైఎస్సార్ సీపీ రాష్ర్ట అధికార ప్రతినిధి పి.గౌతంరెడ్డి
విజయవాడ : తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మూడు రోజుల పాటు జరిగిన శిక్షణ తరగతులు సంపాదనే ధ్యేయంగా సాగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధి పూనూరు గౌతంరెడ్డి ధ్వజమెత్తారు. దౌర్జన్యానికి మారుపేరైన టీడీపీ ఎమ్మెల్యేలకు ర్యాంకులు, ప్రజాధనాన్ని కొల్లగొట్టే వారికే నంబర్‌వన్ స్థానం ఇచ్చారని పేర్కొన్నారు. విజయవాడలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గౌతమ్‌రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దీనంగా ఉందని స్వయానా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెబుతున్నా రాష్ట్రానికి వచ్చే అరకొర నిధులను మాయచేసి ఆ పార్టీ ఎమ్మెల్యేలు జేబులు నింపుకొంటున్నారని విమర్శించారు.
టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో డబ్బు ఏవిధంగా సంపాదించాలి అన్నరీతిలో సాగాయని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో డబ్బే కీలకమని సీఎం చంద్రబాబు తమ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారని, ఒక్కొ ఎమ్మెల్యే రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లు సిద్ధం చేసుకోవాలని, లేకుంటే వారిని అనర్హులుగా ప్రకటిస్తామని చెప్పకనే చెప్పారని గౌతంరెడ్డి విమర్శించారు. ఇప్పటికే ఆయా ప్రజాప్రతినిధుల పేర్లు షీల్డ్ కవర్లలో రహస్యంగా ఉంచామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పరీక్షల్లో కాపీలు కొడుతూ పట్టుబడ్డారని, మంత్రి సుజాత ఇంట్లోకి రూ.10 లక్షలు వచ్చాయని, మరో ఎమ్మెల్యే బోండా ఉమా కారు రేసులు, ప్రభుత్వస్థలాలు కబ్జాచేసి ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని విమర్శించారు.
కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ సదావర్తి భూముల కుంభకోణం, నెల్లూరు కామాక్షి భూముల వ్యవహారం, యరపతినేని అక్రమమైనింగ్, చింతమనేని ఇసుక దందా, నకిలీ పత్తివిత్తనాల కుంభకోణంలో ప్రత్తిపాటి పుల్లారావు.. ఇలా ఒక్కొక్కరు కోట్లాది రూపాయాలు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. పుష్కరాల్లో రూ.3 మూడు నుంచి రూ.4కోట్ల మేర తన భార్య పేర కాంట్రాక్టులు దక్కించుకుని మేయర్ నిధులు బొక్కేశారన్నారు. విజయవాడకు చెందిన ఎమ్మెల్సీకే శానిటరీ దగ్గరనుంచి అన్ని రకాల కాంట్రాక్టులు దక్కుతున్నాని పేర్కొన్నారు.
లోకేశ్ బాబు రాజ్యాంగేతర శక్తి
ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్ బాబు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని గౌతమ్‌రెడ్డి విమర్శించారు. చినబాబు ప్రత్యక్ష పదవుల్లో లేకపోయినప్పటికీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు వార్నింగ్‌లు ఇస్తున్నట్లు సోషల్‌మీడియా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందని వివరించారు. చినబాబు బాధపడలేకపోతున్నామని ఆపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే వాపోతున్నారని, ఆంధ్రా నయీంలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.