Sikar district
-
బంజరు భూమిని బంగరు భూమి చేసింది
‘కలిసి ఉంటేనే కాదు కష్టపడితే కూడా కలదు సుఖం’ అని అనుభవపూర్వకంగా తెలుసుకుంది సంతోష్ దేవి.తన రెక్కల కష్టంతో బంజరు భూమిని బంగరు భూమిగా మార్చింది. ఎంతోమంది రైతులను తన మార్గంలో నడిపిస్తోంది.రాజస్థాన్‌లోని సికార్ జిల్లా బేరి గ్రామంలో... 1.25 ఎకరాల బంజరు భూమితో సంతోష్ దేవి ఖేదార్ ప్రయాణం ప్రారంభమైంది. కుటుంబం వీడిపోవడంతో తన భర్త వాటాగా 1.25 ఎకరం భూమి వచ్చింది. భర్త రామ్ కరణ్ హోంగార్డ్. చాలీచాలని జీతం. దీంతో వ్యవసాయం వైపు మొగ్గు చూపింది సంతోష్‌దేవి.‘పది, ఇరవై ఎకరాలు ఉన్నవారికే దిక్కు లేదు. ఎకరంతో ఏం సాధిస్తావు? అప్పులు తప్ప ఏం మిగలవు!’ అన్నారు చాలామంది. ఈ నేపథ్యంలో ‘వ్యవసాయం లాభసాటి వ్యాపారం’ అని నిరూపించడానికి రంగంలో దిగింది సంతోష్ దేవి.‘నేను చదువుకోవాలని మా నాన్న కోరుకున్నారు. గ్రామీణ వాతావరణాన్ని ఇష్టపడే నాకు చదువుల కంటే వ్యవసాయం అంటేనే ఇష్టం’ అంటుంది సంతోష్‌దేవి. తాతగారి పొలంలో ఎప్పుడూ రసాయనిక ఎరువులు వాడకున్నా మంచి దిగుబడి వచ్చేది. ఇక్కడ మాత్రం భిన్నమైన పరిస్థితి. చాలా ఏళ్లుగా రసాయనాలు వాడడం వల్ల పొలం నిస్సారంగా మారింది. చుట్టు పక్కల నీటి వనరులు లేకపోవడంతో జొన్న, సజ్జలాంటి సంప్రదాయ పంటలే పండించేవారు.కలుపు మొక్కలతో గందరగోళంగా ఉన్న పొలాన్ని ఒక దారికి తేవడంతో మొదటి అడుగు వేసింది. రసాయనిక ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువులు వాడాలని నిర్ణయించుకుంది. దానిమ్మ పండించమని, తక్కువ భూమిలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని సికార్ వ్యవసాయ అధికారి సలహా ఇచ్చాడు. ఆ సలహా వారి జీవితాన్నే మార్చేసింది.220 దానిమ్మ మొక్కలను కొనడానికి గేదెను అమ్మేయాల్సి వచ్చింది. మొక్కలు కొనగా మిగిలిన డబ్బుతో పొలంలో గొట్టపు బావిని వేయించింది. నీటి ఎద్దడి ఉన్న ఆప్రాంతంలో బిందు సేద్య పద్ధతిని నమ్ముకుంది. చుక్క నీరు కూడా వృథా చేయవద్దని నిర్ణయించుకుంది. జనరేటర్‌ను అద్దెకు తీసుకుంది. గ్రామంలోని ఎంతోమంది రైతుల సలహాలు తీసుకొని సేంద్రియ ఎరువు తయారీ మొదలుపెట్టింది. లేయర్ కటింగ్, సేంద్రియ పురుగు మందులకు బెల్లం కలపడంలాంటి రకరకాల టెక్నిక్‌ల గురించి తెలుసుకుంది. మూడేళ్ల కఠోర శ్రమ ద్వారా దానిమ్మ పండ్ల తొలి దిగుబడితో మూడు లక్షల లాభం వచ్చింది. సేంద్రియ ఎరువును ఎక్కువగా వాడడం వల్ల నేల సారవంతంగా మారింది.భర్త పోలీస్‌స్టేషన్ నుంచి వచ్చిన తరువాత, పిల్లలు స్కూలు నుంచి వచ్చిన తరువాత నేరుగా పొలానికే వెళ్లేవాళ్లు. ‘ఫలితం ఎలా ఉండబోతుందో తెలియదు. కాని బాగా కష్టపడాలనుకున్నాం’ అని ఆ రోజులను గుర్తు చేసుకుంది సంతోష్‌దేవి. పండ్లతోటను నిర్వహించే అనుభవం రావడంతో యాపిల్‌లాంటి ఇతర పండ్లను పండించడంపై దృష్టి పెట్టింది.దానిమ్మ మొక్కల మధ్య నిర్దిష్టమైన దూరం ఉండాలి. ఆ ఖాళీ స్థలంలో కలుపు లేకుండా చూడాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఖాళీల మధ్య మోసంబి మొక్కలు నాటింది. ఇది కూడా మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఆ తరువాత నిమ్మ నుంచి బెల్‌లాంటి ఎన్నో మొక్కలను నాటింది. పొలంలో సోలార్ ΄్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడంతో ఖర్చు తగ్గింది.