మట్టి పోసి.. నిధులు నొక్కేసి!
ఎమ్మిగనూరు, న్యూస్‌లైన్: వర్షాధారమే అయినప్పటికీ నాలుగు దశాబ్దాలుగా గాజులదిన్నె ప్రాజెక్టు కోడుమూరు, గోనెగండ్ల, వెల్దుర్తి, డోన్, క్రిష్ణగిరి మండలాల్లోని పంట పొలాలను తడుపుతూ.. ప్రజల దాహార్తి తీరుస్తోంది. 5.25 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 32,500 ఎకరాలకు రబీలో సాగునీరు ఇవ్వాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. నాలుగేళ్ల క్రితం వరకు కుడి కాలువ కింద 21వేలు, ఎడమ కాలువ కింద 5వేల ఎకరాల ఆయకట్టు సాగయ్యేది. అయితే ప్రాజెక్టు నుండి బండగట్టు ర క్షిత మంచినీటి పథకం పేరుతో పత్తికొండ నియోజకవర్గంలోని 21 గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నారు. అదేవిధంగా డోన్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీ ప్రజలతో పాటు 40 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు క్రిష్ణగిరి వద్ద మంచినీటి పథకాన్ని నిర్మిస్తున్నారు. ఫలితంగా ఏటా ఆయకట్టు విస్తీర్ణం తగ్గుతోంది.
ఇదే సమయంలో ప్రాజెక్టు పటిష్టతకు చర్యలు చేపట్టకపోతే మనుగడ కష్టమంటూ 1996లో సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్(సీడీఓ), ఇరిగేషన్ ఈఎన్సీ బృందం ఓ నివేదిక రూపొందించింది. ఈ నేపథ్యంలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, కోడుమూరు దివంగత ఎమ్మెల్యే శిఖామణి 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు 2009లో ఆయన పరిపాలనా అనుమతులివ్వగా.. 2011లో ఆధునికీకరణకు టెండర్లను ఆహ్వానించారు. హైదరాబాద్‌కు చెందిన హార్విన్ కన్స్ట్రక్షన్ గ్రూపు ఒక శాతం తక్కువతో టెండర్‌ను రూ.43.9 కోట్లకు దక్కించుకుంది. 2011 ఆగస్టు నుంచి 2013 సెప్టెంబర్ 30వ తేదీ లోపు పనులను పూర్తి చేసేలా అగ్రిమెంట్ ఖరారైంది. జపాన్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ఏజెన్సీ(జేఐసీఏ) నిధులతో చేపట్టే ఈపనుల పర్యవేక్షణ నీటిపారుదల ఇంజనీర్లుతోపాటు జపాన్ ప్రతినిధుల అజమాయిషీ ఉంది. మంజూరైన నిధులతో ఆనకట్ట(బండ్)పటిష్టత, డ్యామేజైన 6 స్లూయిస్ గేట్ల మరమ్మతు, వరద ఉద్ధృతిని నుంచి ప్రాజెక్టు పరిరక్షణకు రెండు అదనపు స్లూయిస్ గేట్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అదేవిధంగా ఎడమ కాలువకు 25 కిలోమీటర్లు, కుడి కాలువకు 36 కిలోమీటర్ల వరకు లైనింగ్, కాలువ గట్ల పటిష్టత పర్చాల్సి ఉంది.
మట్టి పనులకే ప్రాధాన్యం: అధికార పార్టీ ప్రధాన ప్రజాప్రతినిధులకు భారీగా గుడ్‌విల్ ఇచ్చుకోవాల్సి రావడం.. అధికారుల పర్సెంటేజీల నేపథ్యంలో కాంట్రాక్టర్ ప్రధానమైన ప్రాజెక్టు గేట్లు, బండ్ పటిష్టతను పక్కనపెట్టి మట్టి పనులకే ప్రాధాన్యమిచ్చాడు. ఎడమ కాలువకు 17.3 కిలోమీటర్లు, కుడి కాలువకు 26.35 కిలోమీటర్ల మేర లైనింగ్ చేశారు. కాలువ గట్ల పటిష్టతకు గ్రావెల్ ప్రెస్సింగ్ పనులు చేయాల్సిన చోట రైతుల పొలం గట్టున ఉన్న మట్టిపోసి మెరుగులుదిద్దారు. బండ్ డ్యామేజీ ఉన్న చోట రివిట్మెంట్, రెండు కెనాల్ రెగ్యులేటర్ల నిర్మాణం చేపట్టి పని పూర్తయిందనిపించారు. ఈ పనులకు ఇప్పటికే రూ.38కోట్ల బిల్లు కూడా తీసేసుకున్నాడు. మరో రెండు కోట్ల రూపాయలకు బిల్లులు సిద్ధమయ్యాయి. మిగిలిన ప్రధానమైన పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్ కుంటి సాకులు చెబుతూ చేతులెత్తేశాడు. చేయాల్సిన పనులకు సరిపడా నిధులు లేవని.. అగ్రిమెంట్ గడువు కూడా ముగిసిందంటూ కాంట్రాక్టర్ తప్పుకోవడం గమనార్హం.
అధికారులు సైతం ముందుగా ప్రాజెక్టు పటిష్టత పనులు చేయించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. డిస్ట్రిబ్యూటరీ కాలువలకు లైనింగ్ చేస్తే తప్ప పంట పొలాలకు నీరందదని రైతులు వాపోతున్నారు. ఆధునికీకరణ పనుల్లో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని.. ఉన్నతాధికారులచే విచారణ చేపట్టాలని గతంలో ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ప్రకాష్‌రెడ్డి ఇరిగేషన్ ప్రధాన అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.