రంగంలోకి లోకాయుక్త
విజయనగరం కంటోన్మెంట్: విజయనగరం జిల్లాలో అధికారం అండతో ఇష్టానుసారం వ్యవహరించి...అర్హులకు దగ్గాల్సిన పోస్టుల్ని అమ్ముకున్న వైనంపై లోకాయుక్త దృష్టిసారించింది. ఈ మేరకు గజపతినగరం ఎమ్మెల్యే లేఖలపై స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు వచ్చేనెల 28న లోకాయుక్త కు హాజరు కావాలని ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్, ఎమ్మెల్యే రాసిన లేఖల ప్రకారం పోస్టుల పందేరం చేసిన కాంట్రాక్టర్ స్వామినాయుడుకు నోటీసులు జారీ చేసింది.
షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల్లో ఎమ్మెల్యే జోక్యం
ఈపీడీసీఎల్ పరిధిలోని సబ్స్టేషన్లలో షిఫ్ట్ఆపరేటర్ల పోస్టుల్లో డబ్బులిచ్చినవారినే గజపతినగరం ఎమ్మెల్యే కేఏ నాయుడు నియమించుకునేలా సిఫార్సుల లేఖలిచ్చారని గజపతినగరం మండలం లోగిశ గ్రామానికి చెందిన టీడీపీ మాజీ పరిశీలకుడు సామంతుల పైడిరాజు మార్చి 23న లోకాయుక్తను ఆశ్రయించారు. కాంట్రాక్టర్ స్వామినాయుడు, ఎస్ఈ తదితరులందరికీ సిఫార్సు లేఖలిచ్చారని రంగంలోకి లోకాయుక్త ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంట్రాక్టర్ స్వామినాయుడు
నిబంధనలనకు విరుద్ధంగా వ్యవహరించారనీ, ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకున్న నిరుద్యోగులను పట్టించుకోలేదని చెప్పారు. పత్రికా ప్రకటనలు గానీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ను కానీ పట్టించుకోకుండా కేవలం ఎమ్మెల్యే లేఖలనే ఆధారంగా చేసుకుని అర్హులకు అన్యాయం చేశారని ఫిర్యాదు చేయడంతో లోకాయుక్త దీనిని విచారణకు తీసుకుంది.
సాక్షి కథనాల ఆధారంగా ఫిర్యాదు
ఎమ్మెల్యే కేఏ నాయుడు తన సిఫార్సు లేఖలతో నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని తన అధికారంతో ఏ పోస్టుల్నీ వదలడం లేదనీ సాక్షి దినపత్రికలో ఈ అంశంపై వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. జనవరి 29న ‘పైరవీలే పరమావధి’ అంటూ ఎమ్మెల్యే రాసిచ్చిన పైరవీ లేఖలతో ప్రచురణ అయింది. అనంతరం ‘ఎమ్మెల్యే అభ్యర్ధా? అయితే ఓకే! ’ అంటూ మరో శీర్షికతో సాక్షి దినపత్రిక ప్రధాన సంచికలో కూడా కథనం ప్రచురితమైంది. ఈ కథనాలపై వివిధ పార్టీలు, వైఎస్సార్ సీపీ కూడా ధర్నాలు చేపట్టాయి. ఈ కథనాలను ఆధారంగా చేసుకుని సామంతుల పైడిరాజు లోకాయుక్తకు ఫైల్ చేశారు. విచారణకు స్వీకరించిన లోకాయుక్త విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పుడే ప్రారంభమైంది.
ఎమ్మెల్యే కె.ఎ.నాయుడి చర్యల వల్ల నిరుద్యోగులు బలైపోయారు. తాను సూచించిన వారికే ఉద్యోగాలివ్వాలని పైరవీల లేఖలు రాశారు. స్థానికులకు కాకుండా ఇతర నియోజకవర్గాలు, మండలాలకు చెందిన అనర్హులకు పోస్టులను కేటాయించారు. దీనిపై లోకాయుక్తను ఆశ్రయించాను. ఎమ్మెల్యే అక్రమాలపై మేం చేసే అసలు పోరాటం ఇప్పుడే ప్రారంభమైంది. లోకాయుక్త న్యాయ స్థానంలో అర్హులకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం.
- సామంతుల పైడిరాజు, లోగిశ, గజపతినగరం