‘మన దేశంలో రైతులు పడుతున్న కష్టాలకు కారణం వారు పండిస్తున్న దానికి సరైన ధర లభించకపోవడమే. దళారులు లాభాలన్నీ అనుభవిస్తున్నారు’ అంటున్న సంతోష్‌దేవి ఒక్క పండును కూడా దళారులకు అమ్మదు. అన్ని పండ్లూ నేరుగా పొలంలోనే అమ్ముతారు.సంతోష్ సాధించిన విజయాన్ని చూసి గ్రామంలోని ఇతర రైతులు కూడా దానిమ్మ మొక్కలను పెంచడంప్రారంభించారు. అయితే చాలామంది విఫలమయ్యారు. అలాంటి వారు సంతోష్‌దేవిని సలహా అడిగేవారు. నాణ్యమైన మొక్కల కొరత వల్లే వారు విఫలమవుతున్నారు అని గ్రహించిన సంతోష్ దేవి ఆ లోటును భర్తీ చేయడానికి కొత్త మొక్కల కోసం ‘షెకావది కృషి ఫామ్ అండ్ నర్సరీ’ప్రారంభించింది.కష్టఫలంనేను, నా భర్త, పిల్లలు మాత్రమే పొలంలో పనిచేసేవాళ్లం. కూలీలతో పనిచేయించే స్థోమత మాకు లేదు. అయితే ఎప్పుడూ కష్టం అనుకోలేదు. ఇంట్లో ఎలా సంతోషంగా ఉంటామో, పొలంలో అలాగే ఉండేవాళ్లం. కబుర్లు చెప్పుకుంటూనే కష్టపడేవాళ్లం. మా కష్టం ఫలించినందుకు సంతోషంగా ఉంది.– సంతోష్‌దేవి -
రాజస్థాన్‌లో భూకంపం.. భయంతో జనం పరుగులు
రాజస్థాన్‌లో శనివారం అర్థరాత్రి కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. సికార్, చురు, నాగౌర్ జిల్లాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైంది. భూకంప కేంద్రం సికార్ జిల్లాలోని హర్ష పర్వతం అని తెలుస్తోంది. భూకంపం కారణంగా జనం భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం శనివారం అర్థరాత్రి 11.47 గంటలకు ఈ భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం ఈ భూకంప తీవ్రత రియాక్టర్ స్కేల్‌పై 4.2గా నమోదైంది. భూకంపానికి భయపడి ఇళ్ల నుంచి బయటకు వచ్చిన జనం చాలాసేపు ఇళ్ల బయటనే ఉండిపోయారు. పరిస్థితి కుదుటపడ్డాక వారంతా తిరిగి తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు. -
ఆలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మహిళా భక్తులు మృతి..
జైపూర్: రాజస్థాన్ సీకర్‌లోని కాటుశ్యామ్‌జీ ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం 5 గంటలకు ఆలయం గేట్లు తెరవగానే భారీగా తరలివచ్చిన భక్తులు ఒక్కసారిగా లోనికి ప్రవేశించే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని జైపూర్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్ని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముగ్గురు మహిళా భక్తులు చనిపోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. सीकर में खाटूश्याम जी के मंदिर में भगदड़ होने से 3 दर्शनार्थी महिलाओं की मृत्यु बेहद दुखद एवं दुर्भाग्यपूर्ण है। मेरी गहरी संवेदनाएं शोकाकुल परिजनों के साथ हैं, ईश्वर उन्हें यह आघात सहने की शक्ति प्रदान करें एवं दिवंगतों की आत्मा को शांति प्रदान करें। — Ashok Gehlot (@ashokgehlot51) August 8, 2022 ప్రధాని నరేంద్రమోదీ కూడా ఈ విషద ఘటన బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. Saddened by the loss of lives due to a stampede at the Khatu Shyamji Temple complex in Sikar, Rajasthan. My thoughts are with the bereaved families. I pray that those who are injured recover at the earliest. — Narendra Modi (@narendramodi) August 8, 2022 చదవండి: దారుణం.. ఆలస్యంగా వచ్చాడని ఓలా డ్రైవర్‌ను చితకబాదిన గ్యాంగ్ -
క్వారంటైన్ రుణం తీర్చుకున్నారు.. ఇలా!
