Shashikumar
-
హిట్ సినిమా రీమేక్‌లో...
తమిళ దర్శకుడు, నటుడు కె. భాగ్యరాజా తెరకెక్కించిన సూపర్ హిట్ తమిళ చిత్రం ‘ముందానై ముడిచ్చు’ (1983). భాగ్యరాజా, ఊర్వశి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం తాజాగా రీమేక్ కాబోతోంది. ఈ రీమేక్‌లో హీరోయిన్గా ఐశ్వర్యా రాజేష్ నటిస్తారు. ఊర్వశి చేసిన పాత్రను ఐశ్వర్య చేయనున్నారు. హీరోగా దర్శకుడు శశికుమార్ నటిస్తారు. ఈ రీమేక్‌కు కథ, స్క్రీన్ ప్లే, మాటలు భాగ్యరాజానే అందిస్తుండటం విశేషం. జేయస్బీ ఫిల్మ్ స్టూడియో బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అప్పట్లో ఈ సినిమాను ‘మూడు ముళ్లు’గా తెలుగులో రీమేక్ చేశారు దర్శకులు జంధ్యాల. చంద్రమోహన్, రాధిక ముఖ్య పాత్రల్లో నటించారు. భార్య చనిపోయిన ఓ టీచర్ని ప్రేమించిన అమ్మాయి తన ప్రేమను ఎలా గెలుచుకుంది? అన్నది చిత్రకథాంశం. -
డీఎండీకే నేత ఇంటిపై బాంబు దాడి
టీనగర్(చెన్నై): పెరంబుదూరు సమీపంలో డీఎండీకే నేత ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు బాంబుతో దాడి చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి బాంబు దాడికి పాల్పడిన ముఠా కోసం గాలిస్తున్నారు. పెరంబుదూరు సమీపంలోని తండలంలో డీఎండీకే నేత శశికుమార్ నివసిస్తున్నారు. ఇతడు తండలం పంచాయతీ ఉపాధ్యక్షునిగా, డీఎండీకే యూనియన్ నిర్వాహకునిగా ఉన్నారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికల్లో శశికుమార్ పంచాయతీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు నిర్ణయించారు. ఇందుకోసం ఆయన శుక్రవారం ఉదయం నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు శశికుమార్ ఇంటిపై నాటు బాంబులు విసిరి పరారయ్యారు. అదృష్టవశాత్తు బాంబు దాడిలో ఎవరూ గాయపడలేదు. కాగా శశికుమార్ పంచాయతీ అధ్యక్ష పదవికి పోటీ చేయడం ఇష్టంలేని వర్గం ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు బాంబులు విసిరిన ముఠా కోసం గాలిస్తున్నారు. -
శశికుమార్ చేతికి గాయం
షూటింగ్లో నటుడు శశికుమార్ చేతికి గాయమైంది. ఆయన చేతి ఎముకలు విరగడంతో తారై తప్పట్టై చిత్ర షూటింగ్ రద్దు అయింది. వివరాల్లోకి వెళితే, బాల దర్శకత్వం వహిస్తున్నతాజా చిత్రం తారై తప్పట్టై. శశికుమార్, వరలక్ష్మి జంటగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గత కొన్ని వారాలుగా తంజావూరులో జరుగుతోంది. ఇటీవల శశికుమార్ విలన్‌తో పోరాడే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం శశికుమార్ చేతి ఎముక విరగడంతో చిత్ర యూనిట్ దిగ్భ్రాంతికి గురైంది. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా వైద్య బృందాన్ని, రెండు అంబులెన్స్‌లను చిత్ర యూనిట్ సిద్ధం చేసుకోవడంతో వెంటనే శశికుమార్‌ను వైద్య బృందం సాయంతో సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన చేతికి బలమైన గాయాలైనట్టు, ఎముక విరిగినట్టు తేల్చి పిండి కట్టు వేశారు. కొన్ని వారాల పాటుగా విశ్రాంతి తప్పదని శశికుమార్‌కు వైద్యులు సలహాలు ఇచ్చారు. దీంతో ఆ చిత్రం షూటింగ్ రద్దు అయింది. శశికుమార్ విశ్రాంతి కోసం మదురై వెళ్లారు. చిత్ర యూనిట్ సోమవారం చెన్నైకు తిరుగు పయనమైంది. శశికుమార్ పూర్తిగా కోలుకున్న తర్వాత షూటింగ్ మళ్లీ మొదలు అవుతుందని ఆ చిత్రయూనిట్ పేర్కొంది.