జైపూర్: కష్టకాలంలో తమకు ఆశ్రయమిచ్చిన విద్యాలయానికి వలస కార్మికులు వినూత్నంగా ధన్యవాదాలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో తమకు గూడు కల్పించిన స్కూల్‌కు కొత్త రంగులు అద్ది రుణం తీర్చుకున్నారు. ఈ స్ఫూర్తిదాయక ఘటన రాజస్థాన్ సికర్ జిల్లా పల్సానా గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. కరోనా నేపథ్యంలో పల్సానా గ్రామంలోని పాఠశాల భవనంలో కొంతమంది వలస కార్మికులను క్వారంటైన్లో ఉంచారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు వీరిలో ఉన్నారు. గ్రామస్థుల ఆతిథ్యం వారిని అమితంగా ఆకట్టుకోవడంతో ఊరికి ఏదోటి చేయాలనుకున్నారు. తమకు ఆశ్రయయిచ్చిన పాఠశాలకు రంగులు వేసి చాలా కాలం అయినట్టు గుర్తించిన కార్మికులు.. స్కూల్‌కు పెయింటింగ్ వేస్తామని గ్రామ సర్పంచ్‌తో చెప్పారు. దాంతో ఆ సర్పంచ్, పాఠశాల సిబ్బంది అవసరమైన వస్తువులు తెప్పించారు. కార్మికులు తమ క్వారంటైన్ వ్యవధి ముగిసేలోగా పాఠశాల భవనానికి, గోడలకు పెయింట్ వేసేశారు. ఆ పని చేసినందుకు ఆ గ్రామ సర్పంచ్, వారికి డబ్బులివ్వబోతే సున్నితంగా తిరస్కరించారు. ‘మాకు ఇన్నాళ్లు ఉచితంగా భోజనాలు పెట్టారు. అందుకుగాను మేము ఏదోటి చేయాలనుకున్నాము. పాఠశాల భవనానికి పెయింట్ వేసే అవకాశం లభించింది. మాకు డబ్బులివ్వాల్సిన అవసరం లేదు. అయినా మీరు ఏమైనా ఇవ్వదలచుకుంటే మీ ఊరి ఈ పాఠశాలకే ఇవ్వండి’ అంటూ కార్మికులు డబ్బును నిరాకరించారు. కాగా, ఆ పాఠశాలకు తొమ్మిదేళ్లుగా రంగులు వేయలేదని తెలుస్తోంది. వలస కార్మికుల చొరవతో ఇన్నాళ్లకు ఆ విద్యాలయం కొత్త అందాలు సంతరించుకుంది. ఈ ఘటన గురించి తెలిసిన వారు వలస కార్మికులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘కోట’ నుంచి విద్యార్థులను తీసుకొచ్చినట్టుగా.. -
కేవలం ఇంటర్‌తో.. డాక్టర్ అయ్యాడు!
రాజస్థాన్: ఇంటర్ మాత్రమే చదివిన అతనికి రైలులో ఎంబీబీఎస్ సర్టిఫికేట్ దొరకడంతో...ఏకంగా డాక్టర్‌గా చెప్పుకొని 90,000 మంది రోగులను చికిత్స పేరిట మోసం చేశాడు. 44 ఏళ్ల మన్ సింగ్ బాగెల్ రాజస్థాన్‌లోని సికార్ జిల్లాకు చెందిన ఓ ఆసుపత్రిలో డాక్టర్‌గా చెప్పుకొంటూ ప్రజలను మోసం చేస్తున్న అతన్ని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కేవలం 12 వ తరగతి వరకు మాత్రమే చదివి, ఆస్పత్రిలో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తూ నెలకు లక్ష రూపాయల వేతనం పొందుతూ..5 నెలలుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతన్ని పోలీసులు ఆసుపత్రిలో అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో భాగంగా..ఐదేళ్ల క్రితం మధురాలో రైలులో ప్రయాణిస్తున్నప్పుడు అనుకోకుండా తనకు డాక్టర్ మనోజ్ కుమార్ మెడికల్ డిగ్రీ దొరికిందని బాగెల్ పోలీసులకు చెప్పాడు. దీంతో తాను డిగ్రీ తీసుకోకుండా ఆగ్రాలో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించానని పోలీసులకు చెప్పాడు. బాగెల్ ఆసుపత్రిలో ఇచ్చిన నకిలీ డిగ్రీ కాపీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాగెల్ గత సంవత్సరం సికార్ ఆసుపత్రిలో 'డాక్టర్ కావలెను' అన్న ప్రకటన చూసి, ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంటర్వ్యూకు హాజరయ్యి, ఎంపికయ్యాడు. అతను చేరిన కొన్ని నెలల తర్వాత ఆసుపత్రి అధికారులు బాగెల్ చికిత్స గురించి ఫిర్యాదులు స్వీకరించడం ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఒక సందర్భంలో రోగి పరిస్థితి క్షీణించడంతో.. అతన్ని మరో ఆసుపత్రికి పంపవలసి వచ్చింది. బాగెల్‌ను 420 (మోసం), 467 (ఫోర్జరీ ఆఫ్ డాక్యుమెంట్), 468 (మోసం కోసం ఫోర్జరీ) కింద పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలావుండగా.. బాగెల్ ఇద్దరు తమ్ముళ్ళు ఆగ్రాలో మెడికల్ షాపులు నడుపుతున్నారు. -
రాజస్థాన్‌లో రెండు ప్రమాదాలు: 19మంది మృతి
సికార్/జైపూర్: రాజస్థాన్‌లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 19మంది మృతిచెందారు. వీరిలో నలుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జాతీయ రహదారి 11పై ఓ ట్రక్కును రాజస్థాన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు సర్వీసు (ఆర్‌పీటీఎస్) బస్సు బుధవారం ఉదయం ఢీకొన్న ప్రమాదంలో 11మంది చనిపోగా మరో 12మంది గాయపడ్డారు. బస్సు డ్రైవర్ మరో బస్సును ఓవర్టేక్ చేస్తుండగా ఎదురుగా వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. క్షతగాత్రులను ఫతేపూర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే 11మంది చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతులలో ఎనిమిదిమందిని బర్కత్ అలీ, మణిరామ్, సిరాజుద్దీన్, నోపారం, రాజేంద్ర, గోపిరామ్, షకీల్, సురేంద్రగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన 12మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో జైపూర్ ఆస్పత్రికి తరలించారు. సికార్ కలెక్టర్ నరేష్కుమార్ థక్రల్, ఎస్పీ వినిత్‌కుమార్, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. కాగా, మరో ప్రమాదంలో 8మంది మృతిచెందారు. రెన్వాల్ ప్రాంతంలో ట్రక్కును టెంపో మంగళవారం రాత్రి ఢీకొన్న ఈ సంఘటనలో మరో ఆరుగురు గాయపడ్డారు. బాధితులు చోము పట్టణంలో వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను పప్పు పరేక్, మొహమ్మద్ అలీ(36), షరీఫ్(45), షమా బానో(35), గుల్షన్ బానో(56), ఫిరోజ్(35), రిహాన్(9), ఆహిల్(3)లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. -
స్వైన్ ప్లూతో రాజస్థాన్ లో ఏడుగురి మృతి
-
స్వైన్ ప్లూతో రాజస్థాన్ లో ఏడుగురి మృతి
జైపూర్: స్వైన్ ప్లూ దేశంలో వేగంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. స్వైన్ ప్లూతో రాజస్థాన్ లో ఏడుగురి మృతి చెందారు. మరో 19 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. బన్స్ వారా, బార్మర్, టోంక్, కోటా, జైపూర్ ప్రాంతాలకు చెందిన వారు మృతుల్లో ఉన్నారని అధికారులు తెలిపారు. జైపూర్, సికార్, టోంక్, కోటా, ఇతర జిల్లాలో స్వైన్ ప్లూ కేసులు నమోదయినట్టు వెల్లడించారు. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో రాజస్థాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్యాధికారులకు అప్రమత్తం చేసింది. -
డబ్బు అడిగిందని హత్య చేశాడు
జైపూర్: తనతో అక్రమ సంబంధంతో పెట్టుకున్న మహిళను ప్రియుడు హతమార్చిన ఘటన రాజస్థాన్ లోని సికార్ జిల్లాలో చోటు చేసుకుంది. పటాన్ ప్రాంతంలోని బాద్వాడీ గ్రామం సమీపంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. సుమన్(25) అనే వివాహిత ధర్మపాల్(24) అనే ట్రక్కు డైవర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతేకాకుండా డబ్బు కోసం అతడిని వేధించసాగింది. తనకు రూ.10 వేలు కావాలని డిమాండ్ చేయడంతో ఆమెను అంతమొందించాలని ధర్మపాల్ పన్నాగం పన్నాడు. ఆమెను నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపాడు. తర్వాత ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా తన మామగారికి చెప్పాడు. ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో ధర్మపాల్ ను అరెస్ట్ చేశారు. రెండేళ్లుగా సుమన్ తో పరిచయం ఉందని, పదేపదే తనను డబ్బు అడుగుతుండడంతో ఆమెను హత్య చేశానని ఇంటరాగేషన్ లో ధర్మపాల్ చెప్పాడని పోలీసులు తెలిపారు.